6 మండలాలు... 412 ఎకరాల్లో నష్టం
ఈదురు గాలులు ఉద్యాన రైతులకు నష్టాన్ని మిగిల్చాయి. ఈ నెల 28, 29 తేదీల్లో బలంగా వీచిన గాలుల కారణంగా జిల్లాలోని ఆరు మండలాల పరిధిలో 412 ఎకరాల్లోని వివిధ ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి.
ఉద్యాన రైతుకు వేదన మిగిల్చిన ఈదురు గాలులు
సీతానగరం మండలంలో నేల వాలిన అరటి తోట
వి.ఎల్.పురం(రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: ఈదురు గాలులు ఉద్యాన రైతులకు నష్టాన్ని మిగిల్చాయి. ఈ నెల 28, 29 తేదీల్లో బలంగా వీచిన గాలుల కారణంగా జిల్లాలోని ఆరు మండలాల పరిధిలో 412 ఎకరాల్లోని వివిధ ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. 240 మంది రైతులకు సంబంధించి రూ.36.87 లక్షల మేర పంట నష్టం జరిగినట్లు జిల్లా ఉద్యానశాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు.
జిల్లాలో ఈ నెల 28న వీచిన గాలులకు మొత్తం 153 హెక్టార్లలో వివిధ ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు గుర్తించారు. సీతానగరం మండలంలో 16.6 హెక్టార్లలో అరటి, 19.7 హెక్టార్లలో బొప్పాయి, .0.4 హెక్టార్లలో కూరగాయ పంట దెబ్బతిన్నాయి. కడియం మండలంలో 13.2 హెక్టార్లలో కూరగాయల పంటలు దెబ్బతిని 27 మంది రైతులకు నష్టం వాటిల్లింది. చాగల్లు మండలంలో 17.8, నిడదవోలులో 61, దేవరపల్లిలో 8.2, గోపాలపురం మండలంలో 17 హెక్టార్లలో అరటి పంటకు నష్టం వాటిల్లినట్లు అధికారులు నిర్ధారించారు.
* 29న వీచిన గాలులకు మొత్తం 10.91 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు అంచనా వేశారు. సీతానగరం మండలంలో సింగవరంలో 10 హెక్టార్లలో కూరగాయల పంటలు, మిర్తిపాడులో 0.91 హెక్టార్లలోని అరటి తోట దెబ్బతింది. మొత్తం 9 మంది రైతులకు రూ.1,72,750 మేర పంట నష్టం జరిగినట్లు గుర్తించినట్లు జిల్లా ఉద్యానశాఖ అధికారి రాధాకృష్ణ చెబుతున్నారు.
పాత వాటికి పరిహారం ఇంకెప్పుడు?
ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌లో కురిసిన వర్షాలు, వీచిన ఈదురు గాలులకు వ్యవసాయ, ఉద్యాన పంటల రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆ పంట నష్టాలకు సంబంధించిన పరిహారం కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. అప్పటి వర్షాలకు జిల్లాలో 438.14 హెక్టార్లలో రబీ వరి పంటకు నష్టం జరిగినట్లు వ్యవసాయ అధికారులు తొలుత ప్రాథమిక అంచనా వేసినప్పటికీ తర్వాత 331.34 హెక్టార్లుగా నిర్ధరించారు. దీనికి సంబంధించి 577 మంది రైతులకు రూ.46.83 లక్షలు నష్టపరిహారం అందించాల్సి ఉంది. ఏప్రిల్, మే మొదటి వారంలో అరటి, నిమ్మ, బొప్పాయి, కూరగాయలు తదితర ఉద్యాన పంటలకు సంబంధించి 220.78 హెక్టార్లలో నష్టం జరిగినట్లు ఆ శాఖ అధికారులు ఇప్పటికే అంచనాలు వేసి ప్రభుత్వానికి పంపించారు. దీనికి సంబంధించి 472 మంది రైతులకు రూ.55.7 లక్షల మేర నష్టపరిహారం అందించాల్సి ఉంది. వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారుల వద్ద విషయాన్ని ప్రస్తావిస్తే.. వాటికి పంట నష్టపరిహారం మంజూరైందని జూన్ 1న రైతులకు ప్రభుత్వం అందించనుందని చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.