సంక్షిప్త వార్తలు
కొత్తపేటలో రోడ్డు దాటుతున్న ఒక వృద్ధుడిని ఆటో బలంగా ఢీకొనడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందిన సంఘటనపై కొత్తపేట పోలీసులు కేసునమోదు చేశారు.
ఆటో ఢీకొని వృద్ధుడి మృతి
కొత్తపేట, న్యూస్‌టుడే: కొత్తపేటలో రోడ్డు దాటుతున్న ఒక వృద్ధుడిని ఆటో బలంగా ఢీకొనడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందిన సంఘటనపై కొత్తపేట పోలీసులు కేసునమోదు చేశారు. ఎస్సై మణికుమార్ తెలిపిన వివరాల ప్రకారం... వాడపాలేనికి చెందిన కడలి గణపతి(72) కూలి పనిచేసుకుంటూ జీవిస్తున్నాడు. గురువారం శ్రీరామనవమి సందర్భంగా కొత్తపేటలోని విద్యుత్తుశాఖ కార్యాలయం సమీపంలో అన్నసమారాధన కార్యక్రమంలో భోజనం చేసి ఇంటికి వెళ్లేందుకు రోడ్డు దాటుతున్నాడు. ఈ సమయంలో ఆటో అతడిని బలంగా ఢీకొనడంతో తలకు గాయమైంది. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. ఈ సంఘటనపై గణపతి కుమారుడు శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదుపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
మాయ చేసి.. బంగారం అపహరించి
మామిడికుదురు, న్యూస్‌టుడే: బంధువుల ఇంటికెళ్తున్న ఓ వృద్ధురాలికి అపరిచితుడు మాయమాటలు చెప్పి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసులను అపహరించిన ఘటన మండలంలోని అప్పనపల్లిలో బుధవారం రాత్రి 8 గంటల సమయంలో జరిగింది. 72 ఏళ్ల బాధితురాలు శ్రీకాకోళపు వసంతలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై షేక్ జానీబాషా గురువారం పేర్కొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాజమహేంద్రవరం నుంచి అప్పనపల్లిలోని తన బంధువుల ఇంటికి బయల్దేరిన వసంతలక్ష్మి పాశర్లపూడి కొండాలమ్మ చింత వద్దబస్సు దిగింది. అప్పనపల్లి వెళ్లేందుకు నిరీక్షిస్తున్న సమయంలో అపరిచిత వ్యక్తి వచ్చి తాను అక్కడికే వెళ్తున్నానని మభ్య పెట్టి ఆమెను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకున్నారు. మధ్యలో మార్గాన్ని మళ్లించి ఉచ్చులవారిపేట రోడ్డు మీదుగా తీసుకెళ్లాడు. అక్కడి కొబ్బరితోటలో ఆమెను బెదిరించి 5 కాసుల గొలుసు, మరో రెండున్నర కాసుల గొలుసును కాజేసి పారిపోయాడు. చీకటిలో దారీతెన్నూ తెలియని ఆమె ఎట్టకేలకు బంధువుల సాయంతో అక్కడి నుంచి బయటపడింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
అసభ్యంగా ప్రవర్తించిన బావపై కేసు
మండపేట, న్యూస్‌టుడే: పండగ సందర్భంగా పుట్టింటికి వచ్చిన మహిళపై ఆమె బావ (అక్క మొగుడు) వచ్చి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. మండపేటకు చెందిన ఓ మహిళ పండగకు బుధవారం తన తల్లి ఇంటికి వచ్చారు. ఆమెపై అక్క భర్త ముత్యాల స్వామి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ క్రమంలో అత్తపై కూడా దాడి చేసి ఇంటి కిటికీ అద్దాలు పగలగొట్టినట్లు వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎం.అశోక్ తెలిపారు.
హతవిధీ.. ఇదేం పరిస్థితి!
శ్యామలాసెంటర్, న్యూస్‌టుడే: పుస్తక పఠనంతో మెదడుకు మేత అందించాల్సిన వయసు పెడదోవ పట్టింది. వారిపై ఏ ప్రభావం పడిందో గాని మద్యంమత్తుతో మెదళ్లు మొద్దుబారిపోయాయి. ఆటపాటలు, తోటి విద్యార్థులతో ఆనందంగా గడపాల్సిన వారు పూటుగా మద్యం తాగి పాఠశాల ఆవరణలో బుధవారం వాంతులు చేసుకున్నారు. అందరినీ విస్తుగొలిపే ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలో వెలుగుచూసింది. ఓ పాఠశాలలో 7, 8, 9 తరగతులు చదువుతున్న విద్యార్థులు మద్యం తాగడమే కాక, ప్రేమపాఠాలు నేర్చుకున్నారు. తాము ప్రేమించిన అమ్మాయిల కోసం కొట్టుకున్నారు. గ్రూపులు కట్టి పాఠశాల ఆవరణలోనే తోటి విద్యార్థులను బెంబేలెత్తించారు. ఇదే సమయంలో తామేం తక్కువ కాదంటూ అదే పాఠశాలకు చెందిన కొందరు అమ్మాయిలు కూడా తాము ప్రేమించిన అబ్బాయిల కోసం గొడవ పడుతున్న విషయం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేసింది. ఈ విషయం నగరంలో గురువారం హాట్‌టాపిక్‌గా మారింది. విద్యార్థి దశలో ఈ విపరీత పరిణామాలేమిటని పలువురు ముక్కున వేలేసుకున్నారు. అసలు ఈ వయసు పిల్లలకు మద్యం ఎవరు విక్రయించారు? వారు తాగేందుకు అనుమతి ఎక్కడ ఇచ్చారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాన్ని సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడి వద్ద ‘న్యూస్‌టుడే’ ప్రస్తావించగా సుమారు 1,100 మంది విద్యార్థుల్లో పదిమంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. ఇప్పటికే పిలిపించి హెచ్చరించినా వారిలో మార్పు రాలేదన్నారు. శుక్రవారం వారి తల్లిదండ్రులను పిలిచి మరోసారి కౌన్సెలింగ్ ఇస్తామని, లేకుంటే టి.సి. ఇచ్చి పంపిస్తామని చెప్పారు.
తెదేపా ఘర్షణలో ఇరువర్గాలపై కేసు
దేవరపల్లి: దేవరపల్లి గ్రామంలో బుధవారం జరిగిన తెదేపా అవిర్భావ వేడుకల్లో తెదేపా శ్రేణులు రెండు వర్గాలుగా బాహాబాహీకి దిగారు. మిక్సీజార్లు, డబ్బాలతో దాడులు చేసుకోగా పాతూరి గిరిధర్ తలకు బలమైన గాయమైంది. ఈ క్రమంలో రెండువర్గాల వారు పరస్పరం ఫిర్యాదులు చేసుకోగా కేసులు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీహరిరావు గురువారం తెలిపారు. ఆవిర్భావ దినోత్సవానికి దేవరపల్లి సెంటర్‌కి వస్తే జేష్ఠ హరీష్, యాగంటి కృష్ణారావు, గద్దే యశ్వంత్, నందిగం బుల్లిరాజు మిక్సీజార్లతో దాడి చేశారని పాతూరి గిరిధర్ ఫిర్యాదుతో ఓ వర్గంపై కేసు నమోదు చేశారు. ఆండ్రు రాకేష్, ఉప్పులూరి రామారావు, అనపర్తి శ్రీనివాసు, మద్దుకూరి చరణ్, పిన్నమని నవీన్ వెంకట రమణలు తమతో గొడవపడి, దుర్భాషలాడి, చంపుతామని బెదిరించారని యాగంటి సాయిబాబు చేసిన ఫిర్యాదుతో మరోవర్గంపై కూడా కేసు నమోదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.
హోటల్ యజమానిపై చాకుతో దాడి
కోరుకొండ: కోరుకొండలో ఓ హోటల్ నిర్వహిస్తున్న యజమానిపై ఒక వ్యక్తి చాకుతో దాడి చేసిన సంఘటనకు సంబంధించి వివరాలను గురువారం రాత్రి పోలీసులు వెల్లడించారు. జంబూపట్నం గ్రామానికి చెందిన పితాని నరసింహమూర్తి కోరుకొండలో ఒక హోటల్‌ను నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరానికి చెందిన మహంకాళి రాజేష్ దంపతులు కొద్దికాలంగా ఈ హోటల్‌లో పనిచేస్తున్నారు. వీరికి, యజమానికి మధ్య విభేదాలు రావడంతో 20 రోజులుగా వారు పనికి రావడం లేదు. వారు యజమానికి రూ.7 వేలు అప్పు ఇవ్వాల్సి ఉండగా, ఇటీవల రూ.5 వేలు ఇచ్చేశారు. బుధవారం రాత్రి అటుగా వెళుతున్న రాజేష్‌ను మిగిలిన డబ్బులు ఎప్పుడు ఇస్తావని యజమాని అడగడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రాజేష్ అక్కడున్న చాకుతో నరసింహమూర్తి పొట్టపై పొడిచాడు. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సంఘటన వద్ద ఉన్నవారు రాజేష్‌ను పట్టుకుని కొట్టారు. ఈమేరకు ఆసుపత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్.ఐ కట్టా శారదా సతీష్ తెలిపారు.
110 కేజీల గంజాయి పట్టివేత
రాజానగరం: నర్సీపట్నం నుంచి తమిళనాడుకు అక్రమంగా రవాణా అవుతున్న 110 కేజీల గంజాయిని తూర్పుగోదావరి జిల్లా రాజానగరం పోలీసులు గురువారం పట్టుకున్నారు. ఎస్‌ఐ జుబేర్ తెలిపిన సమాచారం ప్రకారం.. రాజానగరం వద్ద జాతీయ రహదారిపై నరేంద్రపురం కూడలి వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్న సందర్భంగా.. లారీ క్యాబిన్‌పై టార్పాలిన్ కప్పి తరలిస్తున్న గంజాయి బస్తాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆ గంజాయిని తరలిస్తున్న పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామానికి చెందిన దండసాయి రాజు, అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం బుచ్చిపేట గ్రామానికి చెందిన శెట్టి సతీష్‌ను అరెస్టు చేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Odisha Train Accident: ఏమిటీ ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థ..?
-
Sports News
WTC Final: ఇషాన్, భరత్.. తుది జట్టులో ఎవరు? అతడికే మాజీ వికెట్ కీపర్ మద్దతు!
-
Movies News
Kevvu Karthik: కాబోయే సతీమణిని పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్
-
India News
Railway Board: గూడ్స్ రైలులో ఇనుప ఖనిజం.. ప్రమాద తీవ్రతకు అదీ ఓ కారణమే : రైల్వే బోర్డు
-
Politics News
Rahul Gandhi: తెలంగాణలోనూ భాజపాను తుడిచిపెట్టేస్తాం: రాహుల్ గాంధీ
-
Politics News
Nellore: తెదేపా నేత ఆనం వెంకటరమణారెడ్డిపై దాడికి యత్నం