logo

గుంతలను తప్పించబోయి రెండు బస్సుల ఢీ

 రెండు పెద్ద గుంతలను తప్పించే క్రమంలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొని ఇద్దరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

Published : 02 Jun 2023 04:54 IST

తీవ్రంగా గాయపడిన ఇద్దరు ప్రయాణికులు
ఇరవై మందికి పైగా స్వల్ప గాయాలు

సంఘటనా స్థలంలో  ఢీకొన్న బస్సులు

ద్వారపూడి, అనపర్తి గ్రామీణం, మండపేట గ్రామీణం, న్యూస్‌టుడే:  రెండు పెద్ద గుంతలను తప్పించే క్రమంలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొని ఇద్దరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని తప్పించే క్రమంలో డ్రైవర్లు సడన్‌ బ్రేక్‌ వేయడంతో ఒక బస్సులో కండక్టర్‌ మహేశ్వరి తను సీటులోంచి తూలి ద్వారం నుంచి కొంతదూరంలో కిందపడ్డారు. మరో బస్సులో  ఓ  బస్సు అద్దం పగిలి అందులోంచి పాణింగిపల్లి భీమిరాజు అనే ప్రయాణికుడు బయటకు పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. మండపేట మండలం జడ్‌.మేడపాడు పెట్రోలు బంకు వద్ద గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.

తీవ్రంగా గాయపడిన భీమరాజు, సన్యాసమ్మ

రాజమహేంద్రవరం నుంచి కాకినాడ వెళుతున్న, కాకినాడ నుంచి రాజమహేంద్రవరం వస్తున్న రెండు బస్సులు జడ్‌.మేడపాడులో ఢీకొన్నాయి. ఆ సమయంలో రెండు బస్సుల్లో కలిపి 110 ప్రయాణికులున్నారు. ప్రమాదంలో కండక్టర్‌ మహేశ్వరి తలకు బలైమైన గాయాలై అధిక రక్తస్రావం జరిగింది.  అనపర్తి సావరానికి చెందిన పాణింగిపల్లి భీమరాజు పక్కటెముకులు, తలకు తీవ్రగాయాలై రక్తస్రావం కావడంతో చికిత్స నిమిత్తం 108 వాహనంలో అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాకినాడ నుంచి ధవళేశ్వరం వెళ్తున్న సన్యాసమ్మ అనే మరో ప్రయాణికురాలికి సీటు రాడ్డు ముఖానికి తగిలి గాయమైంది. ఆమెకు అనపర్తిలో వైద్యులు ప్రథమ చికిత్స చేశారు. గాయపడిన మరో ప్రయాణికురాలికి ప్రథమ చికిత్స అనంతరం అనపర్తిలోని ప్రవేటు ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. రెండు బస్సుల్లో సుమారు 20 మందికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. రాజమహేంద్రవరం డిపో మేనేజరు షేక్‌ షబ్నం, అసిస్టెంట్‌ డిపో మేనేజరు అజయ్‌బాబు, సిబ్బంది అనపర్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు పరామర్శించి, వైద్యులతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. ప్రమాద ఘటనతో అనపర్తి, కడియం, మండపేట వైపు భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఘటనపై కేసులు నమోదు చేస్తామని మండపేట రూరల్‌ ఎస్సై శివకృష్ణ తెలిపారు.

క్షతగాత్రులను పరామర్శిస్తున్న డిపో మేనేజరు షబ్నం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని