logo

అమరావతి రథం... అరసవల్లి పథం

పాలకుల అణచివేతలు.. పోలీసుల నిర్బంధాలు.. లెక్కలేనన్ని కేసులు.. ఇవేవీ రాజధాని రైతులు లెక్కచేయలేదు.. ఎత్తిన జెండా దించలేదు..  ‘అమరావతే ఆంధ్రుల రాజధాని’ అంటూ ముందుకు ఉరికారు.

Published : 31 Mar 2023 03:33 IST

ఉద్యమానికి 1,200 రోజులు
నేడు రామచంద్రపురం నుంచి యాత్ర

రామచంద్రపురం: చోడవరంలో నిలిపిన రథం

ఈనాడు, కాకినాడ- రామచంద్రపురం: పాలకుల అణచివేతలు.. పోలీసుల నిర్బంధాలు.. లెక్కలేనన్ని కేసులు.. ఇవేవీ రాజధాని రైతులు లెక్కచేయలేదు.. ఎత్తిన జెండా దించలేదు..  ‘అమరావతే ఆంధ్రుల రాజధాని’ అంటూ ముందుకు ఉరికారు. అమరావతి ఉద్యమానికి నేటితో 1,200 రోజులు. ఈ నేపథ్యంలో 2.0గా ప్రారంభమైన యాత్ర కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ రథంతో రైతులు శుక్రవారం బయలుదేరి ఏప్రిల్‌ 2న  అరసవల్లి చేరుకుని స్వామి మొక్కుతీర్చుకోనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ మూడు రాజధానుల ప్రకటనతో.. అమరావతి రాజధాని సాధన ఉద్యమం మరింత ఉద్ధృతమైంది. ప్రజల్లోకి తమ వాదన తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో మహాపాదయాత్ర 2.0కు రూపకల్పన చేసిన రైతులు గతేడాది సెప్టెంబరు 12న అమరావతి నుంచి అరసవల్లి వరకు పాదయాత్ర ప్రారంభించి.. సూర్యభగవానుడికి మొక్కు తీర్చుకోవాలని నిర్ణయించారు. 40 రోజులపాటు సాగిన ఈ యాత్ర రామచంద్రపురంలో పోలీసుల అభ్యంతరంతో ఆగింది. దీంతో రైతులు పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించాల్సి వచ్చింది. యాత్ర వెంట సాగిన వెంకటేశుని దివ్యరథాన్ని రామచంద్రపురంలోనే నిలిపారు.

గతేడాది ఉమ్మడి జిల్లాలో సాగిన అమరావతి రైతుల యాత్ర

అడ్డంకులతో ఆగి.. సంకల్పంతో సాగి..

యాత్రపై అక్టోబరు 21న రామచంద్రపురంలో ప్రవేశించే సమయంలో రైతుల నిరసనలు.. పోలీసుల ప్రతిఘటనలతో వాతావరణం వేడెక్కింది. ఈ క్రమంలో పలువురు రైతులు గాయపడ్డారు. ఆంక్షలు ఛేదించుకుని రామచంద్రపురం చేరుకున్నా.. ఆ మరుసటి రోజున బస ప్రాంగణం నుంచి ముందుకు కదల్లేని పరిస్థితి ఎదురయ్యింది. గుర్తింపు కార్డులు ఉన్నవారికే యాత్రకు అనుమతిస్తామని పోలీసులు ఆంక్షలు విధించడంతో గతేడాది అక్టోబరు 22న పాదయాత్రకు రైతులు తాత్కాలిక విరామం ప్రకటించాల్సి వచ్చింది. రామచంద్రపురంలో దివ్యరథాన్ని నిలిపి.. రైతులు స్వగ్రామాలకు వెళ్లిపోయారు. తర్వాత రథానికి అమర్చిన సీసీ కెమెరాల్లో రికార్డయిన ఫుటేజీ హార్డ్‌ డిస్కులు పోలీసులు స్వాధీనం చేసుకోవడం.. విధులకు ఆటంకం కలిగించారన్న ఉద్దేశంతో అక్కడి భద్రత సిబ్బందిని పోలీసులు కొట్టడం అప్పట్లో వివాదాస్పదమైన విషయం తెలిసిందే.

ఏప్రిల్‌ 2 నాటికి చేరేలా..

రామచంద్రపురంలో ఆగిన ‘అమరావతి నుంచి అరసవల్లి పాదయాత్ర’ను పరిపూర్ణం చేయడానికి ఈ ఏడాది జనవరి 11న అమరావతి ఐకాస కోకన్వీనర్‌ గద్దె తిరుపతిరావు ఒంటరిగా నడక ప్రారంభించారు. రామచంద్రపురంలో పూజలు చేసి.. కాలినడకన అరసవల్లి చేరుకుని రైతుల తరఫున మొక్కు చెల్లించారు. ఆగిన రథాన్ని స్వామి సన్నిధికి చేరిస్తే తమ ఆకాంక్ష నెరవేరుతుందన్న ఉద్దేశంతో అరసవల్లి తీసుకెళ్లి అక్కడ పూజలతో మొక్కు తీర్చుకుని యాత్ర ముగించాలని నిర్ణయానికి వచ్చారు. రైతులు, ఇతరులెవ్వరూ రథం వెంట రావద్దని.. ఏప్రిల్‌ 2 నాటికి నేరుగా అరసవల్లికే చేరుకోవాలని రాజధాని రైతులు విన్నవించిన విషయం తెలిసిందే. రామచంద్రపురం మండలం చోడవరం గ్రామంలో నిలిపిన వెంకటేశుని దివ్య రథాన్ని శుక్రవారం పూజల అనంతరం ఆర్భాటాలు లేకుండా అరసవల్లి తరలించనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు