logo

తమ్ముడే హంతకుడు

ఆస్తి కోసం అన్నపై అక్కసు పెంచుకున్నాడు. మద్యం తాగి వెళ్లి గొడవపడి, కర్కశంగా అంతమొందించాడు.

Published : 28 Mar 2023 05:35 IST

పట్టించిన రక్తపు మరక.. హావభావాలు
ఉపసర్పంచి హత్య కేసు ఛేదించిన పోలీసులు

వివరాలు వెల్లడిస్తున్న కొవ్వూరు డీఎస్పీ వర్మ

కొవ్వూరు పట్టణం, న్యూస్‌టుడే: ఆస్తి కోసం అన్నపై అక్కసు పెంచుకున్నాడు. మద్యం తాగి వెళ్లి గొడవపడి, కర్కశంగా అంతమొందించాడు. ఆ పెనుగులాటలో అన్న రక్తం తమ్ముడి చొక్కాపై పడింది. పోలీసుల దర్యాప్తులో అదే రక్తపు మరక అతణ్ని పట్టించింది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో సంచలనం రేపిన వేములూరు ఉప సర్పంచి, తెదేపా నాయకుడు శీని సత్య వరప్రసాద్‌ హత్య కేసులో సొంత తమ్ముడు సత్యనారాయణనే హంతకుడిగా తేల్చారు. కొవ్వూరు డీఎస్పీ వీఎస్‌ఎన్‌ వర్మ సోమవారం విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

మద్యం తాగి వచ్చి..

ప్రసాద్‌ తమ్ముడు శీని సత్యనారాయణ జంగారెడ్డిగూడెంలోని రామచంద్రపురంలో ఉంటున్నారు. వీరిద్దరూ కలిసి గతంలో వ్యాపారాలు చేశారు. ఈ క్రమంలో చేసిన అప్పు, వేములూరులోని ఇల్లు, స్థలం విషయంలో గొడవ పడుతున్నారు. అప్పటికే ఇంటిని తనఖా పెట్టడంతో వడ్డీ బాగా పెరిగింది. అందులో కొంత ప్రసాద్‌ స్నేహితుడైన అక్కిన రాంబాబు తీర్చారు. తనకు ఇంట్లో వాటా కావాలని సత్యనారాయణ అడుగుతుండగా రూ.19.50 లక్షలు ఇస్తేనే వాటా ఇస్తానని ప్రసాద్‌ చెప్పారు. ఈ విషయంలో 15 రోజులుగా వీరిద్దరి మధ్య ఘర్షణ జరుగుతోంది. రూ.10 లక్షలు ఇస్తానని చెప్పినా ప్రసాద్‌ ఒప్పుకోలేదు. దీంతో సత్యనారాయణ ఈనెల 25న వేములూరు వచ్చారు. సమీపంలోని ఓ బార్‌కు వెళ్లారు. అదే గ్రామానికి చెందిన గెడా శ్రీనును అక్కడికి రమ్మన్నారు. ఇద్దరూ కలిసి మద్యం తాగారు. ద్విచక్ర వాహనంపై రాత్రి 11- 12 గంటల మధ్యలో ప్రసాద్‌ ఇంటికి వెళ్లారు. అప్పుడు అన్నదమ్ముల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ జరిగింది. ప్రసాద్‌ను బయటకు తీసుకొచ్చి పీక పట్టుకుని గోడకు తలను గట్టిగా కొట్టగా ముక్కులోంచి రక్తం వచ్చి పడిపోయారు. అపస్మారక స్థితిలో ఉన్న ప్రసాద్‌ను బోర్లా పడుకోబెట్టి పీక నొక్కి చంపాడు. మృతదేహంపై దుప్పటి కప్పి ద్విచక్ర వాహనంపై ఇద్దరూ కొవ్వూరు వచ్చారు. ఆ తర్వాత సత్యనారాయణ జంగారెడ్డిగూడెం వెళ్లిపోయారు.

నిందితుడు సత్యనారాయణ


ఇలా దొరికాడు..

అయిదు బృందాలుగా పోలీసులు దర్యాప్తు చేశారు. ఇలా ఉండగా సోమవారం సత్యనారాయణ తన వదిన శ్రీకళ (హతుడి భార్య), పిల్లలతో కలిసి వేములూరు వచ్చారు. అక్కడ అతని హావభావాలు, చొక్కాపై రక్తపు మరకలు చూసి పోలీసులకు అనుమానం వచ్చింది. పోస్టుమార్టం, అంత్యక్రియలు జరిగినప్పుడు అతని చరవాణి తీసుకుని కాల్‌ డేటా సేకరించారు. సీసీ పుటేజిల్లోనూ వీరు వచ్చినట్లు గుర్తించారు. హత్య చేసిన సత్యనారాయణ, అతనికి సహకరించిన శ్రీనును కొవ్వూరులోని మెరకవీధిలో అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు ఛేదించిన సీఐ రవికుమార్‌, ఎస్సైలు పి.రవీంద్రబాబు, బి.దుర్గాప్రసాద్‌, కేవీ రమణ, జి.సతీష్‌ లను డీఎస్పీ వర్మ అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని