logo

కాలువల నిర్వహణకు రూ.5 కోట్లు

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వరి సాగు ప్రజల జీవనాడి. దీనికి సాగు, మురుగు కాలువల వ్యవస్థ కీలకంగా పనిచేయాలి. ఉమ్మడి జిల్లాలో ఖరీఫ్‌లో 5.50 లక్షల ఎకరాలు, రబీలో సుమారు నాలుగు లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగవుతోంది.

Updated : 27 Mar 2023 05:45 IST

పి.గన్నవరం, న్యూస్‌టుడే: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వరి సాగు ప్రజల జీవనాడి. దీనికి సాగు, మురుగు కాలువల వ్యవస్థ కీలకంగా పనిచేయాలి. ఉమ్మడి జిల్లాలో ఖరీఫ్‌లో 5.50 లక్షల ఎకరాలు, రబీలో సుమారు నాలుగు లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగవుతోంది. పంట, మురుగు కాలువలకు రానున్న ఖరీఫ్‌ మొదలు రబీ పూర్తయ్యే వరకు
నిర్వహణ పనులు సుమారు ఏడాదిపాటు చేస్తారు. రానున్న ఖరీఫ్‌, రబీ సీజన్లలో పంట, మురుగు కాలువల నిర్వహణ పనులు తదితర అంశాలపై జలవనరుల శాఖ ఎస్‌ జి.శ్రీనివాసరావుతో ‘న్యూస్‌టుడే’ ముఖాముఖి నిర్వహించగా వివరాలు వెల్లడించారు.

న్యూస్‌టుడే: రానున్న ఖరీఫ్‌...రబీ సీజన్‌లో సాగు, మురుగు కాలువల నిర్వహణ పనులకు నిధుల కేటాయింపు ఏ విధంగా ఉంటుంది.?

ఎస్‌ఈ: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్సు (ఒఅండ్‌ఎం)కు రూ.5 కోట్లతో పనులు చేస్తాం. మొత్తం 150 పనులు ప్రతిపాదించాం. వీటిలో 90 పనులు పంట కాలువలు, 60 మురుగు కాలువలకు సంబంధించినవి.

రబీ అనంతరం కాలువలు కట్టేసి తెరిచేలోగా ఏమైనా నిర్వహణ పనులు చేస్తారా...?

ఎస్‌ఈ: పంట, మురుగుకాలువల్లో పూడికతీత పనులు చేసేందుకు డాక్టర్‌ బి.ఆర్‌.అంబ్కేర్‌ కోనసీమ జిల్లా కలెక్టర్‌ రూ.45 లక్షలు, కాకినాడ కలెక్టర్‌ రూ.15 లక్షలు కేటాయించారు. ఈ నిధులతో అత్యవసరమైన పూడికతీత పనులు చేస్తాం.

ధవళేశ్వరం బ్యారేజీ నిర్వహణ పనులకు నిధులేమైనా ఉన్నాయా...?

ఎస్‌ఈ: బ్యారేజీ తలుపులకు మరమ్మతులు చేసేందుకు డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కలెక్టర్‌ హిమాన్షుశుక్లా ప్రత్యేకించి రూ.25 లక్షలు మంజూరు చేశారు. వీటితో అత్యవసరమైన మరమ్మతులు చేస్తాం. పూర్తిగా మరమ్మతులు చేయాలంటే రూ.56 కోట్లు కావాలి. కేంద్రప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. ఇంకా మంజూరు కాలేదు.

ఈ క్లోజర్‌ పీరియడ్‌లో గోదావరి డెల్టా ఆధునికీకరణ పనులు చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.

ఎస్‌ఈ: ప్రత్యేకించి నిధులు లేవు.

ఏలేరు ఆధునికీకరణకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు?

ఎస్‌ఈ: ఏలేరు ఆధునికీకరణకు రూ.700 కోట్లు కావాలి. గత ఏడాది నవంబరులో ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. ఇంకా నిధులు విడుదల కాలేదు.

ధవళేశ్వరం సర్కిల్‌ పరిధిలో వివిధ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎక్కువగా ఇన్‌ఛార్జులతో నెట్టుకొస్తున్నారు. దీనిని ఎలా చక్కదిద్దుతారు..?

ఎస్‌ఈ: రెండు ఈఈ, నాలుగు డీఈఈ, పది జేఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇన్‌ఛార్జిలతో పనులు చేయిస్తున్నాం. పోస్టుల భర్తీ గురించి ప్రభుత్వానికి పంపాం.

రబీలో సాగునీటి ఎద్దడిని ఎలా అధిగమిస్తున్నారు?

ఎస్‌ఈ: బ్యారేజీ ఎగువ నుంచి 1,500 క్యూసెక్కుల నీరు వస్తుంది. సీలేరు ద్వారా మరో 5,500 క్యూసెక్కులు సరఫరా అవుతుంది. మొత్తం ఏడువేల క్యూసెక్కుల నీటిని తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాలకు పంపిణీ చేస్తున్నాం. శివారు ఆయకట్టుపై ప్రత్యేకంగా దృష్టిపెట్టి సాగునీటి ఎద్దడిలేకుండా చర్యలు తీసుకుంటున్నాం. త్వరలో రబీ వరికోతలు మొదలవుతాయి. ఈ నేపథ్యంలో సాగునీటి వినియోగం తగ్గుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు