logo

జగన్‌కు 2024 ఎన్నికల్లో బైబై చెప్పాలి: యనమల

రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో భ్రష్టుపట్టించిన ముఖ్యమంత్రి జగన్‌కు 2024 ఎన్నికల్లో బైబై చెప్పి, ఇంటికి పంపాలని శాసనమండలిలో ప్రతిపక్షనేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.

Published : 31 Mar 2023 03:33 IST

తొండంగిలో రాము తల్లిదండ్రులకు రూ.లక్ష సాయం
అందిస్తున్న కృష్ణుడు, పక్కన మాజీ మంత్రి యనమల తదితరులు

తుని, న్యూస్‌టుడే: రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో భ్రష్టుపట్టించిన ముఖ్యమంత్రి జగన్‌కు 2024 ఎన్నికల్లో బైబై చెప్పి, ఇంటికి పంపాలని శాసనమండలిలో ప్రతిపక్షనేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. పట్టణంలోని బెల్లపువీధిలో ఉన్న వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో గురువారం పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రజలు వైకాపా పాలనతో విసిగిపోయారని, వచ్చే ఎన్నికల్లో తెదేపాకు అధికారం కట్టబెట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యకర్తలు, నాయకులు ఐక్యతతో పనిచేసి ప్రజల సమస్యలపై పోరాడి వారితో మమేకం కావాలన్నారు. కార్యకర్తకు ఏ ఇబ్బంది వచ్చినా పార్టీ అండగా ఉంటుందని, కష్టపడి పనిచేసిన వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందన్నారు. పార్టీలో యువతకు అధిక ప్రాధాన్యం  ఉంటుందన్నారు. క్షేత్రస్థాయిలో ఓటరు జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించి దొంగ ఓట్లు, వలసపోయిన, మృతి చెందిన వారుంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. దొరికినంతా దోచుకోవడం, ఓట్లు కొనడం, అధికారంలోకి వస్తే మళ్లీ దండుకోవడం ఇదే...వైకాపా విధానంగా సాగుతోందని ఆరోపించారు. ఎన్నికల్లో దౌర్జన్యాలు చేయడానికి వైకాపా నాయకులు ప్రయత్నిస్తారని, తెదేపా కార్యకర్తలు వాటిని ధైర్యంగా తిప్పికొట్టాలన్నారు. సమావేశంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి యనమల దివ్య, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి యనమల కృష్ణుడు, నాయకులు శివరామకృష్ణన్‌, యినుగంటి సత్యనారాయణ, పోల్నాటి శేషగిరిరావు, గాడి రాజబాబు, కుక్కడపు బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల జాతరలో మృతి చెందిన దళిత యువకుడు రాము కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయాన్ని యనమల అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని