logo

కదిలింది.. దివ్య రథం

ఆంధ్రుల ఏకైక రాజధాని అమరావతి నినాదంతో రైతులు చేపట్టిన మహా పాదయాత్ర-2.0 పరిపూర్ణమయ్యే ఘడియలు ఆసన్నమయ్యాయి.

Updated : 01 Apr 2023 06:04 IST

ఈనాడు, కాకినాడ - న్యూస్‌టుడే,

రామచంద్రపురం: ఆంధ్రుల ఏకైక రాజధాని అమరావతి నినాదంతో రైతులు చేపట్టిన మహా పాదయాత్ర-2.0 పరిపూర్ణమయ్యే ఘడియలు ఆసన్నమయ్యాయి. ‘అమరావతి నుంచి అరసవల్లి వరకు రాజధాని రైతులు చేపట్టిన పాదయాత్ర’ పోలీసుల ఆంక్షలతో గతేడాది అక్టోబరు 22న రామచంద్రపురంలో నిలిచిన సంగతి తెలిసిందే. అరసవల్లి వెళ్లి సూర్య భగవానుడి సన్నిధిలో మొక్కు తీర్చుకునే సంకల్పంతో శుక్రవారం వేకువన అమరావతి నుంచి బయల్దేరిన రైతులు ఉదయాన్నే రామచంద్రపురం చేరుకున్నారు. చోడవరంలో నెలలుగా నిలిచిన రథాన్ని బయటకు తీసి శుభ్రం చేసి.. స్వామివారికి అలంకరణల అనంతరం.. శాస్త్రోక్తంగా పూజలు చేశారు. అరసవల్లి పర్యటనకు ఆటంకాలు కలగకూడదని కోరుకుంటూ గుమ్మడికాయతో దిష్టి తీసిన అనంతరం ఉదయం 9.30 గంటలకు ఎలాంటి ఆర్భాటం లేకుండా రథాన్ని తరలించారు. అమరావతి నుంచి వచ్చిన పది మంది రైతులు రథం ముందు కొంత దూరం నడుస్తూ.. జై అమరావతి.. జైజై అమరావతి.. మూడు రాజధానులు వద్దు.. అమరావతి ముద్దు.. అని నినాదాలు చేశారు. రాజధాని రైతులకు రామచంద్రపురం తెదేపా పట్టణ అధ్యక్షుడు కడియాల రాఘవన్‌, కొసన శ్రీనివాసరావు తదితరులు సంఘీభావం తెలిపారు.

నిరాడంబరంగా...

చోడవరంలో రథానికి గుమ్మడి కాయతో దిష్టి తీస్తున్న అమరావతి రైతు (అంతరచిత్రంలో స్వామి)

అరసవల్లి మొక్కు తీర్చుకోవడానికి గత ఏడాది రైతులు అమరావతి నుంచి బయల్దేరి.. చిన్న తిరుపతిలో పూజలు చేసి.. ఆపై అరసవల్లి చేరుకుని మొక్కు తీర్చుకోవాలని నిర్ణయించారు. అప్పట్లో పాదయాత్ర జనసంద్రం నడుమ సాగితే.. యాత్ర వెంట సాగిన స్వామి దివ్యరథం అడుగడుగునా పూజలందుకుంది. శుక్రవారం రామచంద్రపురం నుంచి బయలుదేరిన వెంకటేశుని దివ్య రథం నిరాడంబరంగా కదిలింది. రామచంద్రపురం మండలం చోడవరం నుంచి బయలుదేరిన రథం వేలంగి మీదుగా కాకినాడ గ్రామీణం- నగరంలోకి ప్రవేశించింది. అన్నమ్మఘాటీ- నర్సింహరోడ్డు- గాంధీనగర్‌ మీదుగా.. అచ్యుతాపురం రైల్వే గేటు మార్గంలోకి వచ్చింది. అక్కడ రైలు రాకతో గేటు వేయడంతో కాసేపు రథాన్ని నిలిపారు. దీంతో చుట్టుపక్కల వారు వచ్చి స్వామిని దర్శించుకున్నారు. అనంతరం అశోక్‌నగర్‌, ఎస్వీరంగారావు కూడలి, సర్పవరం జంక్షన్‌ మీదుగా పిఠాపురం రోడ్డులోకి జాతీయ రహదారి గుండా అరసవల్లికి సాగింది.

పోలీసుల ఆరా...

రామచంద్రపురం నుంచి బయలుదేరి అమరావతి రైతుల రథం కదలికలపై పోలీసులు, నిఘావర్గాలు దృష్టిసారించాయి. జగన్నాథపురం నర్సింహరోడ్డులో పోలీసులు రథం వద్దకు వచ్చి ఆరా తీశారు. చరవాణితో ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. రథం వెంట అమరావతి రైతులు, జనసందోహం లేకపోవడంతో ఎక్కడా నిలువరించలేదు. అమరావతి రైతుల రథాన్ని చూసి మార్గమధ్యంలో స్థానికులు ఆపి పూజలు చేసి స్వామి ఆశీస్సులు పొందారు.

వెంకటేశుని రథం ముందు ఆంధ్రుల రాజధాని అమరావతి అని నినదిస్తున్న రైతులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని