సొమ్ముల్లేవ్.. షాకులే!
పల్లెలే దేశప్రగతికి పట్టుగొమ్మలన్న మహాత్ముని మాటలు అమలు చేయాల్సిన పాలకులు.. వాటి నిర్వహణ, అభివృద్ధికి నిధులు కేటాయించకపోగా, గ్రామాల్లో మౌలిక వసతులకు విడుదలయ్యే ఆర్థిక సంఘం నిధులను ముక్కుపిండి వెనక్కి లాగేస్తున్నారు.
ఈనాడు, రాజమహేంద్రవరం - న్యూస్‌టుడే, ధవళేశ్వరం, గోకవరం
అల్లవరం గ్రామ పంచాయతీ కార్యాలయం
పల్లెలే దేశప్రగతికి పట్టుగొమ్మలన్న మహాత్ముని మాటలు అమలు చేయాల్సిన పాలకులు.. వాటి నిర్వహణ, అభివృద్ధికి నిధులు కేటాయించకపోగా, గ్రామాల్లో మౌలిక వసతులకు విడుదలయ్యే ఆర్థిక సంఘం నిధులను ముక్కుపిండి వెనక్కి లాగేస్తున్నారు. ఇప్పటికే నిధుల్లేక నీరసించిన పంచాయతీలకు విద్యుత్తు బిల్లుల బకాయిలు చెల్లించాలనే ఉన్నతాధికారుల ఆదేశాలు ‘మూలిగే నక్కపై పడిన తాటిపండు’ చందంలా తయారైంది. ఇటీవల పంచాయతీ పాలకవర్గాలకు తెలియకుండా ఆర్థిక సంఘం నిధులు వెనక్కి తీసుకుని విద్యుత్తు బకాయిలు చెల్లించడంతో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ఈ దఫా రూటుమార్చారు. మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో ప్రజల నుంచి పన్నుల రూపేణా సమకూరిన సాధారణ నిధులు, పంచాయతీల్లో ఉన్న ఆర్థిక సంఘం నిధులతో వెంటనే విద్యుత్తు బకాయిలు చెల్లించాలనే ఒత్తిడి పెరిగింది. వెరసి పాలకవర్గాలు, కార్యదర్శులు ఏం చేయాలో పాలుపోక తల పట్టుకుంటున్నారు.
వసతులు సమకూరేదెలా..
గ్రామాల్లో కనీస అవసరాలు, వసతుల కల్పనకు ఆర్థిక సంఘం, సాధారణ నిధులు అవసరం. ఆర్థిక సంఘం నిధులతో పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీరు, వీధిదీపాలు తదితరాలకు కేటాయించాలి. సాధారణ నిధుల లభ్యత మేరకు పాలకవర్గ ఆమోదంతో అభివృద్ధి పనులు చేసుకునే వీలుంది. విద్యుత్తు బిల్లులు సైతం ఏళ్లుగా చెల్లించక.. విద్యుత్తు ఛార్జీలు, సర్‌ఛార్జీలతో కలిపి ఆ బిల్లులు కొండలా పేరుకుపోవడంతో అవి తలకు మించిన భారంగా మారాయి. ఇప్పటికే 14, 15 ఆర్థిక సంఘం నిధుల్లో మూడొంతుల మేర ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంతో అంతంతగానే అందుబాటులో ఉన్నాయి. మైనర్ పంచాయతీల్లో అయితే కనీస నిల్వలే ఉన్నాయనే వాదన ఉంది.
ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు
పంచాయతీ ఖాతాల్లో నిధులు లేక కటకటలాడుతున్నాయి. మైనర్ పంచాయతీల్లో ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆస్తి, నీటి పన్ను రూపంలో రూ.లక్ష నుంచి రూ.లక్షన్నరలోపు మాత్రమే ఆదాయం వస్తోంది. వీటిలోనే వీధి దీపాల నిర్వహణ, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, మౌలిక వసతులు, సిబ్బంది వేతనాలు తదితర అవసరాలు తీర్చుకోవాలి. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో ప్రజల నుంచి ఆస్తి, నీటి పన్ను నూరు శాతం వసూళ్లే లక్ష్యంగా క్షేత్రంలో సిబ్బంది పని చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నిధులతో విద్యుత్తు బకాయిలు ఎలా చెల్లించగలమని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే కొందరు సర్పంచులు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసినా బిల్లులు అందక ఇబ్బంది పడుతున్నారు. సాధారణ నిధులు సమకూరితే వాటిలో కొంతైనా బిల్లుల రూపంలో తీసుకుందామని అనుకునేవారికి తాజా నిర్ణయం ఇరకాటంలో పడేస్తోంది.
ఎలా సాధ్యం..
రావులపాలెం మేజర్ పంచాయతీ నుంచి ఈ ఆర్థిక సంవత్సరంలో 14, 15వ ఆర్థిక సంఘం నిధులు సుమారు రూ.2.05 కోట్లు ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ప్రస్తుతం ఇక్కడ 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.85 వేలు, సాధారణ నిధులు రూ.30 లక్షల మేర ఉన్నాయి. విద్యుత్తు శాఖకు ఏకంగా రూ.97 లక్షల బకాయి చెల్లించాలి. ఇదిలా ఉండగా ఈ పంచాయతీలో నెలకు పారిశుద్ధ్య నిర్వహణ, సిబ్బంది వేతనాలు, వాహనాలకు డీజిల్ ఇతర ఖర్చులు రూ.15 లక్షలు కావాలి. ఈ పరిస్థితుల్లో విద్యుత్తు బకాయిలు చెల్లిస్తే నిర్వహణ ఎలా సాధ్యమనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.
రూ.1.7 కోట్లు కట్టాలట
- కొమరం శ్రావణి, గోకవరం సర్పంచి
గోకవరం పంచాయతీకి నెలకు రూ.3.5 లక్షలు వరకు విద్యుత్తు బిల్లు వస్తుంది. ఈ బిల్లుల నిమిత్తం రూ.70 లక్షల వరకు ఆర్థిక సంఘం నిధుల నుంచే నేరుగా చెల్లించి మిగిలిన సొమ్ము పంచాయతీలకు జమ చేశారు. అయినా రూ.1.7 కోట్లు బిల్లులు బకాయి ఉన్నట్లు డిమాండ్ నోటీసులు ఇచ్చారు.చెల్లించిన బిల్లులను మినహాయించాలని కోరినా సరైన స్పష్టత ఇవ్వడం లేదు. దీనికితోడు సర్‌ఛార్జీల పేరుతోనూ బాదేస్తున్నారు. వీటన్నింటిని కలిపి బకాయిలుగా చూపడంతో ఇబ్బందులు తప్పడం లేదు.
విద్యుత్తు బిల్లుల చెల్లింపునకు ఆదేశించాం
-జగదాంబ, డీపీవో, తూర్పుగోదావరి
దీర్ఘకాలంగా బకాయి ఉన్న విద్యుత్తు బిల్లులు చెల్లించాలని పంచాయతీలకు సూచించాం. పంచాయతీల నిర్వహణలో భాగంగా వినియోగిస్తున్న విద్యుత్తుకు బిల్లులు చెల్లించాల్సిన బాధ్యత వారిపై ఉంది. ఎంత త్వరగా బకాయిలు చెల్లిస్తే అంత ఆర్థిక భారం తప్పుతుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Movies News
Jayanth C Paranjee: త్రిషకు వేరే వ్యక్తితో పెళ్లి చేయడం వాళ్లకు నచ్చలేదు: జయంత్ సి.పరాన్జీ
-
India News
Odisha Train Accident: మృతులు 288 కాదు.. 275 మంది: ఒడిశా ప్రభుత్వం క్లారిటీ
-
Politics News
Bandi sanjay: తెదేపాతో భాజపా పొత్తు ఊహాగానాలే..: బండి సంజయ్
-
India News
Guwahati airport: కేంద్ర మంత్రి ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Health News
Diabetes patient: మధుమేహులు ఉపవాసం చేయొచ్చా..?