logo

సాంకేతిక పద్ధతిలో చెత్త సమస్యకు పరిష్కారం

సాంకేతిక పద్ధతిలో దీర్ఘకాలికంగా పేరుకుపోయిన చెత్త సమస్యను పరిష్కరిస్తున్నామని కలెక్టర్‌ కె.మాధవీలత అన్నారు.

Published : 30 Mar 2023 05:26 IST

చెత్తశుద్ధి కేంద్రంలో వివరాలు తెలుసుకుంటున్న కలెక్టర్‌ మాధవీలత

కొవ్వూరు పట్టణం: సాంకేతిక పద్ధతిలో దీర్ఘకాలికంగా పేరుకుపోయిన చెత్త సమస్యను పరిష్కరిస్తున్నామని కలెక్టర్‌ కె.మాధవీలత అన్నారు. కొవ్వూరు పట్టణ పరిధి కాటన్‌ విగ్రహం సమీపంలో లెగసీ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్‌ను బుధవారం ఆమె పరిశీలించారు. చెత్తను శుద్ధి చేసే పనులను పర్యవేక్షించి గుత్తేదారులు, అధికారులకు సూచనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ ఏళ్ల నుంచి పేరుకుపోయిన చెత్తను శుద్ధి సిమెంటు కర్మాగారాలకు తరలిస్తారన్నారు. తరుణ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థతో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ చేసుకున్న ఒప్పందం మేరకు చెత్తను వేరు చేసే ప్రక్రియ సాగుతోందన్నారు. యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించేలా శ్రద్ధ చూపాలని కమిషనర్‌ బి.శ్రీకాంత్‌కు సూచించారు. చెత్త పూర్తిగా తొలగించిన తర్వాత ఈ ప్రదేశంలో మోడల్‌ పోలీస్‌స్టేషన్‌, సబ్‌ పోలీస్‌స్టేషన్ల నిర్మాణం చేపట్టాలన్నారు. ఆర్డీవో ఎస్‌.మల్లిబాబు, ఏఈలు కిషోర్‌, సుమంత్‌, సిబ్బంది పాల్గొన్నారు.

ఇసుక రీచ్‌ల అనుమతులకు ఆదేశాలు

వి.ఎల్‌.పురం(రాజమహేంద్రవరం): జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఇసుక రీచ్‌లకు అనుమతులు జారీ చేయాలని కలెక్టర్‌ మాధవీలత సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి సాండ్‌ కమిటీ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ వచ్చే సమావేశం నాటికి జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఇసుక రీచ్‌లకు అనుమతులు జారీ చేయాలన్నారు. కొవ్వూరు డివిజన్‌లో రెండు రీచ్‌లకు అనుమతి వచ్చిందన్నారు. జిల్లాలో గుర్తించిన 39 రీచ్‌లకు సంబంధించి పూర్తిస్థాయి నివేదిక సిద్ధం చేయాలన్నారు. ప్రస్తుతం జిల్లాలోని ఏడు రీచ్‌లలో 82,548 మెట్రిక్‌ టన్నుల ఇసుక అందుబాటులో ఉన్నట్లు అధికారులు వివరించారు. గత సమావేశంలో నిర్ణయం మేరకు పందలపర్రు, జీడిగుంట, కుమారదేవం ఇసుక రీచ్‌లకు అనుమతులు ఇచ్చామన్నారు. కడియపులంకకు రీచ్‌కు సంబంధించి ఈసీ ప్రతిపాదనకు పంపించామన్నారు. గతంలో బోట్స్‌మ్యాన్‌ సొసైటీ ద్వారా ఆరు సొసైటీలు దరఖాస్తు చేసుకోగా అయిదింటికి అనుమతులు ఇచ్చామన్నారు. సమావేశంలో జేసీ తేజ్‌భరత్‌, ఆర్డీవో చైత్రవర్షిణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని