logo

పేపరు మిల్లు ఉద్యోగి అనుమానాస్పద మృతి

రాజమహేంద్రవరం పేపరు మిల్లులో పనిచేసే ఉద్యోగి విధి నిర్వహణ సమయంలో ఉరేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం సంస్థలో కలకలం రేపింది.

Published : 02 Apr 2023 04:41 IST

సత్యనారాయణ(పాత చిత్రం)

రాజమహేంద్రవరం నేరవార్తలు, రాజానగరం: రాజమహేంద్రవరం పేపరు మిల్లులో పనిచేసే ఉద్యోగి విధి నిర్వహణ సమయంలో ఉరేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం సంస్థలో కలకలం రేపింది. పోలీసులు, కుటుంబీకులు, సహ ఉద్యోగులు వివరాల మేరకు.. రాజానగరం మండలం శ్రీరామ్‌పురం గ్రామానికి చెందిన సంగిత సత్యనారాయణ(58) పేపరు మిల్లులోని స్టోర్‌ అటెండెంట్‌. ఈయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు. విధి నిర్వహణకు శనివారం ఉదయం వెళ్లిన సత్యనారాయణ సాయంత్రం 4.30 గంటల సమయంలో స్టోర్‌ వెనుక ఉన్న గోదాములో ఉరేసుకుని మృతిచెంది ఉండటాన్ని సహోద్యోగులు గుర్తించి యాజమాన్యం, పోలీసులుకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న మూడో పట్టణ స్టేషన్‌ సీఐ మధుబాబు మృతుడి వద్ద సూసైడ్‌ నోట్‌ స్వాధీనం చేసుకున్నారు. తనతో పాటు స్టోర్‌లో పనిచేసి చనిపోయిన రమణమ్మ అనే మహిళ ఉద్యోగాన్ని కొన్న వీరబాబు, రమణమ్మ చెల్లెలు భవానీ, ఆమె తమ్ముడు సత్యనారాయణ నా చావుకు కారణమని సత్యనారాయణ అందులో రాసినట్లు పోలీసులు గుర్తించారు. విషయం తెలుసుకున్న సత్యనారాయణ కుటుంబీకులు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, సీపీఎం, ఏఐటీయూసీ నాయకులు మిల్లు వద్దకు చేరుకున్నారు.

మిల్లు వద్ద ఉద్యోగులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాజా, సీపీఎం జిల్లా కార్యదర్శి అరుణ్‌ తదితరులు

మధ్యవర్తిత్వమే ప్రాణం తీసిందా?

మిల్లులో తాత్కాలికంగా పనిచేసే ఓ వ్యక్తికి పరంపర పథకం కింద శాశ్వత ఉద్యోగం ఇప్పించడానికి రూ.14 లక్షలు కొందరు వసూలు చేశారని, ఆ లావాదేవీలకు సత్యనారాయణ మధ్యవర్తిగా ఉన్నట్లు సహోద్యోగులు, బంధువులు చెబుతున్నారు. నగదు తిరిగి ఇవ్వాలని, లేదంటే చంపేస్తానని సంబంధిత వ్యక్తి బెదిరిస్తున్నట్లు రెండు రోజుల కిందట సత్యనారాయణ ఫోను చేసి ఆవేదన వ్యక్తం చేశారని ఆయన బావమరిది వెంకట్‌ ఆరోపిస్తున్నారు. మృతుడి వద్ద లభించిన నోటు ఆధారంగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

‘పరంపర వివాదంతోనే....

పేపరు మిల్లు కార్మికుడు ఎస్‌.సత్యనారాయణది ఆత్మహత్య కాదని ఇది మేనేజ్‌మెంట్‌ చేసిన హత్యని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు, సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు ఆరోపించారు. ఘటన విషయం తెలియగానే మిల్లు వద్దకు వెళ్లామని, మిల్లు యాజమాన్యం గేటు వద్ద ఆపేసిందన్నారు. చనిపోయిన వ్యక్తి కుటుంబానికి రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు ఎంఎస్‌.రాజు, పెరుమాళ్‌, జీఏ.రామారావు, బధ్రరావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

వారంతా బాధ్యత వహించాలి: ఎమ్మెల్యే రాజా

ఉద్యోగి సత్యనారాయణది ఆత్మహత్య కాదని... ఒకరకంగా హత్య అని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆరోపించారు. మిల్లులోని ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఎమ్మెల్యే ఓ ప్రకటన విడుదల చేశారు. మిల్లులో ఉద్యోగాలు అమ్ముకోవడం అనే వికృత పరంపరకు పరిశ్రమలో కొందరు ఉన్నతోద్యోగులు, కార్మిక సంఘ నేతలు, ప్రజాప్రతినిధులు తెరలేపిన కారణంతోనే ఈ దుర్ఘటన చోటుచేసుకుందన్నారు. వారంతా ఈ హత్యకు బాధ్యత వహించాలన్నారు. మృతుడి కుటుంబానికి ఫ్యాక్టరీ యాజమాన్యం రూ.కోటి పరిహారం చెల్లించాలని, సత్యనారాయణ కుమార్తెలకు వివాహాలు జరిగిన తరుణంలో అల్లుళ్లకు మిల్లులో ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మిల్లులో జరుగుతున్న పరంపర       వ్యవహారాలపె దర్యాప్తు జరిపించాలని రాజా డిమాండ్‌ చేశారు.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు