logo

బటన్ నొక్కినా.. బ్యాంకులో పడలేదు..

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బటన్‌నొక్కి ఆరు రోజులు గడుస్తున్నా.. ఎన్నికల హామీ నెరవేర్చామని చెబుతూ లబ్ధిదారుల ఇళ్లకు అతికించేందుకు సీఎం బొమ్మతో స్టిక్కర్లు కార్యాలయాలకు చేరినా.. ఆసరా మూడో విడత రుణమాఫీ సొమ్ము మాత్రం జిల్లాలోని డ్వాక్రా సంఘాల సభ్యులకు జమ కాలేదు.

Updated : 31 Mar 2023 09:41 IST

న్యూస్‌టుడే, కాకినాడ కలెక్టరేట్‌

సీఎం బొమ్మతో ఉన్న ఆసరా మూడో విడత స్టిక్కరు

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బటన్‌నొక్కి ఆరు రోజులు గడుస్తున్నా.. ఎన్నికల హామీ నెరవేర్చామని చెబుతూ లబ్ధిదారుల ఇళ్లకు అతికించేందుకు సీఎం బొమ్మతో స్టిక్కర్లు కార్యాలయాలకు చేరినా.. ఆసరా మూడో విడత రుణమాఫీ సొమ్ము మాత్రం జిల్లాలోని డ్వాక్రా సంఘాల సభ్యులకు జమ కాలేదు. రుణమాఫీ లబ్ధిపొందిన ప్రతి మహిళ ఇంటికి స్టిక్కర్‌ వేయాలని ఆదేశాలు ఇచ్చారు. వీటిని ఆయా మండల సమాఖ్యలకు పంపించి, అక్కడి నుంచి గ్రామాలకు వీవోఏల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఇప్పటికే మూడో విడత ఆసరా సాయం విడుదల నాలుగు నెలల ఆలస్యమైంది. కాకినాడ జిల్లాలో కేవలం ఒక మండలం పరిధిలోని డ్వాక్రా సంఘాల సభ్యులకు ఆసరా సొమ్ము  బుధవారం జమ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. కాకినాడ జిల్లాలోని 37,525 డ్వాక్రా సంఘాలకు రూ.303.96 కోట్లు ఆసరా మూడో విడత కింద మంజూరు చేశారు. పెదపూడి మండలం మినహా మిగతా మండలాల్లోని సంఘాలకు ఎప్పటికి జమ చేస్తారో స్పష్టత లేదు.

కాకినాడ డీఆర్‌డీఏ కార్యాలయంలో మండలాలకు తరలించడానికి సిద్ధం చేసిన ఆసరా స్టిక్కర్లు

ఇదీ  పరిస్థితి..

* కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో 4,063 డ్వాక్రా సంఘాలకు రూ.28.08 కోట్ల ఆసరా సొమ్ము మంజూరు చేశారు. ఈ నెల 26 నుంచి వరుసగా ఆసరా సంబరాలను ఆర్భాటంగా నిర్వహిస్తున్నారు. నాలుగు, అయిదు డివిజన్లకు ఒకచోట పెద్ద సభ పెట్టి మెగా చెక్కులు అందజేస్తున్నారు. సంబరాలు పూర్తయిన డివిజన్లలోని సభ్యులకు ఇప్పటికీ ఆసరా సొమ్ము ఖాతాలకు జమ కాలేదు. ఒక్కోచోట రూ. లక్ష నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చు చేసిన ఆసరా సంబరాలు అట్టహాసంగా చేస్తున్నారు.

* తుని, పిఠాపురం, పెద్దాపురం, సామర్లకోట పురపాలక సంఘాలు, గొల్లప్రోలు, ఏలేశ్వరం నగర పంచాయతీల్లోనూ ఇదే తంతు. వీటిలో 4,703 డ్వాక్రా సంఘాలకు రూ.38.35 కోట్ల ఆసరా మూడో విడత రుణమాఫీ సాయం మంజూరు చేశారు. ఇక్కడా ఆసరా సంబరాలు జరుగుతున్నాయి.

సంబరాలు జరపండి...  సొమ్ములేస్తాం..

గతేడాది నుంచి వైఎస్సార్‌ ఆసరా పథకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం షరతులు పెడుతోంది. రుణమాఫీకి సంబంధించి ఆసరా సంబరాలను వారం రోజులపాటు నిర్వహించాలని, ఏ రోజు ఏ మండలంలో ఇవి నిర్వహించారో అక్కడి డ్వాక్రా సంఘాలకు తరవాత రోజు మహిళల బ్యాంకు ఖాతాకు సొమ్ము జమ చేస్తామని చెబుతోంది. ఈ ఏడాది సైతం ఇదే పంథాను అనుసరిస్తోంది. ఈ నెల 25న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆసరా మూడో విడత విడుదలకు బటన్‌ నొక్కారు. 26 నుంచి ఏప్రిల్‌ 4 వరకు అన్ని మండలాల్లో ఆసరా సంబరాలు నిర్వహించాలని షెడ్యూల్‌ విడుదల చేశారు. దీని ప్రకారం 26న పెద్దాపురం, 27న పెదపూడి, గండేపల్లి, 28న రౌతులపూడి, పిఠాపురం, కిర్లంపూడి, 29న కరప, శంఖవరంలో సంబరాలు జరిపారు. వీటిలో ఒక మండలానికి చెందిన డ్వాక్రా మహిళలకు సొమ్ము వేశారు. ఈ నెల 31న జగ్గంపేట, ప్రత్తిపాడు, సామర్లకోట, యు.కొత్తపల్లి, తొండంగి, కాకినాడ గ్రామీణం, 1న తాళ్లరేవు, 2న కాజులూరు, 3న గొల్లప్రోలు, తుని, 4న కోటనందూరు మండలాల్లో సంబరాలు నిర్వహించనున్నారు. ఈ మండలాల్లోని డ్వాక్రా మహిళలకు ఎప్పటికి సొమ్ము జమ చేస్తారనేది వేచి చూడాలి.

దశల వారీగా  జమ

జిల్లాలోని డ్వాక్రా సంఘాల సభ్యుల బ్యాంకు ఖాతాలకు ఆసరా మూడో విడత సొమ్ము దశల వారీగా విడుదల చేస్తారు. ఏ మండలంలో ఆసరా సంబరాలు పూర్తి చేస్తారో ఆ రోజు సాయంత్రం వివరాలను సమర్పిస్తారు. దాని ప్రకారం ఆయా బ్యాంకుల ద్వారా డ్వాక్రా మహిళల ఖాతాలకు సొమ్ము జమయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. ఒక మండలంలో ఇప్పటికే సొమ్ము వేశారు. గురువారమూ బ్యాంకులు పనిచేశాయి. మరికొంత మందికి వీటిని జమ చేసేలా ఏర్పాట్లు చేశాం. వీలైనంత త్వరగా అన్ని సంఘాలకు సొమ్ము వేసేలా చర్యలు తీసుకుంటాం.

ప్రసాద్‌, ఎల్‌డీఎం, కాకినాడ జిల్లా


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని