logo

నిమిషం ఆలస్యమైనా అనుమతించం

విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికీ గురికాకుండా పరీక్ష కేంద్రానికి గంట ముందుగా చేరుకోవాలని డీఈవో కేఎన్‌వీఎస్‌ అన్నపూర్ణ సూచించారు.

Published : 02 Apr 2023 05:02 IST

వివరాలు వెల్లడిస్తున్న డీఈవో, అధికారులు

వెంకట్‌నగర్‌(కాకినాడ), న్యూస్‌టుడే: విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికీ గురికాకుండా పరీక్ష కేంద్రానికి గంట ముందుగా చేరుకోవాలని డీఈవో కేఎన్‌వీఎస్‌ అన్నపూర్ణ సూచించారు. సోమవారం నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో శనివారం ఆమె విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో మొత్తం 29,988 మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తుండగా, 136 కేంద్రాలు కేటాయించామన్నారు. విద్యార్థులను పరీక్ష హాలులోకి ఉదయం 8.45 నుంచి 9.30 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారని, అత్యవసర పరిస్థితుల్లో తప్ప నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదన్నారు. విద్యార్థుల వివరాలతో ఓఎంఆర్‌ పత్రాన్ని అందజేస్తారని, వాటిని పరిశీలించుకుని ఏవైనా తప్పులుంటే వెంటనే ఇన్విజిలేటర్‌ దృష్టికి తేవాలన్నారు. చరవాణులు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలకు పరీక్ష కేంద్రంలోకి అనుమతి లేదని, విద్యార్థులతో పాటు విధుల్లో ఉన్న సిబ్బందికి ఈ నిబంధన వర్తిస్తుందన్నారు.  

పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌..

పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని, కేంద్రానికి దగ్గరగా ఎటువంటి జిరాక్స్‌ సెంటర్లు తెరిచి ఉండకూడదని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు. విద్యార్థులు హాల్‌టిక్కెట్లు చూపిస్తే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించామన్నారు. చూచి రాతలు, కాపీలతో ఎవరైనా విద్యార్థులు పట్టుబడితే మూడేళ్ల పాటు డిబార్‌ చేయనున్నామని, ఉపాధ్యాయులు ఎవరైనా సహకరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

సమస్యలుంటే కంట్రోల్‌రూమ్‌కు తెలపండి..

జిల్లాలో తొండంగి మండలం పెరుమాళ్లపురం, దానవాయిపేటలతోపాటు రౌతులపూడి, కోటనందూరుల్లోని నాలుగు సమస్యాత్మక కేంద్రాలను గుర్తించామని, వాటిలో సీసీ కెమెరాలతో పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశామన్నారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలిగినా డీఈవో కార్యాలయంలోని కంట్రోల్‌ రూమ్‌ ఫోన్‌నంబరు 90003 99069కు తెలియజేయాలన్నారు. పరీక్షలు ముగిసే వరకు ఇది 24 గంటలూ అందుబాటులో ఉంటుందన్నారు. సమావేశంలో జిల్లా పరీక్షల నిర్వహణాధికారి రాజశేఖర్‌, డీసీఈబీ కార్యదర్శి వెంకట్రావు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు