logo

వెంకన్న కల్యాణం చూతము రారండి..!

కోనసీమ తిరుపతిగా వెలుగొందుతున్న వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి తీర్థం, కల్యాణోత్సవాలు రేపటి నుంచి వారం రోజులు వైభవంగా జరగనున్నాయి.

Updated : 30 Mar 2023 06:34 IST

ఉత్సవాలకు అంకురార్పణ రేపు

  స్వర్ణ కవచంలో వేంకటేశ్వరుడు

కోనసీమ తిరుపతిగా వెలుగొందుతున్న వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి తీర్థం, కల్యాణోత్సవాలు రేపటి నుంచి వారం రోజులు వైభవంగా జరగనున్నాయి. శుక్రవారం ఉత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. స్వామివారి రథోత్సవం శనివారం మధ్యాహ్నం 3 గంటలకు, కల్యాణం రాత్రి 7 గంటలకు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ పాలకమండలి ఛైర్మన్‌ రుద్రరాజు రమేష్‌రాజు, ఈవో ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.  

న్యూస్‌టుడే, ఆత్రేయపురం


దైవభక్తి

కోరిన వారికి కొంగు బంగారమైన ఈ స్వామి దేశంలో ఎక్కడా లేనివిధంగా అరుదైన రక్తచందనం చెక్కతో ఈ దైవరూపం వెలిసింది. స్వామివారు అశ్వారూఢులై తిరుపతి నుంచి బయలుదేరి మార్గమధ్యలో ద్వారకా తిరుమలలో ఓ అంశనూ, ఈ వాడపల్లి క్షేత్రంలో మరో అంశనూ స్థాపించినట్లు పురాణాలు ఘోషిస్తున్నాయి. ఆలయం వద్ద మాడ వీధుల్లో ఏడు శనివారాలు ఏడు ప్రదక్షణాలు చొప్పున 49 ప్రదక్షణాలు చేసి స్వామిని దర్శిస్తే కోరిన కోర్కెలు తీరతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రతి శనివారం  వేల సంఖ్యలో భక్తులు స్వామిని దర్శిస్తారు.


దేశభక్తి

1931 సంవత్సరం వాడపల్లి తీర్థం రోజున రథోత్సవం జరుగుతుండగా రథం మీద ఉంచిన గాంధీ చిత్రపటాన్ని, త్రివర్ణపతాకాన్ని బ్రిటిష్‌ పాలకులు తొలగించడంతో వారిని ఎదిరించినందుకు తుపాకీ¨ గుళ్లకు బలై పలువురు దేశభక్తులు అసువులు బాశారు. అందుకే ఇక్కడ రథోత్సవ కార్యక్రమానికి ప్రత్యేకత నెలకొంది.


ఏర్పాట్లు

ఉత్సవాలకు వచ్చే భక్తులకు మంచినీటి సదుపాయం తదితర ఏర్పాట్లు చేశారు, ఆర్టీసీ వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతోంది.


కార్యక్రమ వివరాలిలా..

* మార్చి 31: అంకురార్పణ, ధ్వజారోహణం
*  ఏప్రిల్‌ 1: శనివారం ఎదుర్కోలు ఉత్సవం, రథోత్సవం, రాత్రి 7 గంటలకు కల్యాణం.
*  2న ఆదివారం శాంతిహోమం, గరుడ వాహనం, 3న పొన్నవాహన మహోత్సవం, 4న సదస్యం, 5న తెప్పోత్సవం
*  6న మహాపూర్ణాహుతి, చక్రస్నానం, ధ్వజావరోహణ
*  7న శ్రీపుష్పోత్సవం (పవళింపుసేవ)తో ఉత్సవాలు  ముగుస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని