logo

అనుమానం పెనుభూతమై.. అమ్మానాన్న దూరమై..

అనుమానం నిండు కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. అయిదేళ్ల క్రితం తల్లిని... నేడు తండ్రిని పిల్లలకు దూరం చేసింది.

Published : 30 Mar 2023 05:26 IST

కడియం, న్యూస్‌టుడే: అనుమానం నిండు కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. అయిదేళ్ల క్రితం తల్లిని... నేడు తండ్రిని పిల్లలకు దూరం చేసింది. అమ్మానాన్నలతో ఆనందంగా ఉండాలన్న ఆ పిల్లల కలను తుంచివేసి అనాథలను చేసింది. కడియం పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. కడియపుసావరం గుబ్బలవారిపాలెంలో దొంగల శ్రీనివాస్‌, జయ అలియాస్‌ దుర్గ దంపతులకు ఇద్దరు పిల్లలు. భార్యాభర్తల మధ్య తరచూ కలహాలు జరిగేవి. ఇదే విషయమై పలుమార్లు గ్రామపెద్దల ఎదుట పంచాయితీలు జరిగాయి. తనతో పాటు వచ్చేందుకు భార్య నిరాకరించడంతో శ్రీనివాస్‌ ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. దాంతో 2018 మేలో కూలి పనులకు వెళ్తున్న భార్య మెడపై కత్తితో తొమ్మిదిసార్లు దాడి చేశాడు. ఈ ఘటనతో ఆమె అధిక రక్తస్రావంతో మృతిచెందింది. అప్పటి కడియం పోలీసుస్టేషన్‌ ఇంఛార్జి సీఐగా ఉన్న టి.ముక్తేశ్వరరావు కేసు నమోదు చేశారు. పిల్లలకు ఏం జరిగిందో అర్థంకాని పరిస్థితి. ఈ కేసులో నిందితుడిగా అరెస్టయిన శ్రీనివాస్‌ బెయిల్‌పై బయటకొచ్చాడు. కేసుకు సంబంధించి బుధవారం తుది తీర్పు వెలువడే అవకాశం ఉందని, హత్యానేరానికి తనకు శిక్ష పడుతుందని  భావించిన నిందితుడు భయంతో పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరాడు. కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ సాయంత్రం మృతిచెందాడు. ఆసుపత్రి వర్గాలు సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేశారు. తల్లిదండ్రులిద్దరూ మృతిచెందడంతో ఇద్దరి పిల్లలు కన్నీరుమున్నీరవుతున్నారు. శ్రీనివాస్‌ దంపతుల కుమార్తె  రెండు రోజుల క్రితమే ఇంటర్‌ మొదటి ఏడాది పరీక్షలు పూర్తిచేయగా.. కుమారుడు మరో నాలుగు రోజుల్లో పదో తరగతి పరీక్షలు రాయనున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని