logo

సత్యదేవుని ఆశీస్సులతో వారాహి యాత్ర

కొండగట్టు అంజన్న ఆలయంలో.. విజయవాడ కనక దుర్గమ్మ సన్నిధిలో పూజలతో సిద్ధమైన వారాహి వాహనం.. అన్నవరం సత్యదేవునికి పూజలు చేసిన అనంతరం ఉమ్మడి జిల్లాలో యాత్రకు బయలుదేరనుంది.

Published : 03 Jun 2023 04:23 IST

పది రోజులు 8 నియోజకవర్గాల్లో జనసేనాని పర్యటన

ఈనాడు, కాకినాడ- న్యూస్‌టుడే, కడియం: కొండగట్టు అంజన్న ఆలయంలో.. విజయవాడ కనక దుర్గమ్మ సన్నిధిలో పూజలతో సిద్ధమైన వారాహి వాహనం.. అన్నవరం సత్యదేవునికి పూజలు చేసిన అనంతరం ఉమ్మడి జిల్లాలో యాత్రకు బయలుదేరనుంది. వారాహి యాత్రపై జనసేనాని పవన్‌ కల్యాణ్‌ స్పష్టత ఇచ్చారు. తూర్పు నుంచే సమర శంఖం పూరిస్తారనే సంకేతాలిచ్చారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఎనిమిది నియోజకవర్గాల్లో ఈనెల 14 నుంచి 23 వరకు తొలిదశ యాత్ర సాగుతుందని జనసేన జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్‌ తెలిపారు.  

ఈనెల 13న రాత్రికి వారాహి వాహనం అన్నవరం చేరుకుంటుంది. 14న ఉదయం కొండపై సత్యదేవుని సన్నిధిలో ప్రత్యేక పూజల అనంతరం అధినేత పవన్‌ కల్యాణ్‌ యాత్రకు శ్రీకారం చుడతారు. ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ గ్రామీణం, కాకినాడ నగరం, ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు నియోజక వర్గాల మీదుగా యాత్ర సాగుతుంది. అనంతరం గోదావరి వంతెన మీదుగా ఉమ్మడి ప.గో.జిల్లాలోకి ప్రవేశిస్తుంది.

బహిరంగ సభలకు సన్నాహాలు

ఈ పర్యటనలో కత్తిపూడి, పిఠాపురం, కాకినాడ గ్రామీణం, నగరం, ముమ్మిడివరం, పి.గన్నవరం, రాజోలులో బహిరంగ సభలకు పార్టీ వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి. రోజు విడిచి రోజు సభ ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. పర్యటన క్రమంలో బస, సభలు, భద్రతకు సంబంధించి అనుమతులపై నాయకులు దృష్టిసారించారు.

సమస్యలే శస్త్రాలుగా..

రాష్ట్ర రాజకీయాల్లో తూర్పు సెంటిమెంట్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక్కడి ప్రజలు ఏ పార్టీని ఆదరిస్తే ఆ పార్టీ అధికారం చేజిక్కించుకోవడం ఖాయమనే వాదన ఉంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలూ ఈ జిల్లాలపై దృష్టిసారించాయి. నియోజకవర్గాల వారీగా ఇప్పటికే కీలక సమస్యలు, ప్రజల ఇబ్బందులను గుర్తించిన జనసేన.. వారితో ప్రత్యేకంగా మాట్లాడి భరోసా నింపాలనే నిర్ణయానికి వచ్చింది. ఆయా వర్గాలకు బహిరంగ సభల వేదికపై పవన్‌ భరోసా ఇస్తూనే.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టనున్నట్లు సమాచారం.


నిత్యం గంట సమావేశం

ప్రతిరోజూ ఉదయం మహిళలు, వీర మహిళలతో గంటపాటు సమావేశమై వారు ఎదుర్కొంటున్న సమస్యలు గుర్తిస్తారు. రైతులు, కౌలు రైతుల ఆత్మహత్యలతోపాటు పీడిత ప్రజల సమస్యలు వింటూ వారి నుంచి వినతులు స్వీకరణకు కొంత సమయం కేటాయించనున్నట్లు తెలుస్తోంది.  కేడర్‌తో పవన్‌ చర్చిస్తారని, పార్టీని విజయపథంలో నడిపించే వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తారని జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్‌ తెలిపారు. యాత్ర పొడవునా స్థానిక సమస్యలపై అధ్యయనం చేసి ఎన్నికల అనంతరం వాటి పరిష్కారం చూపే దిశగా అడుగులు వేస్తారని వివరించారు. పోలీసులకు సహకరిస్తూనే యాత్రను స్వచ్ఛందంగా వచ్చిన వాలంటీర్లుతో విజయవంతంగా ముందుకు తీసుకెళ్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని