logo

ఉపాధ్యాయ బదిలీలకు 8,025 దరఖాస్తులు

ఉపాధ్యాయ బదిలీల వ్యవహారం గందరగోళంగా మారుతోంది. ప్రక్రియ మొత్తం సజావుగా సాగుతుందా? అన్న అనుమానం ఉపాధ్యాయ వర్గాల్లో బలపడుతోంది. గత డిసెంబరులో బదిలీ దరఖాస్తులు ఆహ్వానించారు.

Published : 29 May 2023 05:00 IST

పామర్రు, న్యూస్‌టుడే: ఉపాధ్యాయ బదిలీల వ్యవహారం గందరగోళంగా మారుతోంది. ప్రక్రియ మొత్తం సజావుగా సాగుతుందా? అన్న అనుమానం ఉపాధ్యాయ వర్గాల్లో బలపడుతోంది. గత డిసెంబరులో బదిలీ దరఖాస్తులు ఆహ్వానించారు. నిబంధనలు లోపభూయిష్టంగా ఉన్నాయంటూ చాలామంది కోర్టును ఆశ్రయించడం, తీర్పులు రాకపోవడం, పరీక్షలు దగ్గర పడడంతో అప్పట్లో బదిలీలు నిలిచిపోయాయి. వేసవి సెలవుల్లో స్థానచలనం చేద్దామని ప్రభుత్వం దృఢంగా సంకల్పించుకుంది. కోర్టు వివాదాల్లో ఉన్న జీవోలను ఉపసంహరించుకుని కొత్తగా ప్రక్రియ ప్రారంభిస్తామని కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది. కొత్తగా ఈసారి జీవో 47 ఇచ్చి బదిలీల ప్రక్రియ ప్రారంభించింది. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే జూన్‌ 12 నాటికి ఉపాధ్యాయులందరూ కొత్త స్థానాల్లో చేరేలా షెడ్యూలు ఇచ్చింది. మొదటి ఘట్టంలో భాగంగా మూడు రోజులు దరఖాస్తులు తీసుకుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి బదిలీలు కోరుతూ 8,025 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకున్నారు.

గందరగోళం

* దరఖాస్తుల్లో వివిధ కేడర్లకు సంబంధించి పాయింట్లు నమోదు చేయడంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకసారి పాయింట్లు వర్తిస్తాయని, ఇంకోసారి వర్తించవని ఇలా.. వాట్సాప్‌ సందేశాలు రావడంతో ఉపాధ్యాయులు అయోమయానికి గురయ్యారు. ఎవరికి తోచిన పాయింట్లు వారు వేసుకోవడం, తరువాత ఆ దరఖాస్తులను ఎంఈవో లాగిన్‌లో తొలగించడం, మళ్లీ దరఖాస్తు చేయడం వంటివి   జరిగాయి.

* హేతుబద్ధీకరణ పాయింట్ల విషయంలో ప్రభుత్వం నుంచి పలుమార్లు వివరణలు రావడంతో దరఖాస్తుదారులు అసహనానికి గురయ్యారు. పాత, కొత్త స్టేషన్‌ పాయింట్ల నమోదులో కొందరు రెండు స్టేషన్‌ పాయింట్లు నమోదు చేశారు. కొందరు పాతవి, కొందరు కొత్తవి వేశారు. స్పౌస్‌కి సంబంధించి సందేహాల నడుమ పలుచోట్ల వివిధ రకాలుగా దరఖాస్తుల్లో నమోదులు జరిగాయి.

* 2013 నవంబరు 1న విధుల్లో చేరిన వారికి 8 సంవత్సరాలు పూర్తి కాకపోయినా నిర్బంధ బదిలీలు చేస్తున్నారు. 8 సంవత్సరాలు నిండిన వారికి వచ్చే పాయింట్లు వీరికి రావడం లేదని వాపోతున్నారు. దీన్ని సవరించాలని ఆదివారం జిల్లా విద్యాశాఖ కార్యాలయాల వద్ద ఫ్యాప్టో ఆధ్వర్యంలో ధర్నాలు కూడా చేశారు.

* బదిలీలు, పదోన్నతులు కూడా సమాంతరంగా నిర్వహిస్తుండడం గందరగోళంగా మారుతోంది. స్థానాలు తెలియకుండానే అంగీకారం, అంగీకారం తెలపకపోవడం అంటూ ఆదేశాలు రావడం హాస్యాస్పదంగా ఉందంటున్నారు. ఖాళీలను బట్టి పదోన్నతి తీసుకుంటాం కానీ ముందే ఎలా చెప్పగలుగుతామని ప్రశ్నిస్తున్నారు.

* తప్పుల తడకల నిర్ణయాలతో పలువురు కోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నారు. జూన్‌ 1న హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ సర్వీసు మేటర్లు స్వీకరిస్తుందని న్యాయమూర్తి స్పష్టం చేశారని, అప్పటి వరకూ ఉపాధ్యాయులు వేచి ఉంటే కోర్టులో పిటిషన్‌ వేద్దామని న్యాయవాదులు చెబుతున్నారు. దీనితో మళ్లీ ప్రక్రియ జరుగుతుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

వివరాలు ఇలా..

గ్రేడు.2 ప్రధానోపాధ్యాయులు 310, ఎస్‌.ఎ. లెక్కలు 688, ఎస్‌.ఎ. ఎన్‌.ఎస్‌. 362, ఎస్‌.ఎ. ఎస్‌.ఎస్‌. 493,
ఎస్‌.ఎ. పీఎస్‌ 450, ఎస్‌.ఎ. పీఈ 197, ఎస్‌.ఎ. ఆంగ్లం 527, ఎస్‌.ఎ. హిందీ 317, ఎస్‌.ఎ. సంస్కృతం 06, ఎస్‌.ఎ. తెలుగు 429,
ఎస్‌.ఎ. ఉర్దూ 02, పీఎస్‌ హెచ్‌ఎం 293, పీఈటీ 51, ఎస్జీటీ 3,784, ఎల్‌పీ (తెలుగు) 79, హిందీ 36, సంస్కృతం 1 కలిపి 8,025 దరఖాస్తులు అందాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని