logo

కొవిడ్‌ బిల్లులపై కలెక్టర్‌ ఆరా

కొవిడ్‌ బిల్లుల ప్రకంపనలు ఇంకా వీడలేదు. ఆడిట్‌ శాఖ ద్వారా ఈ బిల్లులపై మూడు వారాల పాటు తనిఖీలు నిర్వహించిన విషయం విదితమే.

Published : 26 Mar 2023 03:47 IST

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: కొవిడ్‌ బిల్లుల ప్రకంపనలు ఇంకా వీడలేదు. ఆడిట్‌ శాఖ ద్వారా ఈ బిల్లులపై మూడు వారాల పాటు తనిఖీలు నిర్వహించిన విషయం విదితమే. ఈ పరిశీలన పూర్తయ్యేనాటికి కలెక్టర్‌ కృతికాశుక్లా సెలవులో ఉన్నారు. పది రోజుల తరవాత ఆమె శనివారం కలెక్టరేట్‌ నుంచి విధులు నిర్వహించడంతో మళ్లీ కొవిడ్‌ బిల్లుల ఆడిట్‌ వ్యవహారం మొదటికొచ్చింది. ఈ నివేదిక జిల్లా వైద్య, ఆరోగ్యశాఖకు పంపారు. దీనిలో రూ.7 కోట్ల బిల్లుల చెల్లింపునకు ఎటువంటి అభ్యంతరాలు లేకపోవడంతో వాటిని గుత్తేదారులకు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో రూ.7 కోట్ల విషయమై అభ్యంతరాలు చోటుచేసుకోవడంతో వీటిపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. కొవిడ్‌ మూడో దశకు సంబంధించి రూ.17 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. దీనిలో రూ.14 కోట్లకే బిల్లులు సమర్పించారు. ఈ బిల్లులు ఎంత వరకు నిజమైనవో ఆడిట్‌ అధికారులు నివేదిక ఇచ్చారు. ఈ నివేదికను శనివారం డీఎంహెచ్‌వో ఆర్‌.రమేశ్‌ కలెక్టర్‌ కృతికాశుక్లాకు అందజేశారు. ఈ శాఖ అధికారులు దీనిపై ఉరుకులు పరుగులు పెట్టారు. డీఎంహెచ్‌వో కార్యాలయంలో బిల్లులు ఎవరు పర్యవేక్షించారు, ఎవరు దాఖలు చేశారు, ఇవి ఎంత వరకు నిజమైనవి అనే కోణంలో విచారణకు సిద్ధమవుతున్నారు. ఆడిట్‌ అధికారులు రూ.14 కోట్ల బిల్లులను మూడు కేటగిరీల కింద విభజించారు. వీటిలో 50 శాతం ఏ-కేటగిరీలో ఉన్నట్లు తెలుస్తోంది. వీటిని చెల్లించడానికి అభ్యంతరం లేదని గుర్తించారు. మిగతా 50 శాతం బిల్లులను బీ, సీ-కేటగిరీల కింద విభజించారు. ఇప్పుడంతా వీటిపై చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంపై శనివారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ కృతికాశుక్లాను ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా నివేదక వచ్చిందని, దీన్ని పూర్తిస్థాయిలో పరిశీలిస్తున్నట్లు ఆమె చెప్పారు. దీనిపై విచారణ చేస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని