logo

‘బొండాలు’ సేకరణపై కేంద్రానికి ప్రతిపాదన: జేసీ

రబీలో బొండాలు రకం ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే అంశాన్ని పరిశీలిస్తున్నారని సంయుక్త కలెక్టర్‌ ఇలక్కియ చెప్పారు.

Published : 26 Mar 2023 03:23 IST

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: రబీలో బొండాలు రకం ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే అంశాన్ని పరిశీలిస్తున్నారని సంయుక్త కలెక్టర్‌ ఇలక్కియ చెప్పారు. శనివారం ఆమె ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో బొండాలు రకం ధాన్యం ఎక్కువగా పండించిన అంశం రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఉందన్నారు. ఈ మేరకు నివేదిక పంపామన్నారు. బొండాలు రకం ధాన్యం సేకరణ ద్వారా వచ్చే ఉప్పుడు బియ్యాన్ని భారత ఆహార సంస్థ తీసుకునేలా ఏర్పాట్లు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఉన్నతాధికారులు ప్రతిపాదన పంపినట్లు చెప్పారు. అక్కడి నుంచి అనుమతి వస్తే బొండాలు రకం ధాన్యాన్ని ఆర్బీకేల ద్వారా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తారని తెలిపారు. ఇప్పటికి ఇంకా ఎటువంటి మార్గదర్శకాలు రాలేదన్నారు. రబీ ధాన్యం సేకరణకు ఏర్పాట్లు మొదలు పెట్టామన్నారు. వచ్చేనెలా రెండో వారం నుంచి జిల్లాలో ధాన్యం ఉత్పత్తి అవుతుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. ఈలోగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రాథమిక ప్రక్రియ పూర్తి చేశామన్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సంబంధిత శాఖలను సిద్ధం చేస్తున్నామన్నారు. సీఎంఆర్‌ రైస్‌మిల్లులను గుర్తిస్తున్నట్లు చెప్పారు. కొన్ని మండలాల్లో టెండర్‌ ప్రొక్యూర్‌మెంట్‌ విధానాన్ని రబీలో అమలు చేయనున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని