logo

మహానాడు సభకు స్థల పరిశీలన

దేపా మహానాడు మే 27, 28న రాజమహేంద్రవరంలో నిర్వహించనున్నట్లు పార్టీ అధిష్ఠానం నిర్ణయించడంతో శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

Published : 01 Apr 2023 05:20 IST

ఈనాడు - రాజమహేంద్రవరం: తెదేపా మహానాడు మే 27, 28న రాజమహేంద్రవరంలో నిర్వహించనున్నట్లు పార్టీ అధిష్ఠానం నిర్ణయించడంతో శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. రాష్ట్రంలో నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు గెలుపొందిన నేపథ్యంలో ఆ పార్టీ నేతల్లో ఈ నిర్ణయం మరింత జోరు పెంచింది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా తూర్పు తీర్పే కీలకం కావడం.. ఇక్కడి ఓటర్లు ఏ పార్టీని ఆదరిస్తారో ఆ పార్టీ అధికారం చేపడుతుందనే సెంటిమెంట్‌ ఆది నుంచీ ఉంది. ఈ క్రమంలో చారిత్రక రాజధానిగా కీర్తి పొందిన రాజమహేంద్రవరంలో మహానాడు నిర్వహించనున్న నేపథ్యంలో.. ఆ పార్టీ ముఖ్యనేతలు స్థలాలను పరిశీలించే పనులు ప్రారంభించారు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, రాజమహేంద్రవరం గ్రామీణ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి రాజమహేంద్రవరం సమీపంలోని జాతీయ రహదారి పక్కన, వేమగిరి సమీపంలో కొన్ని స్థలాలు చూసినట్లు తెలుస్తోంది. ఈ వివరాలను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లి.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తదితరుల బృందం ఓ దఫా పరిశీలించాక తుది నిర్ణయం తీసుకునే వీలుంది. ప్రధానంగా భారీ సభాస్థలితోపాటు, సమీపంలోనే వాహనాలు నిలుపుదలకు వీలుగా ఉన్న ప్రాంతాలను ఎంపిక చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే స్థానిక హోటళ్లలో ఆ తేదీల్లో గదులు బుక్‌ చేసుకునేందుకు ఇతర ప్రాంతాల నాయకులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి లక్షలాదిగా పార్టీ శ్రేణులు వచ్చే వీలుందని భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని