logo

పంచాయతీల్లో సంపద సృష్టికి ప్రాధాన్యం

జిల్లాలోని అన్ని పంచాయతీల్లో చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) ఆర్‌.విక్టర్‌ తెలిపారు.

Published : 31 Mar 2023 03:33 IST

న్యూస్‌టుడే, కాకినాడ నగరం

జిల్లాలోని అన్ని పంచాయతీల్లో చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) ఆర్‌.విక్టర్‌ తెలిపారు. గ్రామాల్లో వీధి కుక్కల సంతానోత్పత్తిని నియంత్రించేందుకు కార్యాచరణ చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. గ్రామాల్లో పేరుకుపోయిన ఇంటి పన్నుల వసూళ్లపై చర్యలు తీసుకునేలా పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలిచ్చామని వివరించారు. గ్రామాల్లో నెలకొన్న వివిధ సమస్యలపై ఆయనతో ‘న్యూస్‌టుడే’ ముఖాముఖి వివరాలివీ..

న్యూస్‌టుడే: చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల పని తీరు ఎలా ఉంది.

డీపీవో: జిల్లాలో 385 పంచాయతీలకు గాను 277 చోట్ల చెత్త నుంచి సంపద కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఇక్కడ చెత్త నుంచి ఎరువులు తయారు చేసి కేజీ రూ.10కు విక్రయిస్తున్నారు. కొత్తగా మరో 92 కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నాం. అవి త్వరలోనే అందుబాటులోకి వస్తాయి.

జిల్లాలో పంచాయతీలపై విద్యుత్తు బిల్లుల భారమెంత.

ఇప్పటి వరకు జిల్లాలో పంచాయతీల విద్యుత్తు బిల్లుల కింద రూ.99.87 కోట్లు ఆర్థిక సంఘం నిధులు చెల్లించాం. మరో రూ.51.97కోట్లు చెల్లించాల్సి ఉంది.

గ్రామాల్లోని చిన్నచిన్న సమస్యల పరిష్కారానికి సైతం ప్రజలు జిల్లా కేంద్రానికి రావటానికి కారణాలేంటి.

ఇది మా దృష్టికి వచ్చింది. అందుకే గ్రామ స్థాయిలోనే స్పందన సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాం. సచివాలయాల్లో స్పందనకు వచ్చే స్థానిక సమస్యలను తక్షణం పరిష్కరించాలని ఆదేశించాం. ఇకపై ఈ సమస్యల పరిష్కారానికి ప్రతివారం సమీక్ష నిర్వహిస్తాం.

జిల్లాలో ఇంటి పన్నుల వసూళ్ల తీరు ఎలా ఉంది. మొండి బకాయిలపై ఏం చర్యలు తీసుకుంటున్నారు.

జిల్లాలో ఇంటి పన్నుల వసూళ్ల లక్ష్యం రూ.59.74 కోట్లు కాగా, ఇప్పటి వరకు రూ.33.95 కోట్లు వసూలు చేశాం. మరో రూ.13.65 కోట్ల పన్నులు కోర్టు వివాదాల్లో ఉన్నాయి. ఇందులో అత్యధికంగా పి.మల్లవరం (తాళ్లరేవు మండలం)లోనే రూ.11 కోట్ల వరకు ఉన్నాయి. మొండి బకాయిల వసూళ్లకు చర్యలు తీసుకుంటాం. మూడేళ్లు దాటిన బకాయిలపైనే కోర్టులకు వెళ్లే అవకాశం ఉంది.

ఆర్థిక సంఘం నిధుల విడుదల, వినియోగం తీరు ఎలా ఉంది.

ఉమ్మడి జిల్లాలో 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.948.65 కోట్లు విడుదలయ్యాయి. ఇందులో ఇంకా రూ.1.61 కోట్లు ఖర్చు కాలేదు. 15వ ఆర్థిక సంఘానికి సంబంధించి కాకినాడ జిల్లాకు రూ.126.86 కోట్లు విడుదలయ్యాయి. వీటిని వినియోగించుకుని పంచాయతీల్లో పనులు చేసుకోవచ్చు.

గ్రామాల్లో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయనే ఫిర్యాదులున్నాయి. అనేక మంది కుక్క కాట్లకు గురవుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి ఏం చేస్తున్నారు.

గ్రామాల్లో ప్రతి శని, ఆదివారాల్లో కుక్కలకు సంతాన నిరోధక శస్త్ర చికిత్సలు చేయాలని ఆదేశించాం. ఇందుకు ఆర్థిక సంఘం నిధులను వినియోగించుకోవాలని సూచించారు.

పంచాయతీల్లో కార్యదర్శుల కొరత తీవ్రంగా ఉంది. దీన్ని ఎలా అధిగమిస్తున్నారు.

కొన్నిచోట్ల కార్యదర్శులు లేనిమాట వాస్తవమే. అటువంటి వాటిని గుర్తించి పక్క పంచాయతీ కార్యదర్శులకు అదనపు బాధ్యతలు అప్పగించాం. ఆయా పంచాయతీలపై డీఎల్‌పీవోలు, ఈవోఆర్డీలు ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని