నిర్వహణ గాలికి.. వెతలు పట్టేదెవరికి!
ప్రభుత్వం ఖరీఫ్ కోసం గోదావరి డెల్టాకు సాగునీరు విడుదల చేసేందుకు సిద్ధమైంది. గురువారం దీనికి ముహూర్తం సిద్ధంచేసింది.
అధ్వానంగా పంట కాలువలు, షట్టర్లు
నేడు ఖరీఫ్ సాగుకు నీటి విడుదల
ఈనాడు, రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే, పి.గన్నవరం, ముమ్మిడివరం: ప్రభుత్వం ఖరీఫ్ కోసం గోదావరి డెల్టాకు సాగునీరు విడుదల చేసేందుకు సిద్ధమైంది. గురువారం దీనికి ముహూర్తం సిద్ధంచేసింది. అందుకు తగ్గట్టుగా కాలువలు, షట్టర్లు, స్లూయిజ్‌లు, లాకుల నిర్వహణ సరిగా ఉందా? అనే ప్రశ్న వేసుకుంటే లేదనే చెప్పాలి. జలవనరుల శాఖలో ఇవి అత్యవసర పనుల కింద లెక్క. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వహణ గాలికొదిలేసింది. దీంతో గతేడాది మాదిరిగానే ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
రబీ సీజన్ పూర్తయిన తరువాత ఏప్రిల్ 20న కాలువలు మూసేశారు. దాదాపు 50 రోజుల క్లోజర్ (విరామం) తరువాత ఖరీఫ్ సాగుకు నీటిని నేడు విడుదల చేస్తున్నారు. గోదావరి డెల్టాలో ఉమ్మడి జిల్లాలో ఖరీఫ్‌లో 5 లక్షలు, రబీలో 4.60 లక్షలు, ఏలేరు ప్రాజెక్టు కింద సుమారు 55 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంటుంది. పంట కాలువల్లో పూడికతీత మొదలుకుని లాకులు, స్లూయిస్‌లను శుభ్రం చేసి రంగులు వేసి గ్రీజు రాయాలి. షట్టర్లకు మరమ్మతులు చేపట్టాలి. సకాలంలో చేయక శివారు ఆయకట్టుకు నీరందని దుస్థితి. షట్టర్లకు మరమ్మతులు లేక, గట్లను పటిష్టం చేయక సమస్య లొస్తున్నాయి. అలానే ఏలేరు ఇరిగేషన్ ప్రాజెక్టు పరిధిలో కాలువలు, ఇతర నిర్మాణాల నిర్వహణ కానరావడంలేదు. కేవలం ఓఅండ్‌ఎం (ఆపరేషన్ అండ్ మెయింటెనన్స్) కింద కాలువల్లో తూడు తొలగింపు పనులు మొక్కుబడిగా నిర్వహిస్తున్నారు.
ఇవీ సమస్యలు
* ఆత్రేయపురం మండలంలో ముక్తేశ్వరం కాలువ ద్వారా 68 వేల ఎకరాలకు నీరందించే లొల్ల లాకుల వద్ద నిర్మాణం దెబ్బతిని కూలేందుకు సిద్ధంగా ఉంది. షట్టర్లు తుప్పు పట్టి అధ్వానంగా ఉన్నా నిర్వహణ లేదు.
* మధ్య డెల్టా పరిధిలోని పి.గన్నవరం కాలువకు నీరు విడిచిపెట్టే లొల్లలాకుల వద్ద గేట్లన్నీ తుప్పుతో ఉండి నిర్మాణం శిథిలమైంది. గట్టుకు రక్షణగా ఉన్న రివెట్‌మెంట్ ధ్వంసమైంది.
* లొల్ల హెడ్ లాకుల నుంచి ప్రారంభమైన గన్నవరం ప్రధాన పంటకాలువ 59.10 కిమీ ప్రవహించి సఖినేటిపల్లి శివారు లాకుల వరకు విస్తరించి ఉంది. దీని పరిధిలో 55,451 ఎకరాల ఆయకట్టు ఉంది. కాలువలో పలుచోట్ల చెట్లు పడిపోయినా తొలగించలేదు. లొల్ల హెడ్ లాకులతోపాటు గోపాలపురం, మొండెపులంక, పొదలాడ, శివకోడు, సఖినేటిపల్లి శివారు లాకులు తలుపులు నిర్వహణ లేక దెబ్బతింటున్నాయి.
* పి.గన్నవరం మండలం కె.ఏనుగుపల్లి ఆఫ్‌టెక్ స్లూయిస్ నుంచి ఏనుగుపల్లి, ముంగండపాలెం, గాజులగుంట, పి.గన్నవరం పిల్ల కాలువలు ఆధారపడి ఉన్నాయి. 800 ఎకరాల ఆయకట్టు ఉంది. స్లూయిస్ షట్టర్ మట్టిలో కూరుకుపోయి కనిపిస్తుంది. తలుపు కిందికి, పైకి లేవాలంటే స్క్రూగేరింగ్ రాడ్డుకు గ్రీజు పూసి ఆయిల్ రాయాలి. షట్టరు కింద ఉన్న మట్టి తీసి ఓ దఫా అపరేట్ చేయాలి. ఇవి లేవు.
* ఐ.పోలవరం మండలం పెరుమాళ్లరాజుపోడు కాలువ పరిధిలో 800 ఎకరాలు ఉంది. ఐ.పోలవరం, కేసనకుర్రు, టి.కొత్తపల్లి గ్రామాల్లోని ముంపు కాలువలు దీని ద్వారా గోదావరిలో కలుస్తాయి. కాలువ పూడిపోవడంతో పాటు ఆక్రమణకు గురైంది. ఆక్వా వ్యర్థాలు కలుస్తున్నాయి. ముంపు సమయంలో 400 ఎకరాల్లో సాగుకు అవకాశం ఉండడం లేదు.
సాగునీటి సంఘాలను నిర్వీర్యం చేశారు..
గత ప్రభుత్వంలో అవసరమైన పనులు చేసేవారం. రైతులకు జవాబుదారీగా పనిచేశాం. వైకాపా ప్రభుత్వంలో సాగునీటి సంఘాలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. వేసవి విరామ సమయంలో కనీసం తట్టడు మట్టి తీయని దుస్థితి. ఏ పనులూ చేయకుండా సాగునీరు విడుదల చేస్తున్నారు. షట్టర్లు తుప్పు పట్టి దారుణంగా ఉన్నాయి. మరీ ఇంత నిర్లక్ష్యం తగదు.
ఆరుమిల్లి సాయిబాబు, మాజీ అధ్యక్షుడు, మానేపల్లి సాగునీటి వినియోగదారుల సంఘం
అధ్వానంగా ఉన్నా.. పనుల్లేవు
నాలుగేళ్లలో పంట కాలువల్లో పూడికతీతకు సంబంధించి గుప్పెడు మట్టి పని కూడా చేయలేదు. లాకులు, ఇతర కట్టడాలకు చెందిన తలుపులు మట్టికొట్టుకుపోయి అధ్వానంగా ఉన్నాయి. వేసవి క్లోజర్‌లో పనులు చేయకపోతే ఎలా...? ఇలాంటి పరిస్థితులు రైతులకు నష్టమే. రెండో పంటైన రబీలో శివారు ఆయకట్టుకు నీరందక ఇబ్బంది పడుతున్నాం.
మానేపల్లి వీరాస్వామినాయుడు, రైతు, బోడపాటివారిపాలెం
రూ.7 కోట్ల నిధులు మంజూరు..
వేసవి విరామ పనులకు ప్రత్యేకించి నిధులు మంజూరుకాలేదు. ఖరీఫ్ నుంచి రబీ వరకు గోదావరి డెల్టా, ఏలేరు ప్రాజెక్టు పరిధి కాలువల్లోని తూడు, గుర్రపుడెక్క తొలగించేందుకు రూ.7 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో ఓఅండ్‌ఎం పనులు చేస్తాం.
జి.శ్రీనివాసరావు, ఎస్‌ఈ, జలవనరుల శాఖ, ధవళేశ్వరం సర్కిల్
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/09/23)
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Damini bhatla: ఊహించని ట్విస్ట్.. బిగ్‌బాస్ నుంచి సింగర్ దామిని ఎలిమినేట్
-
Sudhamurthy: నా పేరును దుర్వినియోగం చేస్తున్నారు.. పోలీసులకు సుధామూర్తి ఫిర్యాదు
-
Raghava Lawrence: ఆయన లేకపోతే ఈ వేదికపై ఉండేవాణ్ని కాదు: లారెన్స్
-
Mla Rajaiah: కాలం నిర్ణయిస్తే బరిలో ఉంటా: ఎమ్మెల్యే రాజయ్య