logo

రేషన్‌ పంపిణీపై ప్రతిష్టంభన..!

జిల్లా వ్యాప్తంగా రేషన్‌ సరకుల పంపిణీపై ప్రతిష్టంభన నెలకొంది. గడప గడపకు రేషన్‌ పంపిణీ చేస్తున్న ఎండీయూ వాహన ఆపరేటర్లు సమ్మెకు దిగడంతో తొలిరోజు శనివారం సరకుల పంపిణీ ఎక్కడికక్కడ నిలిచిపోయింది.

Published : 02 Apr 2023 05:02 IST

నిలిచిన ఎండీయూ వాహనం

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లా వ్యాప్తంగా రేషన్‌ సరకుల పంపిణీపై ప్రతిష్టంభన నెలకొంది. గడప గడపకు రేషన్‌ పంపిణీ చేస్తున్న ఎండీయూ వాహన ఆపరేటర్లు సమ్మెకు దిగడంతో తొలిరోజు శనివారం సరకుల పంపిణీ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ఎండీయూ వాహన బీమా సొమ్ములను ఆపరేటర్ల వేతనాల నుంచి కోత పెట్టడంతో వీరంతా సమ్మెబాట పట్టారు. జిల్లాలో 420 ఎండీయూ వాహనాలుండగా, అధికారుల ఒత్తిడితో 43 మంది ఆపరేటర్లు మాత్రమే తొలిరోజు రేషన్‌ పంపిణీ చేశారు. జిల్లాలో 6.45 లక్షల బియ్యంకార్డులు ఉండగా, ప్రతి నెలా మొదటి రోజూ 60 వేల కార్డులకు సరకులు అందజేసేవారు. శనివారం కేవలం 2,300 కార్డులకే సరకులందాయి. ఎండీయూ ఆపరేటర్లు వాహనాలు తిప్పకపోతే చౌక దుకాణాల ద్వారా సరకుల పంపిణీకి అధికార యంత్రాంగం ప్రయత్నిస్తోంది. తహసీల్దారు, పౌరసరఫరాల శాఖ ఉప తహసీల్దార్లు(ఎంఎస్‌వో) రేషన్‌ డీలర్లపై ఒత్తిడి తెస్తున్నారు. వీఆర్వో లాగిన్‌ ద్వారా చౌక దుకాణాల వద్ద కార్డుదారులకు సరకులు పంపిణీ చేయాలని డీలర్లను ఆదేశించారు. దీన్ని డీలర్లు తిరస్కరిస్తున్నారు. శనివారం కాకినాడ జిల్లా రేషన్‌ డీలర్ల సంఘ అధ్యక్షుడు నందిపాటి పల్లయ్య కలెక్టరేట్‌లో జిల్లా పౌరసరఫరాల అధికారిణి జి.చాముండేశ్వరికి వినతిపత్రం అందజేశారు. వీఆర్వో లాగిన్లతో సరకుల పంపిణీ చేయలేమని తేల్చిచెప్పారు. డీలర్ల లాగిన్‌లో సరకులు ఇవ్వమంటే పరిశీలిస్తామన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని