logo

చెరువులను ఆక్రమించి.. భవనాలు నిర్మించి

జిల్లా ప్రధాన కేంద్రమైన అమలాపురం పట్టణంలో గతంలో చెరువుల్లో నీరు పుష్కలంగా ఉండేది. ఆ నీటినే ఒడిసిపట్టుకుని ప్రజలు తమ తాగునీటి అవసరాలను తీర్చుకునేవారు.

Published : 28 Mar 2023 05:35 IST

బండివారిపేట చెరువు వద్ద ఆక్రమణలు

జిల్లా ప్రధాన కేంద్రమైన అమలాపురం పట్టణంలో గతంలో చెరువుల్లో నీరు పుష్కలంగా ఉండేది. ఆ నీటినే ఒడిసిపట్టుకుని ప్రజలు తమ తాగునీటి అవసరాలను తీర్చుకునేవారు. పచ్చని కొబ్బరితోటల మధ్య ప్రకృతి ప్రతిబింబించేలా కనిపించే కోనసీమ కేంద్రమైన అమలాపురం పట్టణంలో ప్రస్తుతం ఇవేమీ కనిపించడం లేదు. జిల్లా కేంద్ర అయిన నైపథ్యంలో అమలాపురంలో  స్థలాలకు  డిమాండ్‌ పెరిగిన   నేపథ్యంలో చెరువులు, కాలువలు, పోరంబోకు స్థలాలపై అక్రమార్కుల కళ్లు పడుతున్నాయి. చెరువులనే కప్పేసి అక్రమంగా భవనాలు నిర్మించడం వడివడిగా మొదలుపెట్టారు. కొన్ని ప్రాంతాల్లో చెరువుల చుట్టూ ఆక్రమణలు పెరిగిపోతుంటే.. మరికొన్ని చోట్ల చెరువులనే మింగేసి భవనాలు నిర్మిస్తున్నారు.

న్యూస్‌టుడే, అమలాపురం పట్టణం


ప్రభుత్వాలు మారుతున్నా...

ప్రభుత్వాలు మారుతున్నా.. చెరువుల ఆక్రమణలపై మాత్రం అధికార యంత్రాంగం చర్యలు చేపట్టకపోవడంతో వాటి సంరక్షణ కొరవడింది.  ఈ ప్రాంతంలో ఏడు చెరువులు 35 ఎకరాల విస్తీర్ణంలో ఉండేవని అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతం వీటిలో 20 ఎకరాలకు పైగానే ఆక్రమణల చెరలో చిక్కాయి.  ప్రధానంగా తామర చెరువు, బంగారక్క చెరువు, గరిగుంట చెరువు, కంచర చెరువు, బండివారిపేట, సుబ్బారాయుడు చెరువుల్లో ఆక్రమణల పర్వం నేటికీ కొనసాగుతోంది. ఈ చెరువుల చుట్టూ భవనాలు నిర్మించిన దాఖలాలు ఉన్నప్పటికీ పురపాలక అధికారులు మాత్రం చర్యలు చేపట్టకుండా మిన్నకుండిపోతున్నారు. తామరచెరువు, బంగారక్క చెరువుల చుట్టూనే అధికశాతం ఆక్రమణలున్నాయి. మిగిలిన చోట్ల ఆక్రమించి అమ్మకాలు కూడా జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. వీటిలో కొన్నింటికి పట్టాలు ఉన్నాయని, మరికొన్ని మావేనంటూ యథేచ్ఛగా ఆక్రమించేస్తున్నారు. కొందరు ప్రజాప్రతినిధుల చేతుల్లో ఉంచుకుని వేల రూపాయలు అద్దెలు వసూలు చేసుకుంటున్నారు. ఈ చెరువులను పరిరక్షించాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు వాటి ఊసే మరిచిపోవడంతో రోజురోజుకూ ఈ చెరువులు బక్కచిక్కిపోతున్నాయి. గతంలో పట్టణానికి చెందిన కుడిపూడి అశోక్‌ అనే న్యాయవాది చెరువులను పరిరక్షించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. అప్పట్లో చెరువులు సర్వే నిర్వహించాలని అధికారులు చేసిన ప్రయత్నానికి ప్రజాప్రతినిధులు అడ్డుపడటంతో ఆక్రమణలపై చర్యలు లేవు. ప్రస్తుతం అమలాపురం పట్టణంలో ఎకరం రూ.కోట్లకు పైగానే పలుకుతుండటంతో ఈ చెరువుల చుట్టూ ఆక్రమణల పరంపర కొనసాగించేందుకు కొందరు వ్యక్తులు ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం.


రీసర్వేలో బయటకు వస్తాయి

పట్టణంలోని ఈ చెరువులు గతం నుంచి ఆక్రమణలో ఉన్నాయి. చెరువుల ఆక్రమణలపై భూరీసర్వేలో అన్ని బయటకు వస్తాయి. ప్రస్తుతం రీసర్వే నిర్వహిస్తున్నాం. ఆక్రమణలను గుర్తించి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటాం. చెరువులను సంరక్షించే విధంగా చూస్తాం. అనధికార లేఅవుట్ల, అక్రమ నిర్మాణాలను గుర్తించేందుకు పట్టణ ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను నియమించాం.

వి.అయ్యప్పనాయుడు,  మున్సిపల్‌ కమిషనర్‌, అమలాపురం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని