logo

చదువుల నిలయం.. స్నాతకోత్సవ సంరంభం

కాకినాడ జేఎన్‌టీయూకే  తొమ్మిదో స్నాతకోత్సవానికి సిద్ధమైంది. జేఎన్‌టీయూకే తరపున గౌరవ డాక్టరేట్‌ను అనిల్‌ చలమలశెట్టికి ప్రదానం చేస్తారు.

Updated : 31 May 2023 05:14 IST

జేఎన్‌టీయూకే తొమ్మిదో వేడుక నేడు
కులపతి హోదాలో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ హాజరు

ఈనాడు, కాకినాడ- న్యూస్‌టుడే, వెంకట్‌నగర్‌ : కాకినాడ జేఎన్‌టీయూకే  తొమ్మిదో స్నాతకోత్సవానికి సిద్ధమైంది. జేఎన్‌టీయూకే తరపున గౌరవ డాక్టరేట్‌ను అనిల్‌ చలమలశెట్టికి ప్రదానం చేస్తారు. పీహెచ్‌డీ..బీటెక్‌, బీ ఫార్మశీ, ఎంటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ, ఎం.ఫార్మశీ, బీబీఏ, ఎంఎస్‌ఐటీ, ఫార్మా-డి, బీఆర్క్‌ కోర్సుల విద్యార్థులకు ముఖ్యఅతిథి సమక్షంలో ఉప కులపతి ప్రసాదరాజు డిగ్రీలు ప్రదానం చేస్తారు. 2020- 21, 2021- 22 విద్యా సంవత్సరాల్లో చదువుకున్న విద్యార్థులు డిగ్రీలు, అవార్డులు అందుకోనున్నారు.

ఓనమాలు ఇక్కడే..

దిల్లీ మెట్రో ఛైర్మన్‌ ఇ.శ్రీధరన్‌, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ మాజీ సీఎండీ శాస్త్రి, మారుతి ఉద్యోగ్‌ ఛైర్మన్‌ భాస్కరుడు, సైయంట్‌ సంస్థ వ్యవస్థాపకులు మోహన్‌రెడ్డి, శాంతా బయోటెక్‌ పూర్వ ఛైర్మన్‌ వరప్రసాద్‌రెడ్డి, ఆరుగురు సీఎంల వద్ద ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన ఎస్వీ ప్రసాద్‌, ఐఏఎస్‌లు శ్యామలరావు, రవిచంద్ర జేఎన్‌టీయూ విద్యార్థులే.. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు ఈ వర్సిటీ పరిధిలోకి వస్తాయి.

నేటి కార్యక్రమం ఇలా..

* వేదిక: జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం కాకినాడ (జేఎన్‌టీయూకే)

* కార్యక్రమం: తొమ్మిదో స్నాతకోత్సవం

* అతిథి: అబ్దుల్‌ నజీర్‌, రాష్ట్ర గవర్నర్‌, విశ్వవిద్యాలయ కులపతి. ప్రత్యేక అతిథిగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ముఖ్య అతిథిగా శాంతా బయోటెక్‌ పూర్వ ఎండీ డాక్టర్‌ కె.ఐ.వరప్రసాద్‌ హాజరవుతారు.

* గౌరవ డాక్టరేట్‌ అందజేత: అనిల్‌ చలమలశెట్టి, వ్యవస్థాపకులు, సీఈవో- ఎండీ, గ్రీన్‌కో గ్రూప్‌  

* వేదికపై డిగ్రీలు/పతకాల ప్రదానం: పీహెచ్‌డీలు-144, పసిడి పతకాలు: 66

* కార్యక్రమం సాగుతుందిలా: జేఎన్‌టీయూకే పాలన భవనం ఎదురుగా స్నాతకోత్సవ వేదిక ఏర్పాటుచేశారు. ఈనెల 31న (బుధవారం) ఉదయం 10.30 గంటలకు వేడుక ప్రారంభిస్తారు. 11 గంటలకు గవర్నర్‌ చేరుకుని మధ్యాహ్నం 12.55 వరకు స్నాతకోత్సవంలో పాల్గొంటారు. పట్టాలు, అవార్డుల పంపిణీ అనంతరం.. 2.35 గంటలకు తిరుగు ప్రయాణమవుతారు. బృంద చిత్రాలు..సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, విందుతో వేడుక అట్టహాసంగా సాగనుంది.

ఇదీ ప్రస్థానం

దేశం గర్వించదగ్గ గొప్ప ఇంజినీర్లను తయారుచేసి.. నూతన ఆవిష్కరణలకు వేదికగా నిలిచింది ఈ విద్యాలయం. తొలుత జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక కళాశాల పేరిట 1946 లో ఏర్పాటైంది.. విశాఖలో ఏర్పాటు కావాల్సి ఉన్నప్పటికీ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ సైన్యం వదిలేసిన కొట్టాము భవనంలో నెలకొల్పారు. సివిల్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ శాఖలతో 105 మంది విద్యార్థులు.. ముగ్గురు అధ్యాపకులతో ప్రారంభమైన కళాశాల.. 1972 నుంచి జేఎన్‌టీయూ హైదరాబాద్‌ అనుబంధ కళాశాలగా.. అనంతరం స్వయం ప్రతిప్రత్తిగా మారింది. 2008లో ఎనిమిది జిల్లాల్లోని ఇంజినీరింగ్‌ కళాశాలల సమాహారంతో జేఎన్‌టీయూకే విశ్వవిద్యాలయంగా ఆవిర్భవించింది. తొలి వీసీగా అల్లం అప్పారావు వ్యవహరిస్తే.. ప్రస్తుత వీసీగా జి.వి.ఆర్‌ ప్రసాదరాజు ఉన్నారు. అనుబంధంగా 240 కళాశాలలు ఉన్నాయి. ప్రతి విద్యార్థికీ ఉపాధి దొరికే సామర్థ్యాన్ని అందించడంతోపాటు.. ఎంసెట్‌ సమర్థంగా నిర్వహించిన ఘనతా జేఎన్‌టీయూకేకు దక్కింది.

చెరిగిపోని గురుతులివి..

అవిభక్త మద్రాసు రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ కళాశాల వైజాగపటం పేరుతో కోకనాడ (కాకినాడ)లో 1946 జులై 16న ప్రారంభించిన నాటి శిలాఫలకమిది.. అప్పటి విద్యాశాఖ మంత్రి టి.ఎస్‌.అవినాష్‌ లింగం దీనిని ప్రారంభించారు. ప్రస్తుతం జేఎన్‌టీయూకే పరిపాలన భవనం వద్ద ఇప్పటికీ ఈ శిలాఫలకం ఉంది. ఆ పక్కనే గత చరిత్ర తెలిపేలా మరొకటి ఏర్పాటుచేశారు.

భారత్‌- చైనా యుద్ధం జరుగుతున్న సమయంలో వైమానిక దళంలో ఉంది ఈ మిగ్‌ ఫైటర్‌ విమానం.. 1960లో విశేష సేవలందించిన ఈ యుద్ధ విమానం ప్రస్తుతం జేఎన్‌టీయూ ప్రధాన ముఖ ద్వారం పక్కన దర్శనమిస్తోంది. ఇక్కడ ఇంజినీరింగ్‌ చదివిన ఎయిర్‌ మార్షల్‌ ఐ.జి.కృష్ణ చొరవతో భారత వైమానిక దళం దీనిని జేఎన్‌టీయూకేకు కేటాయించింది.

రానున్న కాలంలో మరింత అభివృద్ధి

వీసీగా బాధ్యతలు స్వీకరించి ఏడాదిన్నరైంది. విశ్వవిద్యాలయం బీ ప్లస్‌ నుంచి న్యాక్‌ ఏ ప్లస్‌ గుర్తింపు పొందింది. బీ ప్లస్‌ కేటగిరీలో ఉన్నప్పుడు రూసా నిధులు రూ.20 కోట్లు వస్తే.. ఇప్పుడు రూ.100 కోట్లు వస్తాయి. రానున్న కాలంలో మరింత అభివృద్ధితో అనువైన ప్రాంగణాలు ఏర్పాటుకానున్నాయి. రహదారులు, డ్రైనేజీ నిర్మాణంతోపాటు.. స్నాతకోత్సవ హాలు, జీ ప్లస్‌ 5తో భారీ వసతిగృహం అందుబాటులోకి వస్తాయి. అందరి సహకారంతో అభివృద్ధి సాధ్యమైంది. మెరుగైన సాంకేతిక విద్య అందించేందుకు శ్రమిస్తున్నాం. స్నాతకోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేశాం.

ఆచార్య జి.వి.ఆర్‌.ప్రసాదరాజు, ఉప కులపతి, జేఎన్‌టీయూకే

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని