logo

అగ్గి రేగితే ఆందోళనే

ఎండలు మండుతున్నాయి. ఉష్ణోగ్రతలతో పాటు ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ నేపథ్యంలో వైరింగ్‌ సరిగాలేనిచోట్ల, పరిమితికి మించి విద్యుత్తు వినియోగం సమయంలో అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి.

Published : 02 Jun 2023 04:54 IST

ప్రమాదకరంగా విద్యుత్తు బాక్సులు

మసీదుసెంటర్‌(కాకినాడ), న్యూస్‌టుడే: ఎండలు మండుతున్నాయి. ఉష్ణోగ్రతలతో పాటు ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ నేపథ్యంలో వైరింగ్‌ సరిగాలేనిచోట్ల, పరిమితికి మించి విద్యుత్తు వినియోగం సమయంలో అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. విద్యుత్తు షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా మంటలు వ్యాపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిని ముందే ఊహించి విద్యుత్తు సరఫరా వ్యవస్థను మెరుగుపర్చాలి ఉండగా.. కొన్ని విభాగాల్లో అలాంటి ప్రయత్నాలు చేయలేదు. కాకినాడ జీజీహెచ్‌లో ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఆసుపత్రిలోని పలు వార్డుల్లో వైరింగ్‌ సరిగా లేదు. అరకొర అగ్నిమాపక పరికరాలతో ప్రమాదం సమయంలో భద్రత ప్రశ్నార్థకమే. గురువారం జరిగిన ప్రమాదంలో రోగులు, వారి సహాయకులు భయాందోళనకు గురయ్యారు. మెడికల్‌వార్డు ఏఎంసీ-1 ఐసీయూలో ఏసీకి విద్యుత్తు సరఫరా చేసే డీసీ బాక్సులో షార్ట్‌సర్క్యూట్‌ జరగడంతో పొగలు వ్యాపించడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో అక్కడ 11 మంది రోగులు ఉండగా సిబ్బంది, రోగుల సహాయకులు సకాలంలో స్పందించి వారిని బయటకు తీసుకువెళ్లడంతో పెనుప్రమాదం తప్పింది.

ఆసుపత్రిలో లోపాలు ఇలా...

ఆసుపత్రిలో ఎక్కువ భవనాలు పాతవే. వార్డుల్లో వైరింగ్‌ సైతం అస్తవ్యస్తంగా ఉండటం, విద్యుత్తు తీగలు కిందకు వేలాడటం, బోర్డులు సరిగా లేకపోవడం, స్విచ్‌బోర్డులు తలుపులు లేకుండా ఉండటంతో ప్రమాదం పొంచి ఉంది. ప్రమాదాలు జరిగినప్పుడు బయటపడేందుకు పలువార్డుల్లో ఎలాంటి మార్గాలు లేవు. ఆసుపత్రిలో నీటి నిల్వకోసం సంపును ఏర్పాటు చేసుకోవాలి. అక్కడి నుంచి అన్ని గదులకు పైపులైన్లు  ఏర్పాటు చేయాలి. అగ్నిప్రమాదం జరగగానే సైరన్‌ మోగేలా ఏర్పాట్లు ఉండాలి. పై అంతస్తులో ప్రమాదాలు జరిగినపుడు రోగులు, సిబ్బందిని కిందకు దింపేలా భవనానికి రెండు వైపులా ప్రవేశ మార్గాలు ఉండాలి. భవనం చుట్టూ అగ్నిమాపక వాహనం తిరిగేలా ఖాళీ స్థలం ఉండాలి. ఆసుపత్రిలోని పలు వార్డులకు రూ.లక్షలు ఖర్చుచేసి నీటి సరఫరాకు సంబంధించిన పైపులు ఏర్పాటు చేశారు. వాటిని  పూర్తిస్థాయిలో అమర్చకుండా వదిలేశారు. దీంతో ఆ వ్యవస్థ పనిచేయడం లేదు.

ఓపీ భవనంలో అసంపూర్తిగా పైపులైను

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని