logo

పాడైన బండే పట్టించింది...

రాజానగరం మండలం ఆటోనగర్‌లో 540 కేజీల గంజాయిని నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారులు బుధవారం స్వాధీనం చేసుకుని నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

Published : 30 Mar 2023 05:26 IST

‘పుష్ప’ చిత్రం తరహాలో గంజాయి అక్రమ రవాణా

ఆటోనగర్‌ వద్ద గంజాయిని స్వాధీనం చేసుకుంటున్న అధికారులు

రాజానగరం, న్యూస్‌టుడే: రాజానగరం మండలం ఆటోనగర్‌లో 540 కేజీల గంజాయిని నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారులు బుధవారం స్వాధీనం చేసుకుని నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ‘పుష్ప’ సినిమా తరహాలో సరకు రవాణా చేస్తుండగా వాహనం మరమ్మతులకు గురై విషయం బయటకొచ్చింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన సమాచారం ప్రకారం.. ఒడిశా నుంచి ఉత్తరప్రదేశ్‌కు పైన కూరగాయలు, అడుగున గంజాయితో వెళ్తున్న ఓ వ్యాన్‌ దివాన్‌చెరువు దాటాక ఆటోనగర్‌ వద్ద మరమ్మతుకు గురైంది. దాంతో సమీపంలోని ఆటోనగర్‌కు వాహనాన్ని తరలించారు. వ్యానులో గంజాయి ఉందన్న సమాచారంతో ఎన్‌సీబీ బృందం దాడి చేసింది. 540 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుంది. దీని విలువ సుమారు రూ.37 లక్షలు ఉంటుందని అంచనా. వివరాల కోసం ప్రయత్నించగా ఎన్‌సీబీ బృందం అందుబాటులోకి రాలేదు.

రాజమహేంద్రవరం నేరవార్తలు: చింతపల్లి ఏజెన్సీ నుంచి దిల్లీకి గంజాయి సరఫరా చేస్తున్న ఏడుగురు సభ్యుల ముఠాను తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణం బొమ్మూరు స్టేషన్‌ పోలీసులు అరెస్టు చేయడంతోపాటు 120 కేజీల సరకు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.ఏడున్నర లక్షలు ఉంటుందన్నారు. సీఐ రాయుడు విజయ్‌కుమార్‌ వివరాల మేరకు.. గ్రామీణం పరిధి నవభారత్‌నగర్‌లో ఓ ఇంట్లో కొందరు వ్యక్తులు గంజాయి రవాణాకు పాల్పడుతున్నట్లు విశ్వసనీయ సమాచారంతో బుధవారం దాడి చేసి ఏడుగురిని అదుపులోకి తీసున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతలూరు గ్రామానికి చెందిన గెమ్మిలి నాగేశ్వరరావు, పెద్దగడ్డ వంగసార గ్రామానికి చెందిన సిందేరి రమేష్‌, విశాఖ జిల్లా కోటవురట్ల మండలం రాజులపాలెం ప్రాంతానికి చెందిన మొగిలి సూర్యనారాయణ, పుట్టపర్తి జిల్లా కొత్తచెరువు కమ్మపాల్యం వీధికి చెందిన ముత్తరాసి నరేష్‌, దిల్లీకి చెందిన టోనీ సచ్‌దేవ్‌ అలియాస్‌ దీపు, ప్రిన్స్‌ గిల్దియాల్‌ అలియాస్‌ ప్రిన్స్‌, అర్జున్‌ గోపాలస్వామిలను అరెస్టు చేశారు. వీరిలో నాగేశ్వరరావు, రమేష్‌ చింతపల్లి ఏజెన్సీలో గంజాయిని కొనుగోలు చేసి రాజమహేంద్రవరంలోని సూర్యనారాయణ, నరేష్‌లకు అప్పగిస్తే దీపు, ప్రిన్స్‌, అర్జున్‌లు దాన్ని అక్రమంగా దిల్లీకి సరఫరా చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తెలిందని సీఐ తెలిపారు. గంజాయితోపాటు రెండు వాహనాలు సీజ్‌ చేశామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని