logo

నేర వార్తలు

దొంగలపై పోలీసులు నిత్యం నిఘా పెడుతున్నా చోరీలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో తాజాగా జరిగిన భారీ చోరీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Published : 01 Apr 2023 05:20 IST

ఆర్టీసీ బస్సులో భారీ చోరీ
850 గ్రాముల బంగారం, రూ.2 లక్షలు మాయం

పెనుగొండ: దొంగలపై పోలీసులు నిత్యం నిఘా పెడుతున్నా చోరీలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో తాజాగా జరిగిన భారీ చోరీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆర్టీసీ బస్సులో సుమారు రూ.40 లక్షలు విలువైన బంగారు ఆభరణాలతో కూడిన బ్యాగ్‌ను గుర్తుతెలియని దుండగులు ఎత్తుకుపోయారు. ఈ ఘటనపై వస్తువులు పోగొట్టుకున్న బంగారం వ్యాపారి ఫిర్యాదు మేరకు పెనుగొండ పోలీసులు ఈ నెల 28న కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే నెల్లూరుకు చెందిన ఒక బంగారు వ్యాపారి రాజమహేంద్రవరంలో ఉంటున్న తన గుమస్తాకు కొన్ని బంగారు ఆభరణాలతో కూడిన బ్యాగ్‌ను ఇచ్చి పాలకొల్లు పంపించారు. సదరు గుమస్తా పాలకొల్లు, నరసాపురంలో పని ముగించుకుని, 850 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.2 లక్షల నగదును బ్యాగ్‌లో పెట్టుకుని ఈ నెల 27 సాయంత్రం పాలకొల్లులో రాజమహేంద్రవరం వెళ్లే బస్సు ఎక్కాడు. పెనుగొండ గ్రామంలో సిద్ధాంతం రోడ్డుకు చేరుకున్న తర్వాత ఆభరణాల బ్యాగ్‌ మాయమైనట్లు గుర్తించాడు. దీంతో అదే రోజు అర్ధరాత్రి అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ భారీ చోరీని పోలీసులు గోప్యంగా ఉంచి విచారణ చేపట్టారు. జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో 8 బృందాలతో దొంగల కోసం వేట ప్రారంభించినట్లు సమాచారం. ఇప్పటికే కొంత వరకు ఆధారాలు లభించాయని, త్వరలోనే కేసును ఛేదిస్తామని ఒక పోలీస్‌ అధికారి వెల్లడించారు.


ఉద్యోగాల పేరుతో బురిడీ

మండపేట: ఉద్యోగాల పేరుతో ముగ్గురు వ్యక్తులు మోసానికి పాల్పడిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన వ్యక్తితో పాటు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన భార్యాభర్తలు రైల్వేలో ఉగ్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల నుంచి నగదు వసూలు చేసినట్లు తెలిసింది. డాక్టరు బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మండపేటకు చెందిన యువతి సుమారు రూ.7 లక్షలు చెల్లించారు. కొందరిని నకిలీ ఐడీ కార్డులతో దిల్లీకి తీసుకెళ్లడంతో మోసపోయినట్లు తెలిసి నగదు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి తేవడంతో కొంత మొత్తం బాధితులకు చెల్లించినట్లు తెలుస్తోంది. మండపేటకు చెందిన యువతి పట్టణ పోలీసులను ఆశ్రయించారు. దీనిపై ఎస్సై ఎం.అశోక్‌ను వివరణ కోరగా బాధిత యువతి నుంచి రెండు రోజుల క్రితం ఫిర్యాదు అందినట్లు తెలిపారు. ఆమె చెప్పిన వ్యక్తులకు ఫోను చేసి మాట్లాడేందుకు రావాలని సమాచారం ఇచ్చామన్నారు. మరిన్ని వివరాలు సేకరించి ఆధారాలు ధ్రువీకరించిన తరువాత కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు.


నకిలీ మందుల విక్రేతకు జైలు

రాజమహేంద్రవరం వైద్యం: ఓ సంస్థ పేరిట నకిలీ మందులు తయారు చేసి హోల్‌సేల్‌ దుకాణాల్లో విక్రయించిన వ్యక్తికి ఏడాది జైలు, రూ.20 వేల జరిమానా విధిస్తూ రాజమహేంద్రవరంలోని ఒకటో అదనపు అసిస్టెంట్‌ సెషన్సు కోర్టు జడ్జి ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ తీర్పునిచ్చారని ఔషధ తనిఖీ అధికారి ఎ.కృష్ణ శుక్రవారం తెలిపారు. విజయవాడకు చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి అక్కడ హానెస్ట్‌ ఫార్ములేషన్‌ సంస్థ పెట్టి నాసిరకం మందులు తయారు చేయడంతోపాటు శ్రీసత్యనారాయణ ఎంటర్‌ప్రైజస్‌ అనే హోల్‌సేల్‌ దుకాణం పేరుతో రాజమహేంద్రవరంలోని పలుచోట్ల విక్రయించేవారు. ఆ మందులపై 2016లో అప్పటి ఔషధ తనిఖీ అధికారి చంద్రరావు పరిశీలనలు చేయడంతోపాటు నమూనాలు పరీక్షించడంతో నకిలీవని తేలాయి. దాంతో కేసు నమోదు చేశారు. దీనిపై వాదనలు విన్న న్యాయమూర్తి పైవిధంగా తీర్పునిచ్చారన్నారు.


తల్లడిల్లిన ‘తల్లిగుండె’

తుని గ్రామీణం: తన బిడ్డ ఆరోగ్యం కుదుటపడటం లేదని మనస్తాపానికి గురైన ఓ తల్లి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన హృదయవిదారక ఘటన తుని మండలం రాజుపేటలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...గ్రామానికి చెందిన గింజాల లోవతల్లి (20)కి అదే ఊరికి చెందిన కామరాజుతో వివాహమైంది. వీరికి ఏడాది కిందట కుమారుడు జన్మించాడు. బిడ్డ గుండెకు రంధ్రాలు ఉండటంతో చికిత్స చేయించారు. అయినా ఆరోగ్యం కుదుట పడటం లేదని ఆ తల్లి తీవ్ర మనస్తాపానికి గురై ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై బాలాజీ తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. లోవతల్లి మృతితో భర్త, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. బిడ్డను ఎలా పెంచాలని రోదించిన తీరు స్థానికులను కలచివేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు