logo

భజగోవిందం.. జగమానందం

భక్తజన వరదా.. చందన స్వరూపా నమోస్తుతే.. స్మరణతో కోనసీమ తిరుమల పులకించింది. వాడపల్లి వేంకటేశ్వరుని రథోత్సవం శనివారం సాయంత్రం కమనీయంగా జరిగింది.

Updated : 02 Apr 2023 05:44 IST

మాంగల్యధారణ శుభముహూర్త వేళ..

ఆత్రేయపురం: భక్తజన వరదా.. చందన స్వరూపా నమోస్తుతే.. స్మరణతో కోనసీమ తిరుమల పులకించింది. వాడపల్లి వేంకటేశ్వరుని రథోత్సవం శనివారం సాయంత్రం కమనీయంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేతుడైన వేంకటేశ్వరుడిని ప్రత్యేకంగా అలంకరించిన రథంపైకి తీసుకొచ్చారు. రథం వద్ద కలశపూజ, పుణ్యాహవచనం, బలిహరణ తదితర పూజలను పండితులు ఖండవిల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు నేతృత్వంలో అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. విప్‌ జగ్గిరెడ్డి, దేవస్థాన ఛైర్మన్‌ రమేష్‌రాజు, ప్రముఖులు మోకు లాగి తేరును కదిలించారు. ఉత్సవాన్ని తిలకించేందుకు అశేష భక్తజనం వాడపల్లి తరలిరాగా.. తిరుమాడ వీధుల మీదుగా రథోత్సవం కనులపండువగా సాగింది. పరిసరాలన్నీ గోవింద నామస్మరణతో ప్రతిధ్వనించాయి. పోలీసుల పటిష్ఠ బందోబస్తు మధ్య మూడు గంటలపాటు రథోత్సవం ఉత్సాహంగా సాగింది.

మనోరథంపై విరి జల్లులు

కల్యాణం.. వైభోగం

వెంకన్న దివ్య కల్యాణ మహోత్సవం రాత్రి శోభాయమానంగా జరిగింది. స్వామి అమ్మవార్లను అలంకరించి ప్రధాన ఆలయం నుంచి మంగళ వాయిద్యాల నడుమ తిరుచ్చి వాహనంపై కల్యాణ వేదిక వద్దకు తెచ్చి సింహాసనంపై ఆశీనులను చేశారు. మిరుమిట్లు గొలిపే విద్యుద్దీపకాంతులు, అశేషంగా తరలివచ్చిన భక్తజనుల మధ్య క్షేత్రపాలకుడు అన్నపూర్ణాసమేత విశ్వేశ్వరస్వామి సాక్షిగా దేవదేవుని కల్యాణం ఆద్యంతం కమనీయమైంది. విష్వక్సేనపూజ, రక్షాబంధనం, మధుపర్కప్రాశన, కన్యాదానం, మహదాశీర్వచనం వైభవంగా సాగాయి. ఈ వేడుకను పండితులు ఖండవిల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు, వేదపండితుల నేతృత్వంలో జఠావల్లభుల వంశస్థుల చేతుల మీదుగా శాస్త్రోక్తంగా జరిపించారు. కల్యాణ వేదిక సమీపంలో వందల కిలోల కర్పూరం వెలిగించి భక్తులు మొక్కులు చెల్లించారు. కల్యాణ మూర్తులకు విప్‌ జగ్గిరెడ్డి, లావణ్య దంపతులు, ఆర్జేసీ సురేష్‌బాబు, పాలకమండలి ఛైర్మన్‌ రుద్రరాజు రమేష్‌రాజు, ఉమాదేవి దంపతులు, ఈవో ముదునూరి సత్యనారాయణరాజు, హైమాపార్వతి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. రావులపాలేనికి చెందిన మన్యం నాగ సూర్యకుమారి, మన్యం భాను దంపతులు మూడు కిలోల ముత్యాలు స్వామివారికి సమర్పించారు.

చిత్రాలు: ఈనాడు, కాకినాడ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు