logo

మార్మోగిన జై శ్రీరాం నినాదం

రాజమహేంద్రవరం నగరం గురువారం సాయంత్రం ‘జై శ్రీరాం’ నినాదంతో మార్మోగింది. శ్రీరామనవమిని పురస్కరించుకుని శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శోభాయాత్ర పేరుతో బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

Published : 31 Mar 2023 03:33 IST

ప్రసంగిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ సాధు పరిషత్‌ అధ్యక్షుడు శ్రీనివాసానందస్వామి

దేవీచౌక్‌(రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: రాజమహేంద్రవరం నగరం గురువారం సాయంత్రం ‘జై శ్రీరాం’ నినాదంతో మార్మోగింది. శ్రీరామనవమిని పురస్కరించుకుని శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శోభాయాత్ర పేరుతో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో యువత, మహిళలు, పిల్లలు, రామభక్తులు పాల్గొన్నారు. మధ్యాహ్నం నుంచే రామభక్తులు పెద్ద ఎత్తున పుష్కరఘాట్‌కు చేరుకున్నారు. అక్కడ ‘జై శ్రీరాం’ పేరుతో కాషాయ జెండాలు రెపరెపలాడాయి. ఆంధ్రప్రదేశ్‌ సాధు పరిషత్‌ అధ్యక్షుడు శ్రీనివాసానంద స్వామి ప్రసంగిస్తూ శ్రీరామచంద్రుని మార్గాన్ని అనుసరిద్దామని పిలుపునిచ్చారు. ప్రపంచానికి భాష, సంస్కృతి, విజ్ఞానాన్ని నేర్పిన భారతదేశంపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. హిందువుల పుణ్యక్షేత్రాల దర్శనానికి రాయితీ ఇవ్వాలన్నారు. హిందూ సమాజాన్ని, వారి మనోభావాలను గౌరవించాలన్నారు. హిందూ ధర్మాన్ని రక్షించుకుంటామని భక్తులతో ప్రతిజ్ఞ చేయించారు. ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ మాట్లాడారు. అనంతరం స్వామీజీ రావణదహనం కార్యక్రమం నిర్వహించి ప్రారంభించిన ర్యాలీలో సుమారు 10 వేల మంది పాల్గొన్నారు. పుష్కరఘాట్‌ వద్ద ప్రారంభమైన ర్యాలీ ఆర్యాపురం, కంబాలచెరువు, నందం గనిరాజు కూడలి, గోరక్షణపేట, ఏవీఏ రోడ్డు, పాతసోమాలమ్మ ఆలయం, ఆర్టీసీ కాంప్లెక్స్‌, స్టేడియం రోడ్డు మీదుగా తిరిగి పుష్కరఘాట్‌కు చేరుకుంది. శ్రీరాముడు, ఆంజనేయుడు తదితర దేవతామూర్తుల వేషధారణలతో కళాకారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో తాళ్ళూరి మఠం పీఠాధిపతి వెంకట సత్యనారాయణ ప్రసాదాచార్యులు, ఉత్సవ సమితి సభ్యులు, జనసేన, భాజపా నాయకులు, భాజపా అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

పుష్కరఘాట్‌ వద్ద శోభాయాత్రకు హాజరైన భక్తులు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు