logo

126 కేంద్రాల్లో పది పరీక్షలు

పదో తరగతి పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని జిల్లా విద్యాశాఖాధికారి ఎస్‌.అబ్రహం చెప్పారు.

Published : 31 Mar 2023 03:33 IST

న్యూస్‌టుడే, శ్యామలాసెంటర్‌

పదో తరగతి పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని జిల్లా విద్యాశాఖాధికారి ఎస్‌.అబ్రహం చెప్పారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో ఏప్రిల్‌ 3 నుంచి పరీక్షలు రాసేందుకు అవసరమైన వసతులు కల్పిస్తున్నామన్నారు. పరీక్షలకు సంబంధించి  ఈ ఏడాది కొత్తగా పలు కీలక మార్పులు జరిగాయన్నారు. ‘న్యూస్‌టుడే’ ముఖాముఖిలో ఆయన పలు అంశాలు వెల్లడించారు.

 కోడ్‌తో కట్టడి..

ఈసారి ప్రశ్నపత్రంపైనా కోడ్‌ అమలు చేస్తున్నాం. దీనివల్ల ప్రశ్నపత్రం లీక్‌ కావడం వంటివి చోటుచేసుకునే అవకాశం లేదు. ఒకవేళ లీకైనా ఏ జిల్లా, ఏ పరీక్ష కేంద్రం నుంచి లీకైందో క్షణాల్లో తెలిసిపోతుంది. విద్యార్థులు మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడకుండా ఉండేందుకు ఈ పద్ధతిని తొలిసారి ప్రభుత్వం తీసుకువచ్చింది. దీంతోపాటు విద్యార్థులకు 24 పేజీల బుక్‌లెట్‌ను ఇస్తారు.

 చరవాణి అనుమతిలేదు..

పదో తరగతి పరీక్షలు సజావుగా జరిపేందుకు పరీక్ష కేంద్రం చీఫ్‌ సూపరింటెండెంట్‌ (సీఎస్‌)కు మాత్రమే గతంలో చరవాణి(సెల్‌ఫోన్‌) అనుమతి ఉండేది. ఈసారి సీఎస్‌కు కూడా అనుమతి లేదు. దీంతోపాటు ఇన్విజిలేటర్‌కు కూడా చరవాణి అనుమతిలేదు. 

 అరగంట ముందు మాత్రమే ప్రశ్నపత్రం

పదోతరగతి ప్రశ్నపత్రాలను ఇప్పటికే జిల్లాలోని మండల కేంద్రాలు, పోలీసు స్టేషన్లకు చేరాయి. పరీక్షకు 30 నిమిషాల ముందు మాత్రమే వాటిని ఆయా మండల కేంద్రాల నుంచి పోలీసు బందోబస్తు నడుమ కేంద్రానికి తరలిస్తారు.

 అయిదు సమస్యాత్మక కేంద్రాలు

జిల్లాలో అయిదు సమస్యాత్మక కేంద్రాలను గుర్తించాం. ‘సి’ కేటగిరీ కేంద్రాలు 28 ఉన్నాయి.  వీటికి ఒక్కో సెంటర్‌కు ఒక్కో సిట్టింగ్‌ స్క్వాడ్‌ ఏర్పాటు చేశాం. ఇందులో ఏఎస్సై, డిప్యూటీ తహసీల్దారు, ఎంఈఓ ఉంటారు. 126 చోట్లా 11 మంది ఇన్విజిలేటర్లు, ఒక సీఎస్‌, ఒక ప్రభుత్వ అధికారిని నియమించాం.

 సౌకర్యాలున్నచోటే నిర్వహణ

జిల్లాలో 492 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలున్నాయి. వీటిలో కేవలం 126 కేంద్రాలుగా మాత్రమే గుర్తించి అక్కడ పరీక్షలు నిర్వహిస్తాం. నాడు-నేడు పనులు జరిగే పాఠశాలలను కేంద్రాలుగా కేటాయించలేదు.
ఏ ఒక్క విద్యార్థి నేలపై కూర్చొని పరీక్ష రాయకుండా సౌకర్యాలు ఉన్న కేంద్రాల్లోనే నిర్వహిస్తున్నాం.

 ఈసారి 26,129 మంది విద్యార్థులు

జిల్లాలో 126 కేంద్రాల్లో పదోతరగతి పరీక్షలు నిర్వహిస్తున్నాం. 26,129 మంది విద్యార్థులు పరీక్ష రాయనుండగా... వీరిలో బాలురు 13,518, బాలికలు 12,611 మంది ఉన్నారు.

 భయం వద్దు.. జయం మీదే

విద్యార్థులూ పరీక్షలకు ముందు రోజు వరకు పాఠశాలకు వెళ్లండి. ఉపాధ్యాయులు చెప్పే చిన్న చిన్న చిట్కాలు వినండి. ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రతి విద్యార్థి పది ఉత్తీర్ణత సాధించేందుకు  వారం వారం గ్రాండ్‌ టెస్ట్‌, స్లిప్‌ టెస్ట్‌లు పెట్టాం. నాలుగు నెలల కిందట చదివిన ప్రశ్నలే పబ్లిక్‌ పరీక్షల్లో వస్తాయి. భయపడకుండా రాయండి. ఈసారి పదో తరగతి సమ్మెటివ్‌ పరీక్షల ఆధారంగా చూస్తే ఫలితాలు 80 నుంచి 90 శాతం మధ్యలో వచ్చాయి. ఆ స్థాయిలోనే జిల్లాలో ఉత్తీర్ణత శాతం ఉంటుంది.

 తల్లిదండ్రులూ.. ఇది మీ బాధ్యత

పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు తల్లిదండ్రులు అండగా నిలవాలి. వారు చదువుతున్నంత సేపు ఇంట్లో టీవీలు, సినిమాలకు విరామం ప్రకటించండి. పిల్లలకు సమతుల ఆహారం ఇవ్వండి. పరీక్షలకు రెండు రోజులు ముందుగా కేంద్రానికి వెళ్లి ఒక్కసారి వాతావరణాన్ని పరిశీలించండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని