logo

ముగ్గురు యువకుల మృతితో వెల్లలో విషాదం

పొట్టకూటి కోసం పక్క రాష్ట్రానికి వెళ్లి ఉపాధి పొందుతున్న యువకులను విధి వంచించింది. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు రోడ్డు ప్రమాదంలో అసువులు బాశారు.

Published : 04 Jun 2023 05:27 IST

మర్రెడ్డి రాజేష్‌, గానుగుల సాయిరాం, ఈతా వరప్రసాద్‌

నార్కట్‌పల్లి గ్రామీణం, ద్రాక్షారామ, న్యూస్‌టుడే : పొట్టకూటి కోసం పక్క రాష్ట్రానికి వెళ్లి ఉపాధి పొందుతున్న యువకులను విధి వంచించింది. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు రోడ్డు ప్రమాదంలో అసువులు బాశారు. డాక్టరు బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెల్ల గ్రామానికి చెందిన గానుగుల సాయిరామ్‌ (21), మర్రెడ్డి రాజేష్‌ (22), ఈతా వరప్రసాద్‌ (22) శనివారం తెల్లవారుజామున తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి శివారు విజయవాడ-హైదరాబాద్‌ రహదారిపై వైవంతెనపై జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. సెంట్రింగ్‌కు వాడే రేకులు వ్యానులో వేసుకుని స్వగ్రామం వెల్ల వస్తుండగా టైరు పేలిపోవడంతో వ్యాను బోల్తా పడింది. రేకులపై కూర్చొన్న ముగ్గురు యువకులూ కింద పడ్డారు. వీరిపై రేకులు పడి సాయిరామ్‌, రాజేష్‌ అక్కడిక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన వరప్రసాద్‌ను హైదరాబాద్‌ తరలించగా చికిత్సపొందుతూ శనివారం సాయంత్రం మరణించారు. యువకులు ముగ్గురూ నిరుపేద కుటుంబాలకు చెందిన వారే. ఇంకా వివాహాలు కాలేదు. కుటుంబాలకు వీరే పెద్ద దిక్కు. గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు మృతి చెందడంతో వెల్లలో విషాదఛాయలు అలముకున్నాయి.

కుటుంబాలకు వీరే ఆధారం..

రాజేష్‌ హైదరాబాద్‌లో తండ్రి పట్టాభిరామయ్యతో కలిసి నర్సరీలో పనిచేస్తున్నారు. తల్లి లక్ష్మి స్వగ్రామంలోనే ఉంటున్నారు. వీరి కుటుంబానికి అతడే ఆధారం. ఒక్కగానొక్క బిడ్డ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లి బోరున విలపిస్తున్నారు. ఈతా వరప్రసాద్‌ తాపీ, సెంట్రింగ్‌ పనులు చేస్తుంటారు. తండ్రి లేడు. తల్లి రమణ ఊళ్లోనే ఇడ్లీ అమ్ముకొంటూ జీవనోపాధి పొందుతున్నారు. ఒక్కగానొక్క కుమారుడు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లి విలపిస్తున్న తీరు చూపరులను కలచివేసింది. గానుగుల సాయిరామ్‌ మినీ వ్యాను కొనుక్కొని జీవనోపాధి పొందుతున్నారు. తండ్రి నాగబాబు, తల్లి వీరవేణి. ఎదిగొచ్చిన కొడుకుకు పెళ్లి చేయాలని నిశ్చయించుకొనే లోపే విధి తమకు దూరం చేసిందని వారు రోదిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని