logo

కొబ్బరి మార్కెట్‌ డీలా..

కొబ్బరిసాగు కర్షకులకు కన్నీరు తెప్పిస్తోంది. మార్కెట్‌లో ధరలు పడిపోయాయి. 

Published : 30 Mar 2023 05:26 IST

న్యూస్‌టుడే, అంబాజీపేట: కొబ్బరిసాగు కర్షకులకు కన్నీరు తెప్పిస్తోంది. మార్కెట్‌లో ధరలు పడిపోయాయి.  సాధారణంగా పండగలు, పర్వదినాలకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు కొబ్బరి మార్కెట్‌కు గట్టి బంధం ఉంటుంది. పండగల వేళ కొబ్బరి కాయల ధరలు బాగా పెరుగుతాయి. అందుకే ఈ ప్రాంత రైతులు పండగలు వచ్చేసరికి కొబ్బరి కాయలను నిల్వ చేసుకుంటారు. ఈసారి కొబ్బరి మార్కెట్‌లో ప్రతికూల పరిస్థితులు రావడంతో ధరలు
పెరగడం అటుంచి మరింత దిగజారాయి. పొరుగు రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక ప్రభావం జిల్లా కొబ్బరి మార్కెట్‌పై పడింది. ఆయా రాష్ట్రాల కొబ్బరి కాయలను కొనుగోలు చేసేందుకు ఇతర రాష్ట్రాల వర్తకులు ఇష్టపడటంతో వాటికి ప్రస్తుతం డిమాండు ఏర్పడింది. దీంతో జిల్లాలోని కాయలకు ఆర్డర్లు ఇచ్చి కొనుగోలు చేసేందుకు ఇతర రాష్ట్రాల వ్యాపారులు ముందుకు రావడం లేదు.

కలిసిరాని పండగలు: ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు వచ్చిన ఏ పండగకు కూడా మార్కెట్‌లో ఆశించిన ధర రాలేదు. ప్రధానంగా సంక్రాంతి తరవాత వచ్చే మహాశివరాత్రికి కొబ్బరిమార్కెట్‌లో ధరలు ఆశాజనకంగా ఉంటాయి. అయినప్పటికీ ఈ శివరాత్రికి ధరలు పెరగలేదు. దేశవ్యాప్తంగా జరిగే శ్రీరామనవమికి కొబ్బరి కాయల ధరలు హెచ్చుఅవుతాయని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది. ఇప్పటికే పండగ ఖరీదులు అయిపోయినట్లు రైతులు, వర్తకులు చెబుతున్నారు. అయినప్పటికీ కొబ్బరి మార్కెట్‌లో ధరలు ఏ మాత్రం పెరగలేదు. రాజస్థాన్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లకు ఎక్కువ ఎగుమతులు జరిగేవి. ప్రస్తుతం ఆయా రాష్ట్రాలకు నామమాత్రంగానే ఎగుమతులు జరుగుతున్నాయి.

ధరలు బేలచూపులు: గత నెలలో వెయ్యి కొబ్బరికాయలు (పచ్చికాయలు) రూ.8,500-రూ.9,000 ధర .ఆదే ఇప్పుడు రూ.7,500- రూ.8,000లు ఉంది. అలాగే కొత్త కొబ్బరి రూ.9,000 నుంచి రూ.8,000లకు దిగజారింది. కురిడీ కొబ్బరికాయలు పాతవి గండేరా రకం వెయ్యింటికీ రూ.13,000 నుంచి రూ.12,000లకు పడిపోయాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని