logo

అనిశాకు చిక్కిన మున్సిపల్‌ ఏఈ

గుత్తేదారుడి నుంచి లంచం తీసుకుంటుండగా పిఠాపురం పురపాలక సంఘ ఏఈ వంశీ అభిషేక్‌ను బుధవారం అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారులు వలపన్ని పట్టుకున్నారు

Published : 01 Jun 2023 05:33 IST

ఏఈ వంశీ అభిషేక్‌

పిఠాపురం: గుత్తేదారుడి నుంచి లంచం తీసుకుంటుండగా పిఠాపురం పురపాలక సంఘ ఏఈ వంశీ అభిషేక్‌ను బుధవారం అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారులు వలపన్ని పట్టుకున్నారు. అనిశా అడిషనల్‌ ఎస్పీ సౌజన్య తెలిపిన వివరాలివీ.. పట్టణానికి చెందిన సూరవరపు సత్తిరాజు (దివాణం) గుత్తేదారుగా పురపాలక సంఘ పరిధిలోని పార్కులో టైల్స్‌, సీసీ రోడ్డు పనులు రూ.6.61లక్షలు విలువైనవి పూర్తి చేశారు. ఈ పనులకు సంబంధించిన ఎంబుక్స్‌, ఆన్‌లైన్‌లో ఎంటర్‌ చేసేందుకు ‘పుర’ ఏఈ వంశీ అభిషేక్‌ రూ.40వేలు డిమాండ్‌ చేశారు. గుత్తేదారుడు సత్తిరాజు రాజమహేంద్రవరం అనిశా అధికారులను సంప్రదించారు. దాంతో బుధవారం సత్తిరాజు ఏఈకి రూ.40వేలు ఇస్తుండగా అనిశా అధికారులు పట్టుకుని సాయంత్రం వరకూ విచారణ చేపట్టారు. అనంతరం కార్యాలయం సమీపంలోనే నివాసముంటున్న ఏఈ ఇంటిలో తనిఖీలు చేపట్టేందుకు అనిశా అధికారులు వెళ్లారు. ఇంజినీరింగ్‌ విభాగంలో జరిగిన పనులన్నింటిపైనా లోతుగా విచారిస్తున్నట్లు అడిషనల్‌ ఎస్పీ సౌజన్య వివరించారు.ఈ దాడుల్లో సీఐలు పుల్లారావు, వై.సతీష్‌, డి.వాసు కృష్ణ, బి.శ్రీనివాసు, ఎస్సై విల్సన్‌ పాల్గొన్నారు.

పదేళ్లుగా ఇక్కడే..

పిఠాపురం పురపాలక సంఘంలో 2013లో ఏఈగా వంశీ అభిషేక్‌ బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ఇక్కడే ఏఈగా విధులు నిర్వహిస్తున్నారు. వంశీ అభిషేక్‌పై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. నిత్యం గుత్తేదారులు, కౌన్సిలర్లు కార్యాలయంలో జరిగే సమావేశాల్లో ఏఈ తీరును తప్పుబడుతూనే ఉన్నారు. అయినా ఇక్కడ నుంచి ఏఈని బదిలీ చేయించేందుకు తెదేపా, వైకాపా నాయకుల ప్రయత్నాలు ఫలించలేదు. ఈసారి బదిలీల్లో కూడా ఇక్కడ నుంచి వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టి మంగళవారం రోజున విజయవాడ కౌన్సెలింగ్‌కు వెళ్లి వచ్చారు. మరో రెండు, మూడు రోజుల్లో బదిలీ ఉత్తర్వులు అందుతాయని అనుకుంటున్న తరుణంలో బుధవారం అనిశాకు చిక్కడం చర్చనీయాంశంగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని