logo

అవాంతరాలు సృష్టించినా.. ప్రభంజనాన్ని ఆపలేరు

అధికార పార్టీ ఎన్ని అవాంతరాలు సృష్టించినా రాజమహేంద్రవరంలో జరిగే తెదేపా మహానాడు ప్రభంజనాన్ని ఆపలేరని కాకినాడ జిల్లా తెదేపా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌కుమార్‌ అన్నారు.

Published : 26 May 2023 04:05 IST

కాకినాడ నగరం: అధికార పార్టీ ఎన్ని అవాంతరాలు సృష్టించినా రాజమహేంద్రవరంలో జరిగే తెదేపా మహానాడు ప్రభంజనాన్ని ఆపలేరని కాకినాడ జిల్లా తెదేపా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌కుమార్‌ అన్నారు. కాకినాడ జిల్లా నుంచి 70వేల మంది తక్కువ కాకుండా మహానాడుకు హాజరు కానున్నారని తెలిపారు. జన సమీకరణపై జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పార్టీ ఇన్‌ఛార్జులు, ముఖ్య నాయకులతో సంప్రదింపులు జరిపినట్లు తెలిపారు. జిల్లా తెదేపా కార్యాలయంలో గురువారం మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, జిల్లా తెదేపా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాసబాబా, మాజీ జడ్పీటీసీ సభ్యుడు పేరాబత్తుల రాజశేఖర్‌ తదితరులతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మహానాడుకు ఆర్టీసీ బస్సులు ఇవ్వకుండా వైకాపా ప్రభుత్వం అడ్డుకుంటోందన్నారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలను బెదిరించి బస్సులు ఇవ్వనీయడం లేదన్నారు. గతంలో ఒంగోలులో జరిగిన మహానాడుకు ఇదే రకమైన ఆటంకాలు సృష్టించినా అక్కడి  మహానాడు విజయవంతమైందన్నారు. రాజమహేంద్రవరం మహానాడును విజయవంతం చేయడం ద్వారా రానున్న ఎన్నికలకు విజయ శంఖారావాన్ని పూరిస్తామని నవీన్‌కుమార్‌ పేర్కొన్నారు. సమావేశంలో తెదేపా నాయకులు మట్టా ప్రకాష్‌గౌడ్‌, దేవు వెంకన్న, రామదేవు సీతయ్యదొర, వాసిరెడ్డి చిట్టిబాబు, తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని