logo

వేతన వేదన.. ఆర్థిక యాతన

రాజమహేంద్రవరం ప్రభుత్వ జిల్లా వైద్యశాలను బోధనాసుపత్రిగా మార్చి వైద్య కళాశాలను నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైద్య సేవలు, రోగుల తాకిడి పెరిగాయి.

Updated : 26 Mar 2023 05:31 IST

రాజమహేంద్రవరం సర్వజన ఆసుపత్రి ఎదుట సిబ్బంది నిరసన

రాజమహేంద్రవరం ప్రభుత్వ జిల్లా వైద్యశాలను బోధనాసుపత్రిగా మార్చి వైద్య కళాశాలను నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైద్య సేవలు, రోగుల తాకిడి పెరిగాయి. ఇక్కడివరకు బాగానే ఉన్నా రీస్ట్రక్చరింగ్‌ పేరుతో వైద్య విధాన పరిషత్తులో పనిచేస్తున్న ఇక్కడి వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది, ఇతర ఉద్యోగులను చాలా మందిని సీహెచ్‌సీలు, ప్రాంతీయ ఆసుపత్రులకు గతేడాది అక్టోబర్‌ నుంచి బదిలీ చేసేశారు. ఇందులో కొందరు వైద్యులు, ఇతర సిబ్బందిని ఫారిన్‌ డిప్యుటేషన్‌ పేరుతో ఇక్కడే ఉంచి డైరెక్టర్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌(డీఎంఈ) నుంచి వారి స్థానంలో కొత్త సిబ్బంది వచ్చేంత వరకు పనిచేయాలని ఆదేశించారు. అలా ఆసుపత్రిలో ఉన్న మొత్తం 87 మందికి రెండు నెలలుగా వేతనాలు అందడం లేదు. ఈ ఏడాది జనవరికి ముందు వెళ్లిపోయిన వైద్యులు, సిబ్బందికి వేతనాలు అందినా జనవరి తరువాత వెళ్లేవారికి, ఇంకా ఇక్కడే పనిచేస్తున్న వారికి వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు.

న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం వైద్యం: ఏపీ వైద్య విధాన పరిషత్‌(ఏపీవీవీపీ)లో పనిచేసే ఉద్యోగులను డీఎంఈ పరిధిలోకి తెచ్చేవరకు రాజమహేంద్రవరం సర్వజన ఆసుపత్రిలో కొత్తవారు వచ్చేవరకు ఫారిన్‌ డిప్యూటేషన్‌ పద్ధతిన పనిచేయాలన్నారు. వీరికి వేతనాలు సైతం డీఎంఈ నుంచి రావాల్సి ఉంది. ఏపీవీవీపీ తరఫున పనిచేయడం లేదు కనుక వారు వేతనాలు నిలిపివేశారు. డీఎంఈలో ఉన్నట్లు ట్రెజరీలో మ్యాపింగ్‌ జరిగితే వేతనాలు వస్తాయని చెబుతున్నా అది జరగలేదు. ఎవర్ని అడగాలో తెలియక.. వేతనాలు ఎప్పుడొస్తాయో చెప్పేవారు లేక గందరగోళ పరిస్థితుల్లో ఉన్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఏపీవీవీపీ, అటు డీఎంఈ నుంచైనా వెంటనే వేతనాలు వచ్చేలా చూడాలని కోరుతున్నారు.

ఆసుపత్రి ఎదుట ఆందోళన

సమస్యపై సర్వజన ఆసుపత్రి ఎదుట సిబ్బంది ఆందోళన నిర్వహించారు. జనవరి నుంచి వేతనాలు ఇవ్వకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఆర్‌.రమేష్‌ వినతిపత్రం అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్‌ నర్సులు, మినిస్టీరియల్‌ ఉద్యోగులు, పారామెడికల్‌ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

కోడ్‌ బదిలీతో కష్టాలు

ఏపీ వీవీపీ నుంచి డీఎంఈకి డీడీవో కోడ్‌ ట్రాన్స్‌ఫర్‌ అవ్వడంలో ఇబ్బందుల వల్ల వేతనాలకు అంతరాయం ఏర్పడిందని సీఎఫ్‌ఎంఎస్‌ అధికారులు చెబుతున్నారు. ఈ 87 మందిలో స్టాఫ్‌ నర్సులు 40 మంది ఉండగా వీరిలో 21 మంది డీఎంఈలో ఉండేందుకు అంగీకారం తెలిపినా వారికీ వేతనాలు రావడం లేదు. వీరికి సంబంధించి ఇక్కడ రెగ్యులర్‌ నర్సులకు డీఎంఈలో కాంట్రాక్టు అని జీవో రావడంతో వేతనాలకు బ్రేక్‌ పడినట్లు చెబుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని అంతా కోరుతున్నారు.

త్వరలోనే అందుతాయి...

సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. డీఎంఈ అధికారులు సచివాలయానికి సమస్యను తీసుకెళ్లారు. పరిష్కారానికి ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో పర్యవేక్షిస్తున్నాం. త్వరలో సీఎఫ్‌ఎంఎస్‌ కోడ్‌ ఇబ్బందులు తొలగి అందరికీ వేతనాలు అందుతాయి.

డాక్టర్‌ రమేష్‌, సూపరింటెండెంట్‌, రాజమహేంద్రవరం సర్వజన ఆసుపత్రి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని