logo

పక్కా ప్రణాళికతో పది పరీక్షల నిర్వహణ

పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో చరవాణులను నిషేధించటంతో పాటు ఎలాంటి మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడకుండా చర్యలు తీసుకుంటున్నాం.

Published : 01 Apr 2023 05:20 IST

న్యూస్‌టుడే, అంబాజీపేట

పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో చరవాణులను నిషేధించటంతో పాటు ఎలాంటి మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఏప్రిల్‌ 3 నుంచి 18 వరకు నిర్వహించే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉమ్మడి జిల్లా పరీక్షల నిర్వహణ సంస్థ కార్యదర్శి బీర హనుమంతరావు వెల్లడించారు. పరీక్షలకు సంబంధించి ఆర్జేడీ నాగమణి పర్యవేక్షణలో జిల్లా విద్యాశాఖాధికారి  కమలకుమారి, పరీక్షల నిర్వహణ సహాయ కమిషనర్‌ బి.రమణశ్రీ నేతృత్వంలో ఏర్పాట్లు చేశామన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఆయన శుక్రవారం ‘న్యూస్‌టుడే’ తో ముఖాముఖి మాట్లాడారు.

119 పరీక్ష కేంద్రాలు

డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్‌   పాఠశాలలు 374 ఉన్నాయి.ఆ పాఠశాలల నుంచి 20,968 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. 19,084 మంది రెగ్యులర్‌ విద్యార్థులు కాగా....ప్రైవేట్‌గా 1883 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.బాలురు 10,869, బాలికలు 10,099 మంది పరీక్షలు రాయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 119 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలకు వచ్చే విద్యార్థులు సకాలంలో హాజరుకావాలి.

చరవాణులు నిషేధం

పది పరీక్ష కేంద్రాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరి వద్ద చరవాణులు ఉండకూడదు.ఇది పూర్తిగా నిషేధించాం.కనీసం డిపార్టుమెంటల్‌ అధికారి వద్ద కూడా ఉండకూడదు.పరీక్షల పర్యవేక్షణకు నిరంతరం స్క్వాడ్స్‌ పరిశీలన ఉంటుంది. ఇప్పటికే ఇన్విజిలేటర్లకు మార్గదర్శకాలు ఇచ్చేశాం. 1,092 మంది ఇన్విజిలేటర్లు, ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ 6, సిట్టింగ్‌ స్క్వాడ్స్‌ 35 మందిని నియమించారు.

కంట్రోలు రూమ్‌కు ఫిర్యాదు చేయాలి

పదో తరగతి పరీక్షలకు సంబంధించిన వివిధ సమస్యలపై కంట్రోల్‌ రూమ్‌కు ఫిర్యాదు చేయవచ్చు.దీని కోసం 8886750777, 9493819102 నంబర్లకు ఫోన్‌ చేసి తెలియజేయవచ్చు.

అన్ని సౌకర్యాలు ఏర్పాటు

పది పరీక్ష కేంద్రాల్లో వివిధ శాఖల అధికారుల సమన్వయంతో సౌకర్యాలను ఏర్పాటు చేశారు.పరీక్షలు ముగిసే వరకు విద్యుత్తు సరఫరా నిలుపుదల చేయకుండా చర్యలు తీసుకుంటున్నాం.పరీక్ష కేంద్రాల వద్ద వైద్య శిబిరాలను ఏర్పాటు చేశాం. విద్యార్థులు పదో తరగతి హాల్‌ టిక్కెట్టును చూపిస్తే ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే ఏర్పాటు చేశాం. పరీక్ష కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుద్ధ్యలోపాలు లేకుండా చర్యలు తీసుకున్నాం. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేందుకు తరగతి గదుల్లో పూర్తిస్థాయిలో వెలుతురు, బల్లలు, ఫ్యాన్లు సౌకర్యాలు ఏర్పాటు చేశాం. పరీక్ష కేంద్రాల వద్ద 114 సెక్షన్‌ అమలులో ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని