logo

ఇసుక.. మస్కా!

కె.గంగవరం మండలం కోటిపల్లి సమీప కోట గ్రామం గోదావరి తీరంలో అయిదు హెక్టార్లలో 17 వేల క్యూబిక్‌ మీటర్ల బొండు ఇసుక తవ్వకాలకు ఓ ప్రైవేటు సంస్థ దరఖాస్తు చేసుకుంది.

Published : 03 Jun 2023 04:23 IST

బొండు మట్టి పేరుతో సొమ్ముచేసుకునే వ్యూహం
ఈనాడు, కాకినాడ

సుక కాసులు రాలుస్తోంది. సర్కారుకే కాదు.. అక్రమార్కులకు సైతం రూ.కోట్లు కురిపిస్తోంది. అనుమతులతో నిబంధనలకు లోబడి కొంత.. అనుమతులకు మించి అక్రమాల లోతులతో కొండంత కరిగిపోతోంది. తవ్వకాలపై స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్నా రాజకీయ ఒత్తిళ్లతో అనుమతులు వాటికవే వచ్చేస్తున్నాయి. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కె.గంగవరం మండల తీరం ఇసుక తవ్వకాల అనుమతుల వ్యవహారంలో రాజకీయ ఒత్తిళ్లు వివాదాస్పదమవుతున్నాయి.

కె.గంగవరం మండలం కోటిపల్లి సమీప కోట గ్రామం గోదావరి తీరంలో అయిదు హెక్టార్లలో 17 వేల క్యూబిక్‌ మీటర్ల బొండు ఇసుక తవ్వకాలకు ఓ ప్రైవేటు సంస్థ దరఖాస్తు చేసుకుంది. జగనన్న కాలనీల అవసరాల కోసం ఈ నిల్వలు కావాలని పేర్కొంది. ఇక్కడ తవ్వకాలపై స్థానికుల నుంచి అభ్యంతరం తెరమీదకొచ్చింది. నిర్దేశిత మైనింగ్‌ ప్రాంతం గోదావరి గట్టుకు ఆనుకుని ఉంది. ఇక్కడ నాణ్యమైన ఇసుక నిల్వలు ఉంటే.. బొండు పేరుతో తరలించే ప్రయత్నాలు సాగినట్లు తెలుస్తోంది.

అమాత్యుని స్థాయిలో ఒత్తిళ్లు

ఈ లీజు ఖరారు చేయాలని ఓ మంత్రి, మరో నాయకుడి నుంచి కీలక శాఖలపై ఒత్తిడి పెరిగింది. దీంతో క్షేత్రస్థాయి పరిస్థితిని భూగర్భ గనుల శాఖ బృందం పరిశీలించింది. పొక్లెయిన్‌తో గోతులు తీస్తే నాణ్యమైన నిర్మాణ రంగానికి అవసరమైన ఇసుక నిల్వలు ఉన్నట్లు తేలింది. దీంతో ఆ శాఖలో తర్జనభర్జన నడుస్తోంది. ఇక్కడ అనుమతులు ఇస్తే చుట్టుపక్కల ఇసుక నిల్వలూ మాయమయ్యే ప్రమాదం ఉందనే వాదన స్థానికుల నుంచి వినిపిస్తోంది.

దోపిడీకి అడ్డాగా  గౌతమీ ఎడమ గట్టు

అఖండ గౌతమి గోదావరి ఎడమ గట్టు ఆలమూరు నుంచి యానాం దగ్గరలోని పిల్లంక వరకు ఉంది. ఈ ప్రాంతం అంతా ఇసుక దోపిడీకి అడ్డాగా మారింది. రాజకీయ అండతో వ్యవహారం దర్జాగా సాగిపోతోంది. కీలక శాఖలు సైతం చేతులెత్తేసే పరిస్థితి ఇక్కడుంది. ఇసుక తవ్వుకోవడానికి జేపీ వెంచర్స్‌ లిమిటెడ్‌కు శాండ్‌ పాలసీ, 2021 ప్రకారం ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. దీంతో ఎక్కడ తవ్వకాలు జరిగినా అనుమతులతోనే అనే కొత్త పల్లవి స్థానిక యంత్రాంగం నుంచి వినిపిస్తోంది. పర్యావరణ అనుమతులు, పరిమితుల ఊసే లేదు. ఇసుక ఉందంటే ఎంత లోతుకైనా వెళ్లే పరిస్థితి చాలాచోట్ల కనిపిస్తోంది.

నాడు మత్స్యకారుల ఆందోళన

కపిలేశ్వరపురం మండలం తాతపూడి వద్ద ఇప్పటికే ఇసుక గుట్టలు పెద్ద ఎత్తున తరలించేస్తున్నారు. యానాం దగ్గరలోని పిల్లంక వద్ద కూడా రోజూ ట్రాక్టర్లతో అనుమతుల్లేకుండానే ఇసుక భారీగా తరలిపోతోంది. తాజాగా కె.గంగవరం మండలం కోట వద్ద కూడా కొత్తగా రీచ్‌ వేసి ఇసుక నిల్వల తరలింపునకు ప్రణాళికలు సిద్ధం చేశారు. గతేడాది డిసెంబరులో గోదావరి నదికి 1.5 కిలోమీటర్ల మేర పెద్ద పెద్ద పైపులతో నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేసి ఇసుక ర్యాంపు వేయడం వివాదానికి దారితీసింది. ఈ చర్యలతో ఎగువ, దిగువ ప్రాంతాల నుంచి చేపల రాకపోకలు తగ్గిపోతాయని, తామంతా జీవనోపాధి కోల్పోతామని కోట, కోటిపల్లి, కూళ్ల, తమ్మయపాలెం తదితర గ్రామాల ప్రజలు జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో స్పందించిన అధికారులు తాత్కాలికంగా ఈ రీచ్‌ నుంచి ఇసుక రవాణా చేయకుండా కట్టడి చేశారు. ఇపుడు అదే పరిస్థితి పునరావృతం అయ్యేలా అనుమతుల కోసం రాజకీయ ఒత్తిళ్లు తెరమీదకు వచ్చాయి. కోట ప్రాంతంలో ఎవరికీ ఇసుక తవ్వకాలకు అనుమతి ఇవ్వలేదని.. ఇక్కడ కొంతమేర నాణ్యమైన ఇసుక ఉన్న మాట వాస్తవమేనని ఓ అధికారి వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు