logo

‘గాలికి పుట్టిన పార్టీ వైకాపా.. ప్రజల గుండెల్లో పుట్టింది తెదేపా’

తాను ముఖ్యమంత్రి అవడానికి అన్ని రకాల మోసాలు చేయడంతోపాటు కోడికత్తి డ్రామాలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నాలుగేళ్ల కాలంలో ప్రజలను నానా కష్టాలకు గురిచేస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు.

Published : 26 May 2023 04:05 IST

రావులపాలెం గ్రామీణం, న్యూస్‌టుడే: తాను ముఖ్యమంత్రి అవడానికి అన్ని రకాల మోసాలు చేయడంతోపాటు కోడికత్తి డ్రామాలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నాలుగేళ్ల కాలంలో ప్రజలను నానా కష్టాలకు గురిచేస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. కొత్తపేట మండలం వాడపాలెంలో తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్‌.టి.ఆర్‌ శతజయంతి వేడుకల్లో భాగంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు ముఖ్యఅతిథిగా అచ్చెన్నాయుడు హాజరయ్యాడు. అక్కడ ఏర్పాటుచేసిన ఎన్‌.టి.ఆర్‌ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. అధికారం కోసం సొంత బాబాయినే హత్యచేయించి దానిని తెదేపాపై నెట్టడంతోపాటు కోడికత్తి  డ్రామా ఆడారన్నారు. తన పార్టీయే రాష్ట్రంలో మరో 30 ఏళ్లు రాష్ట్రంలో అధికారంలో ఉండాలన్న స్వార్ధంతో నాలుగేళ్ల కాలంలో తెదేపా నాయకులు, కార్యకర్తలను నానాకష్టాలు పెట్టాడన్నారు. వైకాపా గాలికిపుట్టిన పార్టీ అని తెదేపా మాత్రం పేదల గుండెల్లో నుంచి పుట్టిన పార్టీ అన్నారు. ప్రజలపై మోయలేని పన్నులు, ఛార్జీలు వేసి వారిని ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడన్నారు. ఆనాడు తెదేపా పాలనతో అంతా అభివృద్ధి జరిగితే నేడు బటన్‌ నొక్కుడు పాలనతో అంతా అవినీతే జరుగుతోందన్నారు. ఇసుక, మట్టి మాఫియాలతో అక్రమ సంపాదనకు పాల్పడడంతోపాటు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారన్నారు. త్వరలోనే ఈ పార్టీని ఇంటికి సాగనంపేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు. 2024లో జరిగే ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అవడం ఖాయమన్నారు. కార్యక్రమంలో బండారు సత్యనారాయణమూర్తి, రెడ్డి అనంతకుమారి, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, గంటి హరీష్‌మాధుర్‌, రెడ్డి సుబ్రహ్మణ్యం, గొల్లపల్లి సూర్యారావు, అయితాబత్తుల ఆనందరావు, బుచ్చిమహేశ్వరరావు, ఆకుల రామకృష్ణ, చిల్లా జగదీశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని