logo

అధికార స్వరం

కీలక శాఖల్లో రాజకీయం వేలు పెడుతోంది.. సిఫార్సులకే పెద్ద పీట వేయాలని హుకుం జారీచేస్తోంది.. ప్రభుత్వ ఉద్యోగుల విధుల్లో మితిమీరిన జోక్యం..

Published : 30 Mar 2023 05:26 IST

ఈనాడు, కాకినాడ: కీలక శాఖల్లో రాజకీయం వేలు పెడుతోంది.. సిఫార్సులకే పెద్ద పీట వేయాలని హుకుం జారీచేస్తోంది.. ప్రభుత్వ ఉద్యోగుల విధుల్లో మితిమీరిన జోక్యం.. అధికారులపై నాయకులు ఒంటికాలిపై లేస్తున్న తీరు.. నిష్పక్షపాతంగా విధులు నిర్వహిస్తున్న అధికారులకు ఇబ్బందిగా మారింది. కాస్త రాజకీయ దన్ను ఉన్నవాళ్లు సైతం అధికారులను ఏమాత్రం లెక్కచేయడంలేదు. మా వెనక అన్న ఉన్నాడు.. చెప్పింది చేస్తావా..? చెయ్యవా..? అని తిరగబడుతున్నారు. కొందరైతే బెదిరింపులకు.. ఇంకొందరు భౌతిక దాడులకూ తెగబడుతున్నారు. మారణాయుధాలతో ప్రాణాలు తీసేయడానికి ఉరుకుతున్నారు.. ప్రజలకు.. ప్రభుత్వానికి వారధి ఉద్యోగి.. శాఖ ఏదైనా ఉద్యోగి అంటే ఒకప్పుడు ఎంతో గౌరవం ఉండేది. తాజా సంఘటనలు చూస్తే ఇప్పుడా పరిస్థితి క్రమేపీ కనుమరుగవుతోందన్న కలవరం వెంటాడుతోంది. ఘటనలు జరిగినప్పుడు ఉద్యోగ సంఘాలు బాధిత ఉద్యోగులకు భరోసా ఇస్తున్నా..
క్షేత్రస్థాయిలో గతితప్పుతున్న ఘంటికలు చూస్తుంటే పరిస్థితిని తక్షణం చక్కదిదాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నాయి.


వేధింపులే ఉసురు తీశాయి..

అమలాపురం కలెక్టరేట్‌ ఎదుట రిలే దీక్ష (పాత చిత్రం)

ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి పంచాయతీ కార్యదర్శి, ఎస్టీ సామాజికవర్గానికి చెందిన రొడ్డా భవాని గతేడాది జులై 7న ఆత్మహత్య చేసుకున్నారు. ఎంపీపీ భర్త, మరికొందరు వైకాపా నాయకుల వేధింపులే ప్రాణాలు తీశాయని బాధిత కుటుంబికులు, దళిత సంఘాలు ఆరోపించాయి. సమర్థంగా విచారణ జరిపి.. నిందితులపై చర్యలు తీసుకోవాలని ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించారు. న్యాయం చేయాలని 100 రోజులపాటు కలెక్టరేట్‌ ఎదుట రిలే దీక్షలు చేయడం చర్చనీయాంశమైంది.


చెంప చెళ్లుమనిపించారు..

రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా  తనను మూడుసార్లు చెంపపై కొట్టారని పోలవరం రెండో డివిజన్‌ అసిస్టెంట్‌ కార్యనిర్వాహక ఇంజినీరు సూర్యకిరణ్‌ నిరుడు ఆరోపించారు. రంగంపేట పరిధిలో పుష్కర కాలువ అభివృద్ధి, పూడికతీత పనులు గతంలో రైతులు సొంతంగా చేసుకున్నారని.. రెండేళ్ల కిందట జరిగిన పనులకు నిధులు మంజూరుచేయించాలని ఎమ్మెల్యేను అడిగితే.. ఇప్పుడు అంచనాలు సాధ్యం కాదని చెప్పానన్నది అధికారి వాదన. బడ్జెట్‌ అంచనాలపై ఎమ్మెల్యే రాజా ప్రశ్నిస్తే.. వివరణ ఇస్తుండగానే ఉన్నతాధికారుల సమక్షంలో ఎమ్మెల్యే కొట్టారని ఇంజినీరు ఆరోపించారు.


జోక్యం.. శ్రుతిమించుతోంది...

ఉమ్మడి జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాల్లో ఉద్యోగులంటే లెక్కలేని తనం ఎక్కువవుతోంది. కొందరు తమ పనితీరు నిబంధనల మేరకే అని తేల్చి చెప్పేస్తుంటే.. ఇంకొందరు గత్యంతరం లేక తలూపాల్సి వస్తోంది. కొందరు నాయకులు తమ అనుచరులకు ఒక్కో శాఖలో పనులు చక్కదిద్దే బాధ్యత అప్పగించడం సమస్యగా మారింది. కేసుల్లోనూ... పథకాల్లోనూ జోక్యం చేసుకుని ఎవరి పనులు వారికి సవ్యంగా చేసుకోనివ్వడంలేదు. కాదంటే రాజకీయంగా ఒత్తిడి పెంచుతున్నారు. ఈ పరిస్థితి సాధారణ ప్రజల్లోనూ చులకనకు కారణమవుతోంది. ఖర్చుచేసి పోస్టింగులు దక్కించుకున్న కొందరు ఉద్యోగుల తీరు కూడా ప్రతికూలతలకు కారణమవుతోంది. * ఉమ్మడి జిల్లాలో గనుల అక్రమ తవ్వకాలు, నాటు సారా అక్రమ తయారీ- రవాణా, గంజాయి ఆగడాలకు కొదవే లేదు. వీటి ఛేదనలో పోలీసులకు నిత్యం సవాళ్లే. అక్రమ నిల్వలు పట్టుకుంటే వదిలేయమని.. వాటి జోలికి వెళ్ల వద్దనే ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. ఉద్యోగం సాఫీగా సాగాలంటే నాయకులు చెప్పినట్లు కొన్నిచోట్ల వినాల్సిందే.ఏ ఠాణాలో ఎవరు ఉద్యోగం చేయాలో తేల్చేది నాయకులే కావడంతో సమస్య వస్తోంది.


అన్నిచోట్లా అదే తంతు..

* ఆలమూరు మండలం జిల్లెళ్లపేటలో గోదావరి తీరంలో అబ్కారీశాఖ సిబ్బందిపై నాటుసారా తయారీదారులు నిరుడు దాడిచేశారు. లంకల నుంచి సారా అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో రాజోలు సెబ్‌ ఎస్సై ఇతర సిబ్బంది దాడిచేసి పడవలో తరలిస్తున్న నిల్వలు స్వాధీనం చేసుకునే క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దాడిలో కానిస్టేబుల్‌ గాయపడ్డారు.
* అయినవిల్లి ఎంపీడీవో విజయ తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించడం గతంలో చర్చనీయాంశమైంది. వైకాపా నేత వాసంశెట్టి తాతాజీ ఎంపీడీవోతో వాగ్వాదానికి దిగడం.. అనుచిత వ్యాఖ్యలతో దూషణకు దిగిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. ఎంపీడీవోకు అండగా అప్పట్లో ఉద్యోగ సంఘాలు నిలిచాయి. *  పెద్దాపురం మండలం రామేశ్వరం మెట్టలో ఓ అనధికార క్వారీ యాజమాన్యం ఆరు గ్రామాలకు సాగునీరు అందించే పుష్కర పంట కాలువను కప్పేసి అడ్డంగా రోడ్డేశారు. కాలువ మట్టినీ కొల్లగొట్టారు. దీనిపై రైతుల నుంచి ప్రతిఘటన ఎదురైంది. వ్యవహారం రచ్చకెక్కడంతో రెవెన్యూ అధికారులు క్షేత్రానికి వెళ్లి అక్రమాలు అడ్డుకుని కేసు నమోదుకు సిద్ధమయ్యారు. ఓ నాయకుడి ఒత్తిడితో వెనక్కి తగ్గాల్సి వచ్చింది.


ఉద్యోగిని నరికేశాడు..

అధికారి చిన్నారావుపై కత్తితో దాడి చేస్తున్న వ్యాపారి దుర్గాప్రసాద్‌ (పాత చిత్రం)

కాకినాడలో సహాయ రవాణా అధికారి చిన్నారావుపై కొబ్బరి బోండాల విక్రేత దుర్గాప్రసాద్‌ విచక్షణారహితంగా కత్తితో దాడిచేశాడు. బోండాల లోడుతో ఉన్న వ్యాను ఫిట్‌నెస్‌, బీమా తదితర పత్రాల గడువు మగియడంతో వ్యాన్‌ సీజ్‌ చేస్తానని రవాణా అధికారి హెచ్చరించడంతో ఈనెల 17న వాగ్వాదం చోటుచేసుకుంది. బోండాలు కొట్టే కత్తితో నరకడంతో ఏఎంవీఐ చేతివేళ్లు తెగిపడ్డాయి. మెడ, పొట్ట మీద తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో రవాణాశాఖ డ్రైవరు గాయపడ్డారు.


తప్పుచేస్తే చర్యలు తప్పవు

ఉద్యోగుల పట్ల అమర్యాదగా ప్రవర్తించినా, విధులకు ఆటంకం కలిగించినా, వారిపై భౌతిక దాడులకు దిగినా చర్యలు తప్పవు. రౌడీ షీటర్లు, నేర ప్రవృత్తి ఉన్నవారిపై దృష్టిసారిస్తాం. ఎవరి నుంచైనా ఉద్యోగులకు బెదిరింపులు వస్తే డయల్‌ 100 ద్వారా పోలీసులను ఆశ్రయించాలి. తప్పు చేసిన వారిని చట్టంతో కొడితే.. అలాంటి తప్పు చేయడానికి ఇతరులు భయపడతారు.

జి.పాలరాజు, డీఐజీ ఏలూరు రేంజ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని