logo

మహా శోభ

తెదేపా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోన్న మహానాడుకు రాజమహేంద్రవరం ముస్తాబయ్యింది. 26న (శుక్రవారం) పొలిట్‌బ్యూరో సమావేశం, 27న ప్రతినిధుల సభ, 28న బహిరంగ సభ ఉండటంతో అగ్రనేతలంతా చేరుకుంటున్నారు.

Updated : 26 May 2023 05:05 IST

పసుపు పండగకు సమాయత్తమైన నగరం

ఈనాడు, రాజమహేంద్రవరం: తెదేపా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోన్న మహానాడుకు రాజమహేంద్రవరం ముస్తాబయ్యింది. 26న (శుక్రవారం) పొలిట్‌బ్యూరో సమావేశం, 27న ప్రతినిధుల సభ, 28న బహిరంగ సభ ఉండటంతో అగ్రనేతలంతా చేరుకుంటున్నారు. మహానాడు జరిగే వేమగిరి వద్ద ఏర్పాట్లను తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, కీలక నాయకులంతా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ప్రాంగణాలన్నీ పసుపు తోరణాలు, అలంకరణలతో కళకళలాడుతున్నాయి. సభా వేదికల నిర్మాణం పూర్తవడంతో తిలకించేందుకు స్థానికులు తరలివస్తున్నారు. ప్లీనరీలో 15 వేల మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. అధిక ఉష్ణోగ్రతల రీత్యా అన్ని గ్యాలరీల్లోనూ కూలర్లు సమకూర్చారు. ప్రాంగణ వేదిక వద్దకు ఎన్టీఆర్‌ విగ్రహాన్ని తరలించారు. శనివారం ఉదయం నుంచే ప్రతినిధుల సభ్యత్వ నమోదు ఆరంభమవుతుంది. తొలుత ఎన్టీఆర్‌ విగ్రహానికి చంద్రబాబు, లోకేశ్‌ తదితరులు నివాళి అర్పించిన తరువాత ప్లీనరీ ప్రారంభమవుతుంది. అదే ప్రాంగణంలో డిజిటల్‌ ఫొటో ప్రదర్శన, రక్తదాన, వైద్య శిబిరాలు, భోజన ఏర్పాట్లు జరగనున్నాయి.


చంద్రబాబు రాక నేడు

తెదేపా అధినేత చంద్రబాబు శుక్రవారం సాయంత్రం 5 గంటలకు రాజమహేంద్రవరం చేరుకుంటారు. అనంతరం స్థానిక మంజీర సరోవర్‌ హోటల్‌లో పొలిట్‌బ్యూరో సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ కూడా శుక్రవారం చేరుకుంటారు. సమావేశం అనంతరం రాత్రి 8 గంటలకు వేమగిరి వద్ద  ప్లీనరీ ప్రాంగణంలోనే బస చేయనున్నారు.


నగరం.. శోభాయమానం

తంలో ఎన్నడూ లేనివిధంగా దాదాపు 200 ఎకరాల విస్తీర్ణంలో మహానాడు నిర్వహిస్తున్నారు. సభా వేదిక, వసతి, భోజనాలు, సుందరీకరణ తదితర ఏర్పాట్లను మాజీ మంత్రులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, జవహర్‌, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, నాయకులు గన్ని కృష్ణ, వాసు, వేణుగోపాలరాయుడు, నవీన్‌ పరిశీలిస్తున్నారు. పార్టీ ముఖ్యనాయకులు చిట్టిబాబు, పట్టాభి తదితరులు వివిధ విభాగాల సమన్వయ బాధ్యతలు చేపడుతున్నారు. వేమగిరి నుంచి లాలా చెరువు వరకు జాతీయ రహదారికి ఇరువైపులా భారీ కటౌట్లు, ప్లెక్సీలు, తోరణాలు ఏర్పాటుచేశారు. 28న జరిగే బహిరంగ సభ వేదిక పనులు శుక్రవారం సాయంత్రానికి పూర్తవుతాయని తెలిపారు.


బందోబస్తు కోసం ఎస్పీకి వినతి

కంబాలచెరువు(రాజమహేంద్రవరం): మహానాడు వేళ పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీని కోరినట్లు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తెలిపారు. ట్రాఫిక్‌, పార్కింగ్‌, పోలీసు బందోబస్తు అంశాలపై గురువారం తెదేపా నాయకులు జిల్లా ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డిని కలిసి విన్నవించారు. అనంతరం గోరంట్ల మాట్లాడుతూ ట్రాఫిక్‌ను ఏవిధంగా మళ్లిస్తే బాగుంటుందో వివరించామన్నారు. ప్రజాప్రతినిధులు ఎక్కడుంటారు... ఏయే ప్రాంతాల్లో భోజన సదుపాయం కల్పిస్తున్నదీ తెలిపామన్నారు. ఎన్టీ రామారావు శతజయంతి ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి రాజమహేంద్రవరానికి వచ్చే వారికి ఎక్కడికక్కడ భోజనాలు పెట్టి ఆతిథ్యం ఇవ్వడానికి ప్రజలు కూడా సిద్ధమవుతున్నారన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ మాట్లాడుతూ తెదేపా బ్యానర్లపై మరో పార్టీ బ్యానర్లు కట్టడం దారుణమన్నారు. ప్రజలు గో బ్యాక్‌ జగన్‌ అంటున్నారన్నారు. తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి యర్రా వేణుగోపాలరాయుడు, కార్యదర్శులు వాసిరెడ్డి రాంబాబు, కాశీ నవీన్‌కుమార్‌ పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని