logo

పారదర్శకంగా నియామకాలు

వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగుల నియామకాలు, బదిలీల ప్రక్రియ పారదర్శకంగా చేపడుతున్నామని జోన్‌-2 (ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలు) ప్రాంతీయ సంచాలకురాలు డాక్టర్‌ పద్మాశశిధర్‌ పేర్కొన్నారు.

Published : 28 Mar 2023 05:35 IST

న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం వైద్యం: వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగుల నియామకాలు, బదిలీల ప్రక్రియ పారదర్శకంగా చేపడుతున్నామని జోన్‌-2 (ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలు) ప్రాంతీయ సంచాలకురాలు డాక్టర్‌ పద్మాశశిధర్‌ పేర్కొన్నారు. వైద్యఆరోగ్యశాఖలో ఉద్యోగుల బదిలీలకు సంబంధించి కౌన్సెలింగ్‌ చేపట్టి ఎవరికీ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నియామకాల్లో దళారీ వ్యవస్థను నమ్మి మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొత్త పోస్టులు, బదిలీల కౌన్సెలింగ్‌, పీహెచ్‌సీల్లో క్యాడర్‌ను పూర్తిస్థాయిలో నియమించడం తదితర అంశాలపై ‘న్యూస్‌టుడే’ ముఖాముఖిలో ఆమె మాట్లాడారు. వివరాలు ఆమె మాటల్లోనే..

* జీవో 143 ప్రకారం ఉద్యోగుల సర్దుబాటు: జీవో నంబరు 143 ప్రకారం ప్రతి పీహెచ్‌సీలో అన్ని కేటగిరీలకు సంబంధించి 14 మంది సిబ్బంది ఉండాలన్న నిబంధన మేరకు ఉద్యోగులను సర్దుబాటు చేస్తున్నాం. ఉమ్మడి జిల్లా పరిధిలోని 130కి పైగా పీహెచ్‌సీల్లో నర్సులు, హెల్త్‌ అసిస్టెంట్లు, సూపర్‌వైజర్లు, ఎంపీహెచ్‌ఈవోలకు కౌన్సెలింగ్‌ చేపట్టి ఆయా చోట్ల పోస్టింగులు ఇస్తున్నాం. ఇప్పటికే 245 కొత్త స్టాఫ్‌నర్సు పోస్టులకు నియామకాలు చేశాం. జోన్‌-2లోని 170 ఎంపీహెచ్‌ఈవో/సీహెచ్‌వో పోస్టులను పీహెచ్‌సీల్లో మార్పులు చేస్తున్నాం.

* దళారులను నమ్మి మోసపోవద్దు:
ఇటీవల కాలంలో ఎంఎల్‌హెచ్‌పీలు, స్టాఫ్‌ నర్సుల కొత్త పోస్టింగులు, ఉద్యోగుల బదిలీలు, ఉద్యోగోన్నతికి సంబంధించి అభ్యర్థులు దళారులను నమ్మి మోసపోవద్దు. కౌన్సెలింగ్‌, నియామకాలు పారదర్శకంగా చేపడుతున్నాం. కార్యాలయాల్లో అధికారులు తెలుసు.. ఇతర సిఫార్సులు చేయిస్తామని ఎవరైనా అభ్యర్థులు, ఉద్యోగులను ప్రలోభ పెడితే సమాచారమివ్వాలి. అలాంటి వారిని నమ్మి నష్టపోవద్దు.

* హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ కేంద్రాల్లో సేవలు: జోన్‌-2 పరిధిలో ఇప్పటికే చాలా మంది మిడ్‌ లెవిల్‌ హెల్త్‌ ప్రొవైడర్లు (ఎంఎల్‌హెచ్‌పీ) నియామకాలు చేపట్టాం. ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఉన్న 2,782 హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ కేంద్రాల్లో వీరు మెరుగైన వైద్యసేవలందిస్తున్నారు. స్టాఫ్‌ నర్సుకన్నా ఎక్కువ స్థాయి, వైద్యులతో సమానంగా వీరు సేవలందిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని