logo

వైకాపాలో భగ్గుమన్న విభేదాలు

మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఇప్పటివరకు ప్రతిపక్ష కౌన్సిలర్లు తమ సమస్యలపై స్పందించడం లేదని వాకౌట్‌ చేయడం చూశాం...కానీ అమలాపురం పట్టణంలో అధికారపార్టీ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌పై అధికారపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాకౌట్‌ చేయడం ఆశ్చర్యానికి గురి చేసింది.

Published : 30 Mar 2023 05:26 IST

కమిషనర్‌ను నిలదీస్తున్న జనసేన కౌన్సిలర్లు

అమలాపురం పట్టణం: మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఇప్పటివరకు ప్రతిపక్ష కౌన్సిలర్లు తమ సమస్యలపై స్పందించడం లేదని వాకౌట్‌ చేయడం చూశాం...కానీ అమలాపురం పట్టణంలో అధికారపార్టీ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌పై అధికారపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాకౌట్‌ చేయడం ఆశ్చర్యానికి గురి చేసింది. అమలాపురం పురపాలక సంఘ కార్యాలయంలో ఛైర్‌పర్సన్‌ రెడ్డి సత్యనాగేంద్రమణి అధ్యక్షతన   కౌన్సిల్‌ సమావేశం బుధవారం నిర్వహించారు.  ఛైర్‌పర్సన్‌  సభను ప్రారంభిస్తూ తనకు తెలియకుండా మంత్రి విశ్వరూప్‌ పేరిట అభివృద్ధి కార్యక్రమాలంటూ అజెండాలో అంశాలు ప్రెవేశపెట్టడం ఏంటని  కమిషనర్‌ అయ్యప్పనాయుడు, డీఈ అప్పలరాజులను ప్రశ్నించారు. డీఈఈ, పట్టణ ప్రణాళిక, రెవెన్యూ సెక్షన్లలో సీసీ కెమెరాలు  ఛైర్‌పర్సన్‌ ఛాంబర్‌కు కనెక్ట్‌ చేయాలని 16 నెలలుగా అడుగుతున్నా ఎందుకు స్పందిచడం లేదని నిలదీశారు. దీనిపై వైకాపా పట్టణ అధ్యక్షుడు చంద్రశేఖర్‌, వైకాపా కౌన్సిలర్లు ఛైర్‌పర్సన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మిమ్మల్ని ఛైర్‌పర్సన్‌ చేసిన మంత్రి విశ్వరూప్‌కు, పార్టీకి మీరిచ్చే గౌరవం ఇదేనా అంటూ అరుపులు కేకలు వేస్తూ వైకాపా కౌన్సిలర్లు అందరూ ఒక్కసారిగా లేచి వెళ్లిపోయారు.. తానేమి తప్పు మాట్లాడలేదని అయినా వైకాపా కౌన్సిలర్లు ఈ విధంగా ప్రవర్తించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా నాయకులు పక్కనే ఉన్న డీఈ కార్యాలయంలోకి వెళ్లిపోగా మున్సిపల్‌ కమిషనర్‌ కూడా వెళ్లిపోతుండటంతో  ఛైర్‌పర్సన్‌ అసహనం వ్యక్తం చేస్తూ సమావేశాన్ని ఒక గంట వాయిదా వేసి ఆమె ఛాంబర్‌లోకి వెళ్లిపోయారు.ఈ సందర్భంగా అజెండాలో 36 అంశాలను, సుమారు రూ.80లక్షల అభివృద్ధి పనులకు కౌన్సిల్‌ సమావేశం ఆమోదించింది.

సమస్యలు ఏకరవు

పట్టణంలో విద్యుత్తు దీపాలు వెలగకపోతే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని, చేసే అభివృద్ధి పనులకు అజెండాలో ప్రతిపక్ష కౌన్సిలర్ల పేర్లు ఎందుకు పెట్టడం లేదని మున్సిపల్‌ ప్రతిపక్ష నాయకుడు ఏడిద శ్రీను ప్రశ్నించారు. బోడసకుర్రు టిడ్కో భవనాలను పేదలకు అందించేలా చూడాలని అయిదో వార్డు తెదేపా కౌన్సిలర్‌ బొర్రా వెంకటేశ్వరరావు కోరారు.వార్డుల్లో చేస్తున్న అభివృద్ధి పనులకు కౌన్సిలర్లను సంప్రదించకుండా కేవలం మంత్రి పేరు మీదే అజెండాలో అంశాలను పొందు పరచడం ఏమిటని జనసేన, తెదేపా కౌన్సిలర్లు ప్రశ్నించారు.  మహిళా ఛైర్‌పర్సన్‌ను వైైకాపా నాయకులు అవమానపరిచారన్నారు. జనసేన, తెదేపా కౌన్సిలర్లు పోడియం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.

అయిపోయిన పనులకు అంచనాలా

1వ వార్డు చింతగుంట చెరువు వద్ద నిర్మాణం చేసిన భవనానికి మళ్లీ వివిధ అవసరాలకు అని పేరు చెప్పి భవనం నిర్మాణం చేసేందుకు రూ.4.30లక్షలు కేటాయించాలని అజెండాలో ఎందుకు పెట్టారని 21వ వార్డు తెదేపా కౌన్సిలర్‌ అబ్బిరెడ్డి చంటి నిలదీశారు.  అంబేడ్కర్‌ విగ్రహ భవనం అని కాకుండా పేర్లు మార్చడం ఏంటని ప్రతిపక్ష కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పురపాలక సంఘ పరిధిలో 150 మంది సిబ్బంది ఉన్నా పట్టణంలో అపరిశుభ్రం తాండవిస్తుందని 7వ వార్డు కౌన్సిలర్‌ గండి దేవిహారిక ఆరోపించారు.

ఈనాడు కథనానికి స్పందన

నల్లవంతెన బైపాస్‌రోడ్డు శ్మశానవాటికకు వెళ్లేదారిలో రూ.85లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టినా మధ్యలో  కరెంట్‌ స్తంభాలు తొలగించకుండానే రోడ్డేస్తున్నారని ఈనాడులో ఈ నెల 24వ తేదీన వార్త ప్రచురితమైంది. దీనిపై స్పందించిన ప్రజాప్రతినిధులు, అధికారులు రూ.5లక్షలతో మధ్యలో కరెంట్‌ స్తంభాలు తొలగించి చివరన వేసేటట్టు ఆమోదించారు. వైకాపా కౌన్సిలర్‌ సంసాని నాని మాట్లాడుతూ  ఈనాడులో కథనం వచ్చేవరకు ఏంచేస్తున్నారని ప్రశ్నించారు.. ఈ సమావేశంలో మున్సిపల్‌ వైస్‌ఛైర్మన్‌ నానిరాజు, కోఆప్షన్‌ సభ్యులు, మున్సిపల్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సమావేశం మధ్యలో వెళ్లిపోతున్న వైకాపా కౌన్సిలర్లు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని