logo

శానిటేషన్‌ కార్యదర్శులకు షాక్‌..!

కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణపై ప్రతిష్టంభన నెలకొంది. మూడు రోజులుగా శానిటేషన్‌ కార్యదర్శులు వార్డు సచివాలయ సమయపాలనలోనే విధులకు హాజరవుతున్నారు.

Updated : 04 Jun 2023 06:12 IST

షోకాజ్‌ నోటీసులు జారీ
పనుల నిర్వహణపై ప్రతిష్టంభన

కమిషనర్‌కు వినతి పత్రం ఇచ్చేందుకు నగరపాలక సంస్థ కార్యాలయానికి వచ్చిన కార్యదర్శులు (పాత చిత్రం)

బాలాజీచెరువు(కాకినాడ), న్యూస్‌టుడే: కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణపై ప్రతిష్టంభన నెలకొంది. మూడు రోజులుగా శానిటేషన్‌ కార్యదర్శులు వార్డు సచివాలయ సమయపాలనలోనే విధులకు హాజరవుతున్నారు. ఉదయం 5.30 గంటల నుంచే విధులకు హాజరుకాలేమని, యూజర్‌ ఛార్జీలు వసూలు చేయలేమని,  గతనెల 30న  నగరపాలక సంస్థ కమిషనర్‌  మహేశ్‌కుమార్‌కు లేఖ అందజేశారు. ఈ నెల 1 నుంచి మిగతా సచివాలయ ఉద్యోగులు వెళ్లే సమయానికి విధులకు హాజరవుతున్నారు. దీంతో 80 మందికి శనివారం షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

జీవో 650లో ఏముంది..?

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో శానిటేషన్‌ కార్యదర్శులు ఈ నిర్ణయం తీసుకున్నారని, దానినే  కాకినాడలో పాటిస్తున్నామని, మాకు షోకాజ్‌ నోటీసులు ఇవ్వడం ఏంటని వాపోతున్నారు. దీనికి అధికారుల వాదన మరోలా ఉంది. 2019, అక్టోబరు 3న విడుదల చేసిన 650 జీవో ప్రకారం.. ఇంటింటా చెత్త సేకరణ, తడి, పొడి చెత్త విభజన, మూడు గంటలకు తక్కువ కాకుండా ఫీల్డ్‌ విజిట్‌, నూరు శాతం పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణ చేయాలని, ఘన వ్యర్థాల నిర్వహణ బాధ్యత శానిటేషన్‌ సెక్రటరీలపై ఉందని చెబుతున్నారు. ఈ ఏడాది జనవరి 13న ఇచ్చిన సవరించిన జీవో 25 ప్రకారం యూజర్‌ ఛార్జీలు వసూలు చేయాల్సి ఉందని చెబుతున్నారు. శానిటేషన్‌ కార్యదర్శులు ఉదయాన్నే పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించాల్సి ఉందని పేర్కొంటున్నారు.


క్రమశిక్షణ చర్యలు తప్పవు
-సీహెచ్‌.నాగనరసింహారావు, అదనపు కమిషనర్‌, నగరపాలక సంస్థ

అన్నిచోట్లా ఇదే సమయ పాలన విధానం అమలు చేస్తున్నారు. దీనిని కాదంటే  క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. పారిశుద్ధ్య పర్యవేక్షణ బాధ్యత వీరిపై ఉంది.  ఇప్పుడు సచివాలయ వేళల్లో పనిచేస్తామని చెప్పడం దీనికి విరుద్ధం. షోకాజ్‌ నోటీసులు జారీ చేశాం. ఏం సమాధానం ఇస్తారో చూస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని