logo

పాకిస్థాన్‌ జైలు నుంచి బయటపడ్డ మత్స్యకారులు

పాకిస్థాన్‌లోని కరాచీ జైలు నుంచి బయట పడతామనుకోలేదు. నాలుగున్నరేళ్లు చీకటిలో మగ్గాం. అక్కడి భాష రాదు. జైలు అధికారులు ఏం చెబుతున్నారో అర్థమయ్యేది కాదు.

Published : 31 May 2023 04:57 IST

మాట్లాడుతున్న జానకీరామ్‌, చిత్రంలో మత్స్యకారులు

విశాఖపట్నం(వన్‌టౌన్‌), న్యూస్‌టుడే: ‘పాకిస్థాన్‌లోని కరాచీ జైలు నుంచి బయట పడతామనుకోలేదు. నాలుగున్నరేళ్లు చీకటిలో మగ్గాం. అక్కడి భాష రాదు. జైలు అధికారులు ఏం చెబుతున్నారో అర్థమయ్యేది కాదు. దేవుడి దయతో విముక్తి కలిగింది. తొలుత గుజరాత్‌, అక్కడి నుంచి విశాఖ చేరుకున్నామ’ని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కొయ్యం గ్రామానికి చెందిన మత్స్యకారుడు మైలపల్లి భాస్కర్‌రావు, తూర్పుగోదావరి జిల్లా గజ్జికాయలపురం గ్రామానికి చెందిన మాదే అన్నవరం, బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఐ.పోలవరం దరి పసుపులంక గ్రామానికి చెందిన పేమ్మిడి నారాయణరావు పేర్కొన్నారు. వీరిని మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ మర పడవల ఆపరేటర్ల సంఘం అధ్యక్షులు వాసుపల్లి జానకీరామ్‌ విశాఖ తీసుకొచ్చారు. అనంతరం చేపలరేవులోని సంఘం కార్యాలయంలో భాస్కర్‌రావు మాట్లాడుతూ ‘2018 నవంబరు 18న మేము గుజరాత్‌ రాష్ట్రంలోని వీవవలి తీరంలో వేట సాగిస్తున్నాం. మా బోటు పాకిస్థాన్‌ జలాల్లోకి వెళ్లిందని పాక్‌ కోస్టుగార్డు పోలీసులు అరెస్టు చేశారు. అప్పట్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన 23 మందిని పట్టుకున్నారు. వీరిలో 22 మంది నాలుగేళ్ల క్రితమే విడుదలయ్యారు. నేను ఒక్కడిని ఉండిపోయాను. దౌత్య సంప్రదింపుల తర్వాత ఇటీవల నాతో పాటు పొరుగు జిల్లాలకు చెందిన ఇద్దరు మత్స్యకారులను విడుదల చేశార’ని చెప్పారు. తండ్రి రెండేళ్ల కిత్రం చనిపోయిన విషయం కూడా తనకు తెలియదని వాపోయారు. సరైన భోజనం పెట్టలేదని, అక్కడి జైళ్లు నరకానికి ఆనవాళ్లుగా ఉన్నాయన్నారు. మరికొందరు భారతీయ మత్స్యకారులు అక్కడి జైళ్లలో మగ్గుతున్నారని తెలిపారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని