అధికారిక ధ్వంస రచన
ఇది రైతు ప్రభుత్వం అంటారు.. సాక్షాత్తూ ఆ రైతులకే ఏళ్లుగా ఇబ్బందులు ఎదురవుతున్నా కనీసం స్పందించరు.. సాగునీటి జలాలు అందించడానికి ప్రభుత్వం ఏర్పాటుచేసిన కాలువనే మట్టి కోసం అక్రమంగా తవ్వేస్తే..
వైకాపా నేతల దన్నుతో నాడు చెలరేగిన మట్టి మాఫియా
ఫిర్యాదులు వెళ్లినా నేటికీ కానరాని చర్యలు
ఈనాడు, కాకినాడ
ఇష్టారీతిన మట్టి తవ్వకాలు
2021, నవంబరు.. జగ్గంపేట మండలం రామవరం సమీపాన సర్వే నంబరు 108లో కొంతభాగం కొండ.. సర్వే నం 108 నుంచి 124 వరకు పుష్కర మైనర్ పంట కాలువ లున్నాయి. భూగర్భ గనుల శాఖ అనుమతుల్లేకుండానే భారీ పొక్లెయిన్లు, టిప్పర్లతో ఇక్కడి ఎర్రమట్టిని తవ్వి తరలించారు. కొద్దిరోజుల్లోనే కొండను మాయం చేశారు.. 15 మీటర్ల ఎత్తులో ఉన్న పుష్కర కాలువనూ నేలమట్టం చేసేశారు. నాలుగు డ్రాప్‌లు, లైనింగ్ ధ్వంసం చేసి ఆ మట్టినీ తోలుకెళ్లారు.
కళ్లారా చూశారు.. ఫిర్యాదు చేశారు
2022 జనవరి.. తోట వెంకటాచలం పుష్కర ఎత్తిపోతల పథకం కాలువను తవ్వేసిన ప్రాంతాన్ని జలవనరుల శాఖ (పుష్కర) అధికారులు పరిశీలించారు. కుడి కాలువ డీవై-1లో (సర్వే నంబరు 108, 124) వరకు 350 మీటర్ల కాలువను, సిమెంటు నిర్మాణాలు ధ్వంసం చేసి మట్టి అక్రమంగా తరలించినట్లు తేల్చారు. దానిని సమీప ప్రైవేటు లేఅవుట్‌కు పంపిస్తున్నట్లు గుర్తించారు. అక్రమార్కులపై జీవో నం 188 ప్రకారం చర్యలు తీసుకుని కాలువను పూర్వస్థితికి తెస్తామన్నారు.. 2022 జనవరి 19న పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లిన అధికారులు మూడు గంటలకు పైగా నిరీక్షించారు.. అక్రమ తవ్వకాల వెనుక అధికార పక్ష నేతలు ఉండడంతో ఫిర్యాదు స్వీకరణకూ అప్పట్లో వెనుకాడారు. 17 నెలలైనా చర్యల ఊసేలేదు.
పునర్నిర్మాణం లేదు.. చర్యలూ లేవు
2023 మే.. రామవరం పరిధిలో 426 ఎకరాలకు సాగునీరిచ్చే పుష్కర మైనర్ కాలువ నామరూపాల్లేకుండా ధ్వంసమై ఏడాదిన్నరైంది. హడావుడి తప్ప చర్యలు తీసుకున్నది లేదు. ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసి.. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారితోనే కాలువ పునర్నిర్మిస్తామని అధికారులు చెప్పినా.. నేటికీ ఆ ఊసే లేదు. రాజకీయం బ్రేకులు వేస్తోంది. కాలువల్లో క్లోజర్ పనులు జరగాల్సిన సమయమిది. అసలు కాలువే లేకుండా చేసిన ఈ కేసులో కాలయాపనపై రైతులు గగ్గోలు పెడుతున్నారు.
ఇది రైతు ప్రభుత్వం అంటారు.. సాక్షాత్తూ ఆ రైతులకే ఏళ్లుగా ఇబ్బందులు ఎదురవుతున్నా కనీసం స్పందించరు.. సాగునీటి జలాలు అందించడానికి ప్రభుత్వం ఏర్పాటుచేసిన కాలువనే మట్టి కోసం అక్రమంగా తవ్వేస్తే.. నిర్మాణాలు ధ్వంసం చేసి ఆనవాళ్లే లేకుండా చేస్తే..ఉలుకూ పలుకూ లేదు. ఈ ధీమాతోనే కొండలు, పోలవరం గట్లపై మట్టికోసం ఇష్టారీతిన వాలిపోతున్నారు. దరఖాస్తు ఒకరితో చేయించి మట్టిని మాత్రం అక్రమార్కులు మింగేస్తున్నారు. ఈ తవ్వకాల వెనుక జగ్గంపేట, పెద్దాపురం నియోజకవర్గాల్లోని కీలక నాయకులతోపాటు.. అధికార పక్షానికి చెందిన కొందరి పాత్ర ఉండటంతో చర్యల జోలికి పోవడం లేదన్న విమర్శలున్నాయి.
రెవెన్యూశాఖ: మట్టి తవ్వకాలు జరుగుతున్నప్పుడు స్థానికులు అప్పటి జగ్గంపేట తహసీల్దారుకు ఫిర్యాదు చేసినా ప్రాథమిక స్థాయిలోనే చర్యలకు వెనుకాడారు. మట్టి తవ్వకాలకు భూపతిరాజు రాజ్యలక్ష్మి (సినీ నటుడు రవితేజ తల్లి) పేరుతో వచ్చిన దరఖాస్తును మైనింగ్ ఏడీ కార్యాలయానికి పంపామని.. ఎన్‌వోసీ ఇవ్వడం మా పరిధిలో లేదంటూ దాటేశారు.
భూగర్భ గనుల శాఖ: క్షేత్రస్థాయిలో తనిఖీలకు అప్పటి భూగర్భ గనుల శాఖ ఏడీ బృందం వచ్చింది. శాఖాపరమైన అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున మట్టి తవ్వకాలు జరిపి నిబంధనలు అతిక్రమించినట్లు తేల్చింది. 4.50 ఎకరాల్లో 42,493 క్యూబిక్ మీటర్ల గ్రావెల్ తవ్వేసినట్లు గుర్తించారు. నిబంధనలు అతిక్రమించిన రాజ్యలక్ష్మి పేరిట గతేడాది మేలో నోటీసులు జారీచేశారు. అపరాధ రుసుము రూ.2.35 కోట్లు కట్టాలని తేల్చారు. కానీ స్పందన లేదు.
శాఖలకు పట్టలేదు
జలవనరుల శాఖ: సీతానగరంలోని పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీరు తోడి రామవరం శివారు భూములను సస్యశ్యామలం చేయాలన్న లక్ష్యం కలగానే మిగిలింది. 14ఏళ్ల క్రితం కాలువలు తవ్వి.. ప్రాజెక్టు అందుబాటులోకి తెచ్చినా.. శివారు భూములకు నేటికీ నీరందలేదు. నిధులు మంజూరై పనులు ప్రారంభించేలోగా.. మట్టి మాఫియా ఇక్కడి గుట్టపై కన్నేసి కాలువనే మాయం చేసింది. కాలువను మళ్లీ 15 అడుగుల ఎత్తులో నిర్మించాలంటే వైబ్రోమేక్స్ రోలరు పెట్టి, అర అడుగు చొప్పున పొరలు వేస్తూ.. నీటి తడులు పెడుతూ.. కనీసం 30 లేయర్లయినా వేయాలి.అధికారిక అంచనాల ప్రకారం కాంక్రీటు నిర్మాణాలు, లైనింగ్‌తో కాలువ పునరుద్ధరించి రైతులకు నీరందించాలంటే రూ.2 కోట్ల వరకు అవసరం. రాజకీయ ఒత్తిళ్లకు బెదిరి శాఖాపరమైన చర్యలకు వెనకాడుతున్నారు.
పోలీసు శాఖ: పుష్కర కాలువ ధ్వంసం చేసిన వ్యవహారంలో భూపతిరాజు రాజ్యలక్ష్మి, కాపవరపు సంజయ్‌లపై చర్యలు తీసుకోవాలని ఆ శాఖ ఏఈ జగ్గంపేట పోలీసులకు ఫిర్యాదుచేశారు. 20 వేల క్యూబిక్ మీటర్ల కాలువ మట్టి తవ్వి.. హైవేకి సమీపంలో సర్వే నం.58, 81, 82లోకి తరలించినట్లు గుర్తించామన్నారు. జగ్గంపేట స్టేషన్‌లో 2022 జనవరి 19న ఎఫ్‌ఐఆర్ (35/2022) నమోదైంది. దర్యాప్తులో కదలిక లేదు.
ఫిర్యాదు చేసినా స్పందించలేదు..
-వై.జగదీష్, ఏఈ, పుష్కర ఎత్తిపోతల పథకం, జగ్గంపేట
రామవరం దగ్గర పుష్కర కాలువను మట్టి కోసం ధ్వంసం చేసిన ఘటనపై పేర్లతో సహా జగ్గంపేట పోలీసులకు ఫిర్యాదు చేశాం. సాక్ష్యం దొరకడంలేదని, నేరం రుజువు కావడంలేదని అంటున్నారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినా.. ఛార్జిషీటు వేయలేదు. కాలువను ధ్వంసం చేసిన వారే పునర్నిర్మాణ బాధ్యత భరించాలన్నది మా ప్రతిపాదన. కేసు నడుస్తోంది.. కాలువ పునర్నిర్మాణంపై స్పష్టత రావాల్సి ఉంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/06/2023)
-
Ap-top-news News
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం.. 18 దూరప్రాంత రైళ్ల రద్దు
-
Sports News
ఆ బౌలర్ అరంగేట్రం.. అతడికి జాక్‌పాట్
-
India News
Ashwini Vaishnaw: ఆ నంబర్ల నుంచి కాల్స్ వస్తే లిఫ్ట్ చేయొద్దు: టెలికాం మంత్రి
-
World News
Restaurant: ఎక్కువ ఆహారాన్ని ఆర్డర్ చేస్తే ఇలా అవమానిస్తారా..!
-
Sports News
CSK-Rayudu: మా ఇద్దర్నీ ముందే పిలిచాడు.. ధోనీ అలా భావించాడేమో: రాయుడు