logo

వేతనం రూ.18,000.. కోత రూ.18,898

ఎండీయూ వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్‌ సరకుల పంపిణీ ప్రక్రియకు మూడేళ్ల కిందట శ్రీకారం చుట్టారు. దీని కోసం ఆపరేటర్లను నియమించారు.

Published : 01 Apr 2023 05:20 IST

కాకినాడలో ఎండీయూ వాహనం ద్వారా రేషన్‌ పంపిణీ (పాత చిత్రం)

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ఎండీయూ వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్‌ సరకుల పంపిణీ ప్రక్రియకు మూడేళ్ల కిందట శ్రీకారం చుట్టారు. దీని కోసం ఆపరేటర్లను నియమించారు. ఒక్కో వాహనాన్ని రూ.6.70 లక్షలతో కొనుగోలు చేశారు. అందులో పది శాతం లబ్ధిదారు వాటా కింద కట్టించుకున్నారు. వాహన బీమాకు సంబంధించి ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుందని తొలుత చెప్పారని, మొదటి ఏడాది ఆపరేటర్‌ వాటా నుంచి బీమా కింద ఒక్కొక్కరి నుంచి రూ.11,038,  రెండో ఏడాది రూ.10.845, తాజాగా మూడో ఏడాది రూ.18.898 తీసేసుకున్నారని వాపోతున్నారు. కాకినాడ జిల్లాలో 420, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 355, తూర్పుగోదావరి జిల్లాలో 364 మంది ఎండీయూ ఆపరేటర్లు ఉన్నారు. వీరందరికీ శుక్రవారం మార్చి నెల వేతనం కింద రూ.18వేలు బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. ఈ సొమ్ము పడ్డ కొద్ది సేపటికే మూడో ఏడాది బీమా ప్రీమియం బ్యాంకులు మినహాయించుకుని, మిగతా రూ.898 బాకీ ఉన్నట్లు చూపారు. దీనిపై వాహన ఆపరేటర్లు గగ్గోలు పెడుతున్నారు. నెలకు రూ.18వేలు వేతనం చెల్లిస్తున్నారని, దీనిలో సహాయకుడికి రూ.5 వేలు, డీజల్‌కు రూ.3వేలు చొప్పున ఇస్తున్నారని, ఇప్పుడు మొత్తం వేతనం బీమా కింద తీసేసుకోవడం అన్యాయమని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఎండీయూ వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్‌ పంపిణీ చేయలేమని చేతులెత్తేశారు. మూడు జిల్లాల్లోని సంయుక్త కలెక్టర్లకు శుక్రవారం వినతి పత్రాలు అందజేశారు. ఈ నేపథ్యంలో శనివారం నుంచి రేషన్‌ సరకుల పంపిణీపై సందిగ్ధత ఏర్పడింది. ఈ విషయాన్ని కాకినాడ జిల్లా జేసీ ఇలక్కియ వద్ద ప్రస్తావించగా.. ఇప్పటి వరకు వారు చెల్లించిన ప్రీమియం మొత్తాన్ని ఈ నెలలో తిరిగి వారి ఖాతాలకు జమచేసేందుకు పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ హామీ ఇచ్చారని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని