logo

సత్రం భూముల అక్రమాలపై విచారణకు డిమాండ్‌

గోకవరం మండలం రంపఎర్రంపాలెంలోని సుందరమ్మ సత్రం భూముల విషయంలో జరిగిన అవినీతి, అక్రమాలపై కలెక్టర్‌ విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు-కూలీ సంఘం(ఏపీఆర్‌సీఎస్‌) డిమాండ్‌ చేసింది.

Published : 28 Mar 2023 05:35 IST

రైతు-కూలీ సంఘం నాయకులు, గ్రామస్థుల ఆందోళన

వి.ఎల్‌.పురం(రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: గోకవరం మండలం రంపఎర్రంపాలెంలోని సుందరమ్మ సత్రం భూముల విషయంలో జరిగిన అవినీతి, అక్రమాలపై కలెక్టర్‌ విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు-కూలీ సంఘం(ఏపీఆర్‌సీఎస్‌) డిమాండ్‌ చేసింది. సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. సత్రం భూముల అక్రమాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు తొలుత సంఘం నాయకులు గ్రామస్థులతో కలిసి కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో బయట రోడ్డుపై ఆందోళన చేపట్టారు. దీంతో పదిమంది నాయకులను లోపలకు అనుమతించగా ఏపీఆర్‌సీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు నాయకత్వంలో ప్రతినిధుల బృందం స్పందన హాలులో జేసీ తేజ్‌భరత్‌ను కలిసి వినతిపత్రం అందించింది. దశాబ్దాలుగా సుందరమ్మ సత్రం భూములకు వేలంపాట నిర్వహించాలంటూ కోరుతున్నా సంబంధిత దేవాదాయ శాఖ అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, భూకబ్జాదారులకు కొమ్ముకాస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని వీరాంజనేయులు ఆరోపించారు. తామిచ్చిన పిటిషన్లపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారని జేసీకి వివరించారు. సత్రంభూముల అవినీతి అక్రమాలపై తక్షణం విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. దీనిపై జేసీ స్పందిస్తూ తాను స్వయంగా గ్రామంలో సదరు భూములను పరిశీలించి పదిరోజుల్లో సమస్య పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రైతు-కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు వల్లూరి రాజబాబు, సహాయ కార్యదర్శి కడితి సతీష్‌, రాష్ట్ర నాయకులు కొండదుర్గారావు, డివిజన్‌ కార్యదర్శి దేశెట్టి సురేష్‌, గోలి ముసలయ్య, శ్రీకాంత్‌, వల్లూరి సత్తిబాబు, పలువురు గ్రామస్థులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని