logo

కౌలు రైతుపై క‘రుణ’ లేమి

నేడు కౌలు రైతులే లేకుంటే సేద్యమే లేదేమో.. పంటల విస్తీర్ణంలో దాదాపు 90 శాతం వ్యవసాయం కౌలు రైతుల మీదే ఆధారపడి ఉంది.

Updated : 26 Mar 2023 05:33 IST

న్యూస్‌టుడే, ముమ్మిడివరం, మండపేట: నేడు కౌలు రైతులే లేకుంటే సేద్యమే లేదేమో.. పంటల విస్తీర్ణంలో దాదాపు 90 శాతం వ్యవసాయం కౌలు రైతుల మీదే ఆధారపడి ఉంది. అధిక శాతం కౌలు రైతులకు ప్రభుత్వ చేయూత అందటం లేదు. ఏటా విపత్తుల వల్ల నష్టాలు ఎదురవుతున్నా నేల తల్లినే నమ్ముకున్న కౌలు రైతులు క్రమంగా రుణభారంతో కుంగిపోతున్నారు. ప్రభుత్వపరంగా కొన్ని వెసులుబాట్లు కల్పిస్తున్నా క్షేత్ర స్థాయిలో  అమలు కావడం లేదు. పంట సాగు హక్కు పత్రాలు (సీసీఆర్‌సీ) పొందలేక కొందరు.. పొందినా బ్యాంకుల నుంచి రుణాలు విడుదల కాక మరికొందరు కౌలు రైతులు పెట్టుబడికి ప్రైవేటుగా అధిక వడ్డీలకు రుణాలు తేక తప్పటం లేదు.

డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని 1.78 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుండగా, సుమారు 1.30 లక్షల ఎకరాల సాగును కౌలు రైతులే చేస్తున్నారు. వీరికి ఎకరాకు ఖరీఫ్‌లో రూ.40 వేలు, రబీలో రూ.48 వేలకు పైగా పెట్టుబడి అవసరమవుతోంది. వారిలో అధిక శాతం రైతులకు బ్యాంకుల నుంచి పంట రుణాలు దక్కటం లేదు. అధిక వడ్డీలకు అప్పు చేయడమో, బంగారం ఉంటే కుదువ పెట్టడమో చేస్తేనే పెట్టుబడి సమకూరుతుంది.  

‘‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో కౌలు రైతులకు రుణాల విడుదల లక్ష్యం రూ.4 వేల కోట్లు. బ్యాంకులు మొదటి 9 నెలల్లో (డిసెంబరు వరకు) రూ.1,126 కోట్లు మాత్రమే మంజూరు చేశాయి. లక్ష్యంలో 1,63,811 మంది కౌలు రైతుల ఖాతాలకే పంట రుణ పొడిగింపును వర్తింపజేశారు. ఇది కేవలం 49.37 శాతం మాత్రమే. కౌలు రైతులకు బ్యాంకులు మరింత బాసటగా నిలవాల్సిన అవసరం ఉంది.’’  ఈనెల 11న రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తెలిపిన సమాచారమిది..

సీసీఆర్సీ కార్డులున్నా...

జిల్లాలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి 59,800 సాగు హక్కు పత్రాలు (సీసీఆర్సీ) ఇచ్చారు. జిల్లాలో 40 శాతం కౌలు రైతులకు మాత్రమే ఆ పత్రాలు లభించాయి.  ఈకార్డున్న ప్రతి కౌలు రైతుకూ పంట రుణం ఇవ్వాలని ప్రభుత్వం సూచించినా అమలు కావడం లేదు. కౌలుకిచ్చిన భూ యజమాని ముందే రుణం తీసుకుని ఉంటున్నారు.

జేఎల్‌జీలతో మేలేదీ..

కౌలు రైతులకు పంట రుణాలు ఇప్పించాలనే లక్ష్యంతో వ్యవసాయశాఖ ప్రతి ఐదుగురు కౌలు రైతులతో ఒక్కో జాయింట్‌ లయబిలిటీ గ్రూప్‌ (జేఎల్‌జీ)ను ఏర్పాటు చేయ సంకల్పించింది. ఈ గ్రూపుల వల్లా కౌలు రైతులకు రుణ పరపతి మెరుగుపడలేదు. గ్రూపు సభ్యుల్లో ఒక్కొక్కరు మూడు నుంచి ఐదు ఎకరాలు కౌలు చేస్తున్నా వారికి బ్యాంకులు గరిష్ఠంగా రూ.2 లక్షలు మాత్రమే రుణం ఇస్తున్నట్లు సమాచారం. గ్రూపులో ఏరైతు రుణం తీసుకున్నా దాన్ని తిరిగి చెల్లించకపోతే మిగిలిన రైతులకు అడుగుతారనే తలంపుతో జేఎల్‌జీలోని మిగతా వారు ఆసక్తి చూపడం లేదు. సీసీఆర్సీ కార్డులున్న కౌలు రైతులకూ బ్యాంకులు స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం రుణం విడుదల చేయటం లేదు. వారు సాగు చేసే విస్తీర్ణంతో సంబంధం లేకుండా రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు రుణం ఇస్తున్నాయంతే. జిల్లాలో కౌలు రైతులకు రూ.30.90 కోట్ల రుణాలిస్తే.. సీసీఆర్సీ కార్డు పొందిన కౌలు రైతులకు ఇచ్చింది రూ.12 కోట్లే. మిగిలిన 18.90 కోట్లు జేఎల్‌జీ గ్రూపు సభ్యులకు అందజేశారు. పంట రుణాలకు సంబంధించి కౌలు రైతులకు స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ అమలు కావడం లేదు. ఖరీఫ్‌లో ఎకరాకు రూ.42 వేలు,  రబీ పంటకైతే రూ.46 వేలకు ఈ ఏడాది జనవరిలో స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ పరిమితి పెంచినా ఆమేరకు కౌలు రైతులకు రుణాలు విడుదల కావడం లేదు. జిల్లాలో డిసెంబరు నాటికి రూ.4113 కోట్లు పంట రుణాల విడుదల లక్ష్యంకాగా, వాటిలో అసలు రైతులకే రూ.3,134 కోట్లు, అంటే 80 శాతం వరకు రుణాలు విడుదలవ్వడం గమనార్హం.

హామీ ఇస్తేనే దక్కేది..

కౌలు రైతులు పంట రుణాలు పొందడం గగనమే. నేను 8 ఎకరాలు కౌలు చేస్తున్నా. సుమారు రూ.3 లక్షలకు పైగా పెట్టుబడి పెడుతున్నా. ఏటా సీసీఆర్సీ కార్డు పునరుద్ధరించుకుంటున్నా. ఎప్పుడూ బ్యాంకులో రుణం దక్కలేదు. భూ యజమాని హామీ ఇస్తే బ్యాంకులో పంట రుణం ఇస్తామంటున్నారు. ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పు చేసి పెట్టుబడి పెడుతున్నా. -నిమ్మకాయల జీవన్‌కుమార్‌, కౌలు రైతు, మండపేట


మంజూరుకు చర్యలు తీసుకుంటున్నాం..

కౌలు రైతులకు రుణాల మంజూరుకు చర్యలు తీసుకుంటున్నాం. పంటలకు ఈ-క్రాప్‌ చేయించుకుని, ఆ  సర్వే నంబర్ల ఆధారంగా అసలు రైతు రుణం పొందితే కౌలు రైతుకు ఇవ్వడానికి అవకాశం లేదు. కౌలు రైతులు జేఎల్‌జీ గ్రూపులు ఏర్పాటు చేసుకుంటే  రుణాలు అందించడానికి అవకాశం ఉంటుంది. జిల్లాలో రూ.18.90 కోట్లు జేఎల్‌జీ గ్రూపులకు పంట రుణాలు ఇచ్చారు. సీసీఆర్సీ కార్డులున్న కౌలు రైతులకు వ్యక్తిగతంగా పంట రుణాలు రూ.12 కోట్లు ఇచ్చాం. -కె.లక్ష్మీనారాయణ, లీడ్‌ బ్యాంకు జిల్లా మేనేజరు, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని