logo

గ్యాస్‌ సిలిండరుతో అల్లుడి దాడి

సొసైటీ నుంచి తాను తీసుకున్న పంట రుణం తీర్చేందుకు సొమ్ములు ఇవ్వలేదన్న ఆగ్రహంతో ఐదు కిలోల గ్యాస్‌ సిలిండరుతో అత్తమామలపై అల్లుడు దాడి చేసిన సంఘటన తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం పశివేదల గ్రామంలో శుక్రవారం ఉదయం జరిగింది.

Published : 03 Jun 2023 04:23 IST

మామ మృతి.. అత్తకు తీవ్ర గాయాలు

కొవ్వూరు పట్టణం, న్యూస్‌టుడే : సొసైటీ నుంచి తాను తీసుకున్న పంట రుణం తీర్చేందుకు సొమ్ములు ఇవ్వలేదన్న ఆగ్రహంతో ఐదు కిలోల గ్యాస్‌ సిలిండరుతో అత్తమామలపై అల్లుడు దాడి చేసిన సంఘటన తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం పశివేదల గ్రామంలో శుక్రవారం ఉదయం జరిగింది. ఈ దాడిలో మామ రాయంకుల శ్రీరామకృష్ణ (62) అక్కడికక్కడే మృతి చెందగా, అత్త బేబీ తీవ్రంగా గాయపడటంతో పరిస్థితి విషమంగా ఉంది. అల్లుడు నందిగం గోపాలకృష్ణ (గోపి) పరారీలో ఉన్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పశివేదలకు చెందిన రాయంకుల శ్రీరామకృష్ణ, బేబి దంపతులకు కుమారుడు బ్రహ్మేంద్ర, కుమార్తె లక్ష్మిశ్రీ సంతానం. కుమార్తెను అదే ఊరికి చెందిన మేనమామ కొడవలి రత్నాజీతో వివాహం చేయగా ఒక కుమారుడు సాయిమౌళి ఉన్నాడు. కొన్నాళ్లకు రత్నాజీ చనిపోవడంతో దొమ్మేరుకు చెందిన గోపాలకృష్ణ (గోపి)తో లక్ష్మిశ్రీకి రెండో పెళ్లి చేసి ఇల్లరికంగా పెట్టుకున్నారు. గోపి దంపతులు పదేళ్లుగా శ్రీరామకృష్ణ ఇంట్లోనే ఉంటున్నారు. లక్ష్మీశ్రీ ముందు భర్తకు చెందిన ఎకరంన్నర పొలాన్ని ఈ మధ్య అమ్మగా కొంత సొమ్ము వచ్చింది. ఇందులో రూ. 4.80 లక్షలు చెల్లించి గోపి తాకట్టు పెట్టిన లక్ష్మిశ్రీకి చెందిన బంగారు ఆభరణాలు తీసుకురావాలని శుక్రవారం ఉదయం అత్తమామలు చెప్పారు. ముందుగా తాను తీసుకున్న పంట రుణానికి రూ.2.20 లక్షలు చెల్లిస్తానని గోపి బదులిచ్చాడు. దీనికి అత్త, మామ, భార్య ఒప్పుకోలేదు. బంగారం విడిపించాలని కరాఖండిగా చెప్పారు. దీంతో వారి మధ్య వాగ్వాదం పెరిగింది. అక్కడున్న 5 కిలోల గ్యాస్‌ సిలిండరుతో అత్త బేబిపై అల్లుడు దాడి చేయగా బలమైన దెబ్బ తగిలి కింద పడిపోయారు. అడ్డు వచ్చిన మామ శ్రీరామకృష్ణను తలపై బండతో కొట్టడంతో రక్తస్రావమై అక్కడికక్కడే చనిపోయారు. తీవ్రంగా గాయపడిన బేబిని కొవ్వూరు ఆసుపత్రికి, అనంతరం మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషమ పరిస్థితిలో ఆమె చికిత్స పొందుతున్నారు. లక్ష్మిశ్రీతోపాటు సోదరుడు బ్రహ్మేంద్ర, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మామ చనిపోవడంతో అల్లుడు గోపి సిలిండరును గోడ పక్క స్థలంలో విసిరేసి ద్విచక్ర వాహనంపై పరారయ్యాడు. ఇంట్లో ఉంచిన రూ.4.80 లక్షల నగదు కనిపించకపోవడంతో అతడు ఆ సొమ్ము తీసుకెళ్లిపోయాడని అనుమానిస్తున్నారు. హత్య జరిగిందన్న సమాచారంతో గ్రామీణ ఎస్‌ఐ జి.సతీష్‌, సీఐ వైవీ రమణ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. డీఎస్పీ వీఎస్‌ఎన్‌ వర్మ సంఘటన స్థలాన్ని సందర్శించి హత్య జరిగిన తీరు తెలుసుకుని అధికారులకు సూచనలిచ్చారు. వేలిముద్ర నిపుణులను రప్పించారు. లక్ష్మిశ్రీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్య, హత్యాయత్నం కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారైన గోపీ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని